Carrot Pickle Recipe: కారంగా, కాస్త తియ్యగా అదిరే టేస్ట్‌తో క్యారెట్ నిల్వ పచ్చడి.. తయారీ ఇలా..
Carrot Pickle Recipe: క్యారెట్‍తో టేస్టీగా నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. కారంగా.. ముక్కలు కాస్త తియ్యగా ఉంటూ ఈ పచ్చడి విభిన్నమైన రుచితో ఉంటుంది. ఈ క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
Carrot Pickle Recipe: కారంగా, కాస్త తియ్యగా అదిరే టేస్ట్‌తో క్యారెట్ నిల్వ పచ్చడి.. తయారీ ఇలా..
క్యారెట్‍తో కూడా నిల్వ పచ్చడి చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది సులువుగా తయారు చేసుకోవచ్చు. కారం, తియ్యగా ఈ పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. స్పైసీగా ఉండే పచ్చడిలో స్వీట్‍గా క్యారెట్ ముక్కలు తగులుతుంటే నాలుకకు డిఫరెంట్ రుచి ఉంటుంది. ఈ పచ్చడి వావ్ అనిపిస్తుంది. ఈ క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలంటే..
క్యారెట్ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు
- 250 గ్రాముల క్యారెట్ (తోలు తీసి ముక్కలుగా కట్ చేసి కాసేపు ఆరబెట్టాలి)
- 130 మిల్లీలీటర్ల నూనె (అరకప్పు కంటే కాస్త ఎక్కువ)
- ఆరు ఎండుమిర్చి
- ఓ ఇంచు అల్లం (సన్నగా తరగాలి)
- రెండు టేబుల్ స్పూన్‍ల కారం
- రెండు టేబుల్ స్పూన్‍ల కారం
- ఓ టీస్పూన్ మెంతులు
- ఓ టీస్పూన్ జీలకర్ర
- ఓ టీస్పూన్ ఆవాలు
- రెండు రెబ్బల కరివేపాకు
- అర చెంచా పసుపు
- ఓ టీస్పూన్ వేయించిన ఆవపిండి
- అర స్పూన్ వేయించిన మెంతిపిండి
- రెండున్నర టేబుల్ స్పూన్‍ల నిమ్మరసం
క్యారెట్ పచ్చడి తయారీ విధానం
- ముందుగా క్యారెట్లపై తోలు తీసి దానిపై ఉన్న తేమను ఓ క్లాత్‍తో తుడవాలి. ఆ తర్వాత చిన్న క్యూబ్‍లుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తేమ ఆరేలా ఓ పది నిమిషాలు గాలికి ఆరబెట్టాలి. అల్లం కూడా చిన్నగా తరిగి వాటితో పాటు ఆరబెట్టాలి.
- స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఎండుమిర్చి వేగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి కలుపుతూ వేయించాలి. తాలింపు మాడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత తాలింపును పక్కన ఉంచుకోవాలి.
- క్యారెట్ ముక్కలను ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, వేయించిన మెంతిపొడి, వేయించిన ఆవపిండి వేసి గరిటెతో బాగా కలపాలి.
- ఆ తర్వాత ఆ క్యారెట్ ముక్కల్లో చల్లారిన తాలింపు వేసుకోవాలి. చివర్లో నిమ్మరసం వేసుకోవాలి. ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత ముక్కలను ఓ ఎయిర్ టైట్ డబ్బాలో లేదా జాడీలో పెట్టాలి. రెండు రోజుల తర్వాత బాగా ఊరుతుంది. అంతే క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది.
ఇలా చేసిన క్యారెట్ పచ్చడి 45 రోజుల నుంచి 60 రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. పెరుగన్నంలోకి కూడా బాగా సూటవుతుంది. కారం, తియ్యగా విభిన్నమైన రుచితో వారెవా అనిపిస్తుంది.