Avocado Pasta Recipe | అవకాడోతో పాస్తా.. ఎప్పుడైనా ట్రై చేశారా?-how to make avocado pasta in 15 minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Make Avocado Pasta In 15 Minutes

Avocado Pasta Recipe | అవకాడోతో పాస్తా.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Himabindu Ponnaganti HT Telugu
Dec 16, 2021 04:24 PM IST

అవకాడో ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాస్తా అంటే చాలా మందికి ఇష్టం. వైట్ సాస్, రెడ్ సాస్ తో పాస్తా లాగించేస్తాం. అవకాడో - పాస్తా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

అవకాడో పాస్తా
అవకాడో పాస్తా

కావల్సిన పదార్థాలు:

పాస్తా: ఒక కప్పు

అవకాడో: రెండు

పాలకూర తురుము: అర కప్పు

కొత్తిమీర: కొద్దిగా

ఉప్పు: తగినంత

ఆలివ్‌ ఆయిల్‌: రెండు టేబుల్‌ స్పూన్లు

నిమ్మరసం: రెండు టీస్పూన్లు

మిరియాల పొడి: అర టీస్పూన్‌

వెల్లుల్లి రెబ్బలు: నాలుగు

చిల్లీ ఫ్లేక్స్‌: కొద్దిగా

తయారీ విధానం స్టెప్ బై స్టెప్:

1. కొద్దిగా ఉప్పు, నూనె వేసిన నీళ్లలో పది నిమిషాలపాటు పాస్తాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 

2. అవకాడో కట్ చేసి గుజ్జు తీసి పెట్టుకోవాలి. 

3. ఒక మిక్సీ జారులో అవకాడో గుజ్జు, పాలకూర తురుము, కొత్తిమీర, ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, పాస్తా ఉడికించిన నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 

4. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి వేడయ్యాక కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసుకుని.. రుబ్బి పెట్టుకున్న అవకాడో పేస్టును వేసి ఒక నిమిషంపాటు ఉడికించాలి. 

5. ఈ మిశ్రమానికి పాస్తా కూడా జత చేసి మరో రెండు నిమిషాలు కలపాలి. 

6. చివరగా చిల్లీ ఫ్లేక్స్‌ చల్లుకుంటే చాలు యమ్మీ యమ్మీ అవకాడో పాస్తా సిద్ధం. 

అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు

- అవకాడో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి-6 పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. 

- అవ‌కాడాల్లో అధిక మోతాదులో ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బీపీని త‌గ్గిస్తుంది.

- అవ‌కాడోల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. త‌ర‌చూ తింటే క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

- అవ‌కాడోల్లో అధికంగా ఉండే డైట‌రీ ఫైబ‌ర్ జీర్ణ క్రియ‌ను నెమ్మ‌దింప‌జేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. 

అవకాడోలోని పోషక విలువలు 

100 గ్రాముల అవకాడో 72.33 గ్రాముల నీరు, 167 కిలోకాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఖనిజాలు, పోషకాలు బాగా ఉంటాయి. 

అవకాడో రకాలు: 1. హాస్ అవకాడో 2. మలుమ అవకాడో 3. ఫ్యూర్టె అవకాడో 4. బేకాన్ అవకాడో 5. వుర్ట్జ్ అవెకాడో 6. షర్విల్ అవెకాడో 7. పింకర్టాన్ అవకాడో

WhatsApp channel

సంబంధిత కథనం