Chamakura Potlalu: వర్షాకాలంలో ఒక్కసారైనా చామకూర పొట్లాలు వండాల్సిందే.. ఆరోగ్యంతో పాటూ రుచి-how to make chamakura potlalu curry for immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chamakura Potlalu: వర్షాకాలంలో ఒక్కసారైనా చామకూర పొట్లాలు వండాల్సిందే.. ఆరోగ్యంతో పాటూ రుచి

Chamakura Potlalu: వర్షాకాలంలో ఒక్కసారైనా చామకూర పొట్లాలు వండాల్సిందే.. ఆరోగ్యంతో పాటూ రుచి

Koutik Pranaya Sree HT Telugu
Aug 10, 2024 11:30 AM IST

Chamakura Potlalu: వర్షాకాలంలో చామకూర తినడం ఆరోగ్యదాయకం. వారానికి ఒక్కసారైనా దీన్ని వంటల్లో చేర్చుకోవాల్సిందే. రుచికరమైన చామాకు లేదా చామకూర పొట్లాలు ఒక్కసారి ప్రయత్నిస్తే మీరే వాటిని క్రమం తప్పకుండా వండుకుంటారు.

చామాకు పొట్లాలు
చామాకు పొట్లాలు

చామకూర లేదా చామాకు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గి వచ్చే అనేక వ్యాధులనుంచి చామాకు కాపాడుతుందని పెద్దవాళ్లు చెబుతారు. వర్షాల కాలంలో వారానికి కనీసం ఒక్కసారైనా చామకూర తింటే ఏ జ్వరాలు రావంటారు. అయితే చామకూరతో చేసే సాంప్రదాయ వంటకం ఒకటుంది. దీనితో చేసే చామాకు పొట్లాలు రుచిలో చాలా బాగుంటాయి. వాటిని ఎలా తయారు చేయాలో చూడండి.

చామాకు పొట్లాల తయారీకి కావాల్సిన పదార్థాలు:

10 నుంచి 12 చామాకులు

1 కప్పు శనగపప్పు

4 పచ్చిమిర్చి

గుప్పెడు కొత్తిమీర

1 కరివేపాకు రెమ్మ

1 చెంచా జీలకర్ర

అంగుళం అల్లం ముక్క

గుప్పెడె పుదీనా ఆకులు

అరచెంచా ఉప్పు

చామాకు పొట్లాల తయారీ విధానం:

1. ముందుగా చామాకుల కాడలు తుంచేసి ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి.

2. శనగపప్పు కూడా కడుక్కుని కనీసం నాలుగు గంటలు లేదా రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి.

3. నానబెట్టిన శనగపప్పును ఒక రెండు చెంచాలు పక్కన పెట్టుకోవాలి. మిగతా పప్పును మిక్సీలో వేసుకోవాలి. ఒకసారి బరకగా తిప్పి అందులో అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర వేసుకోవాలి.

4. అన్నీ కలిసేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లేమీ కలపకుండా వీలైనంత సన్నగా పట్టుకోవాలి.

5. ఈ ముద్దను ఒక బౌల్‌లోకి తీసుకుని మరికాస్త పచ్చిమిర్చి ముద్ద, పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

6. ఇప్పుడు చామాకు తీసుకుని ఆకు వెనక వైపున పప్పు ముద్దను మధ్యలో పెట్టుకోవాలి.

7. ఇప్పుడు ఆకును పొట్లం లాగా నాలుగు వైపుల నుంచి మడత పెట్టుకోవాలి. అవి ఊడిపోకుండా దారంతో కట్టుకోవాలి. అన్ని ఆకులు ఇలాగే రెడీ చేసుకోవాలి.

8. లోతు తక్కువున్న ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకోవాలి. అందులో మూడ్నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి. కాస్త వేడెక్కాక అందులో ముందుగా పొట్లం కట్టుకున్న చామాకులు సర్దుకోవాలి.

9. మూత పెట్టుకుంటూ నూనెలో ఆకుల్ని ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపటికి ఆకు రంగు మారి క్రిస్పీగా అవుతుంది. అంతే వాటిని బయటకు తీసుకుంటే చామాకు పొట్లాలు రెడీ అయినట్లే.

10. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు ఈ పొట్లాలను చిన్న ముక్కల్లాగా చేసిస్తే సులువుగా తినేస్తారు. సాయంత్రం పూట స్నాక్ లాగానూ ఇవి బాగుంటాయి.

11. మీకు ఇలాగే తినడం ఇష్టం లేకపోతే ఈ ఉడికిన పొట్లాలను చిన్న ముక్కలుగా చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి తాలింపు వేసుకుని కూరలాగా తినొచ్చు.