మీరు కొన్న పట్టుచీరలోని పట్టు దారాలు నిజమైనవో నకిలీవో ఇలా తెలుసుకోండి-how to know if the silk threads in the silk saree you bought are real or fake ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీరు కొన్న పట్టుచీరలోని పట్టు దారాలు నిజమైనవో నకిలీవో ఇలా తెలుసుకోండి

మీరు కొన్న పట్టుచీరలోని పట్టు దారాలు నిజమైనవో నకిలీవో ఇలా తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

ప్రతి మహిళ దగ్గర ఒక పట్టు చీర కచ్చితంగా ఉంటుంది. పట్టు దారాలతో నేసిన పట్టుచీర ఖరీదు కూడా ఎక్కువ. అయితే ఈ మధ్య నకిలీ పట్టు దారాలు వస్తున్నాయి. కాబట్టి మీ పట్టు చీరను ఇంట్లోనే పరీక్షించుకోవాలి.

పట్టుచీర (elampillaisareesonline)

పట్టు చీరలు భారతీయ స్త్రీల సాంప్రదాయ చిహ్నాలుగా మారాయి. ప్రతి మహిళ దగ్గర కచ్చితంగా ఒక పట్టు చీర ఉంటుంది. ఇవి భారతీయ కళాత్మకతకు సూచికలు. మార్కెట్లో అసలైన పట్టు చీరలతో పాటు నకిలీ పట్టు దారాలు కూడా లభిస్తున్నాయి.

నకిలీ పట్టు దారాలతో నేసిన పట్టు చీరలను అమ్మి లక్షలు గడిస్తున్న వ్యాపారులు కూడా ఉన్నారు. అందుకే నిజమైన పట్టుకు నకిలీ పట్టుకు మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బర్న్ టెస్ట్

మీరు కొన్న పట్టుచీరను పరీక్షించేందుకు సిద్ధమవ్వండి. ఇంట్లోనే ఈ పరీక్షను చేసుకోవచ్చు. ముందుగా బర్న్ టెస్ట్ చేయడం ద్వారా మీ పట్టు అసలైనదో, నకిలీదో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీనికోసం మీ చీరల నుంచి ఒక చిన్న దారపు ముక్కను బయటకు తీయండి. దాన్ని కొవ్వొత్తి వెలిగించి కాల్చండి. నిజమైన పట్టు కాలిపోయాక దాని అవశేషాలు నల్లగా, మెత్తగా, క్రంచిగా ఉంటాయి. దాని నుంచి కాలిన జుట్టు వాసన వస్తుంది. అదే పాలిస్టర్, నైలాన్ దారాలతో తయారు చేసిన నకిలీ పట్టును కాలిస్తే వృత్తాకారంగా పూసలుగా రాలిపోతుంది. ఇది గట్టిగా ఉంటుంది. కాలిన ప్లాస్టిక్ వాసన వస్తుంది.

నిజమైన పట్టు దారాలను చేతితో తాకి కూడా తెలుసుకోవచ్చు. పట్టు నూలును తాకినప్పుడు అది మృదువుగా మెత్తగా అనిపిస్తుంది. దానిని రెండువేల మధ్య వేగంగా రుద్దినప్పుడు కాస్త వెచ్చదనం వస్తుంది. ఇక కృత్రిమమైన నకిలీ పట్టు దారాల్లో ముట్టుకుంటే మృదువుగా ఉండదు. చల్లగా జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

కంజిపట్టు చీర
కంజిపట్టు చీర (jsbabusilks)

సేంద్రీయ వాసన వస్తుంది

పట్టుచీరను ఉతికినప్పుడు అది తడిగా ఉంటుంది. అలా తడిగా ఉన్నప్పుడు దాని వాసన చూడండి. అది స్వచ్ఛమైన పట్టు అయితే సేంద్రియ వాసనను వేస్తుంది. అదే నకిలీ పట్టుతో తయారైనదైతే ప్లాస్టిక్ లేదా రసాయనాల వాసన వస్తుంది.

చిన్నవస్త్ర పరీక్ష ద్వారా కూడా అసలైన పట్టును నకిలీ పట్టు మధ్య తేడాను కనిపెట్టవచ్చు. మీరు ఈ పట్టు చీరను రుద్దడానికి మరొక చిన్న వస్త్రాన్ని తీసుకోండి. లేదా మీ వేళ్ళను ఉపయోగించినా సరిపోతుంది. మీ వేళ్ళతో లేదా మరొక చిన్న వస్త్రంతో ఈ పట్టు చీరను వేగంగా రుద్దండి. శబ్దం వచ్చేలా రుద్దాలి. అలా చేసినప్పుడు అదొక రకమైన చిన్న సిల్క్ మ్యూజిక్ వస్తుంది. అదే నకిలీదైతే కృత్రిమ ధ్వని ఉత్పత్తి అవుతుంది. మీరు ఈ రెండిటి మధ్య తేడాను సులువుగా కనిపెట్టగలరు.

కాంతి పరీక్ష

వెలుగు పరీక్ష ద్వారా కూడా పట్టు మంచిదో కాదో తెలుసుకోవచ్చు. ఒక లైట్ కింద ఈ పట్టు చీరను విప్పి పట్టుకోండి. దానిని షేడ్స్ రూపంలో కొంచెం కదుపుతూ కాంతిని ప్రతిబింబించేలా చూడండి. నిజమైన పట్టు అయితే రెండు వేరువేరు రంగులను మీకు చూపిస్తుంది. అదే నకిలీ పట్టు అయితే కేవలం ఒకే రంగులో నిశ్చయంగా ఉంటుంది.

పట్టు చీరలో నేత ఎంతో అందంగా ఉంటుంది. బంగారు, వెండి దారాలను కలుపుతారు. నేరుగా వాటిని వాడకపోయినా ఆ పూత పూసిన దారాలను వినియోగిస్తారు. అదే నకిలీ పట్టు చీరలో అయితే నైలాన్, ప్లాస్టిక్ దారాలను వాడుతూ ఉంటారు.

అందమైన పట్టు చీర
అందమైన పట్టు చీర (gayathrisarees)

అసలైన పట్టు చీరలకు సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా టాగ్ కచ్చితంగా ఉంటుంది. ఈ అధికారిక ధ్రువీకరణ ఉన్న చీరను కొనుక్కుంటే అది కచ్చితంగా అసలైన పట్టు.

స్వచ్ఛమైన పట్టు చీరలు చాలా ఖరీదైనవి. ఎందుకంటే దాన్ని చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. అదే నకిలీ పట్టు చీరలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. మీకు తక్కువ ధరకే చీరలు దొరుకుతున్నాయంటే అది నకిలీ పట్టుచీర అని అర్థం చేసుకోవాలి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.