Deep Sleep Tips: నిద్రపోయే ముందు ఈ చిట్కాలు పాటిస్తే, నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు
Sleep Tips: మనలో చాలా మందికి పడుకోగానే నిద్ర రాదు. దానికి కారణాలు అనేకం.. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఎవ్వరైనా సరే నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నిద్ర మన శరీరానికే కాదు మనసుకి కూడా చాలా అవసరం. సగటున మనిషి రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. కానీ.. కొంత మందికి పడుకున్న వెంటనే నిద్ర రాదు. బెడ్‌పై అర్ధరాత్రి వరకు అటు ఇటు దొర్లితేగానీ నిద్రపోరు. పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోవాలంటే ఈ కొన్ని చిట్కాలు పాటించాలి.
సమయం కేటాయింపు
ప్రతిరోజు ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడం ద్వారా మీ శరీరం అందుకు అలవాటు పడుతుంది. దీని వల్ల పడుకున్న వెంటనే నిద్రలోకి వెళ్లడం సులభం అవుతుంది. నిద్రకు ముందుగా తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. అలానే నిద్రకి కనీసం 2-3 గంటల ముందు మీ రాత్రి భోజనాన్ని పూర్తి చేయాలి.
బెడ్ రూమ్ వాతావరణం
నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలపాటు ధ్యానం చేయడం మంచిది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలానే గదిలోనూ మంచి వాతావరణం ఉండేలా చూసుకోండి. వీలైతే కాసేపు సంగీతం వినండి. అన్నింటికంటే ముఖ్యంగా పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచండి.
వేడి నీటి స్నానం
నిద్రకు ముందు వేడినీటితో స్నానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం మంచిది. మంచం మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. గది చల్లగా, చీకటిగా ఉండడం కూడా మంచి నిద్రకి అవసరం. నిద్రపోయే ప్రదేశాన్ని కేవలం నిద్ర కోసం మాత్రమే వాడండి. ఆఫీస్ పని లేదా ఇతర వ్యాపకాల కోసం ఉపయోగించకపోవడం మంచిది.
నిద్ర వల్ల ఉపయోగాలు
బాగా నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. నిద్రలో మెదడు పూర్తిగా విశ్రాంతిని పొందుతూ అనవసరమైన జ్ఞాపకాలను చెరిపేస్తుంది. అప్పుడు మీ జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది. నిద్రలో మీ శరీరం దెబ్బతిన్న కండరాలు, కణజాలాలను రిపేర్ చేయడం, కొత్త కణాలను ఉత్పత్తి చేయడం, శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి ప్రక్రియను చేస్తుంటుంది.
స్కిల్స్ పెరుగుతాయి
చక్కటి నిద్రపోయినప్పుడు మన భావాల్ని కంట్రోల్ చేసుకోవడం సులభం అవుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఒత్తిడిని, ఆవేశాన్ని, కుంగుబాటు భావాలను ఎదుర్కొంటారు. నిద్రపోవడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.
మంచిగా నిద్రపోవడం వల్ల దైనందిన జీవితంలో ఏకాగ్రత మెరుగవుతుంది. దీని వల్ల మీ రోజువారి పనితీరు కూడా మెరుగవుతుంది.. అలానే సృజనాత్మకత కూడా పెరుగుతుంది. శరీరం, మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుంటే.. ఎలాంటి అంతరాయం లేకుండా పడుకున్న వెంటనే నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి జారుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.