Dahi kabab: గడ్డ పెరుగుతో చేసే దహీ కబాబ్.. తినడం ఆపలేరు..-how to make dahi kabab in easy way with great taste at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dahi Kabab: గడ్డ పెరుగుతో చేసే దహీ కబాబ్.. తినడం ఆపలేరు..

Dahi kabab: గడ్డ పెరుగుతో చేసే దహీ కబాబ్.. తినడం ఆపలేరు..

Koutik Pranaya Sree HT Telugu
Jun 29, 2024 03:30 PM IST

Dahi kabab: పెరుగునే ఎక్కువగా వాడి చేసే దహీ కబాబ్ రుచి చాలా బాగుంటుంది. ఈ కమ్మని వంటకం ఎలా చేయాలో తెల్సుకోండి.

దహీ కబాబ్
దహీ కబాబ్ (freepik)

దహీ కబాబ్ పెరుగుతో చేస్తారు. పెరుగులో తప్ప పెద్దగా వేరే పిండి ఎక్కువగా వాడరు. పెరుగులో నీళ్లన్నీ పోయేలా చేసి, గట్టిగా అయిన పెరుగులో అన్ని పదార్థాలు కలిపి కబాబ్స్ తయారు చేస్తారు. సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇవి చేసిస్తే ఎన్నయినా తినేయొచ్చు. వీటిని ఈ వర్షాకాలం చల్లని సాయంత్రాల్లో ఆస్వాదించేయండి. వాటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.

దహీ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల గట్టి పెరుగు

3 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

గుప్పెడు కొత్తిమీర సన్నటి తరుగు

తగినంత ఉప్పు

1 చెంచా కారం

1 చెంచా ధనియాల పొడి

1 చెంచా జీలకర్ర పొడి

1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి

సగం కప్పు బ్రెడ్ క్రంబ్స్

పావు టీస్పూన్ గరం మసాలా

పావు కప్పు కార్న్ ఫ్లోర్

1 ఉల్లిపాయ, సన్నం ముక్కలు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

ఫిల్లింగ్ కోసం:

పావు కప్పు జీడిపప్పు

3 చెంచాల పల్లీలు

2 చెంచాల ఎండు ద్రాక్ష

దహీ కబాబ్ తయారీ విధానం:

  1. ఈ కబాబ్ తయారీ కోసం గట్టి పెరుగును వాడాలి. బజార్లో దొరకింది తెచ్చుకుని వాడొచ్చు. ఇంట్లో చేయాలంటే పెరుగును కాటన్ వస్త్రంలో మూట కట్టి వేళాడదీస్తే నీళ్లు వడిచిపోతాయి. రెండు మూడు గంటల్లో గట్టి పెరుగు రెడీ అవుతుంది. చెప్పాలంటే పెరుగు ముద్దలాగా గట్టిగా అవుతుంది.
  2. ఈ పెరుగును ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. అందులో పచ్చిమర్చి ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి.
  3. అన్నీ కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి. వీటివల్ల పిండిలాగా గట్టిగా అవుతుంది.
  4. పిండి కాస్త నీళ్లుగా అనిపించినా, చేతికి అంటుకున్నా మరికొన్ని బ్రెడ్ క్రంబ్స్ కలుపుకోండి. ఒకసారి పైపైన మరోసారి కలిపితే చాలు.
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ ఉండలను అరచేతిలో పెట్టి కాస్త ఒత్తాలి.
  6. వీటి మధ్యలో స్టఫ్ఫింగ్ పెట్టుకుంటే రుచి బాగుంటుంది. దానికోసం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును సన్నం ముక్కలు, వేయించుకున్న పల్లీల చిన్నగా ముక్కలు చేసుకోవాలి.
  7. ఉండ మధ్యలో జీడిపప్పు ముక్కలు, పల్లీల ముక్కలు, ఎండుద్రాక్ష పెట్టుకొని ఉండ మూసేయాలి.
  8. ఇప్పుడు కాస్త ఒత్తినట్లు చేస్తే కబాబ్ ఆకారం వస్తుంది. అన్నీ అలాగే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
  9. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ స్టార్చ్ వేసుకుని దాంట్లో కబాబ్ ను దొర్లించాలి.
  10. కడాయి పెట్టుకుని వేడెక్కాక నూనె పోసుకోవాలి. నూనె వేడి అయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న కబాబ్ వేసుకుని బంగారు వర్ణం లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే.. దహీ కబాబ్ రెడీ అయినట్లే..
  11. ఈ కబాబ్స్ గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు పెట్టి సర్వ్ చేసుకుంటే చాలు. రుచి అదిరిపోతుంది.

WhatsApp channel