Heart Broken Situation : మీరు లవ్ ఫెయిల్యూరా? మీ హార్ట్ బ్రేక్ అయిందా? ఇలా చేయండి
Heart Broken : ఓ బంధంలో విడిపోడవమంటే నరకమే. పగిలిన మనసుతో జీవించడం అనేది కచ్చితంగా ఓ పెద్ద సవాలు. కానీ ఎన్ని రోజులు? సమయం అనేది ప్రతీ విషయాన్ని మార్చేస్తుంది. కాలమే అన్నింటికి సమాధానం. అలా అని అందులోనే ఉండిపోకూడదు. బాధ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలి.
ప్రేమలో విఫలం, ప్రియమైన వ్యక్తి మరణం, బంధం విడిపోవడానికి సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని మళ్లీ మళ్లీ వెంటాడుతూనే ఉన్నాయా? దాని వల్ల మీరు గుండె నొప్పితో బాధపడుతున్నారా? ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. మీ మనసుకు అయిన గాయాన్ని బట్టి మీరు కోలుకోవాల్సిన సమయం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్ట సమయాలను దాటాలి.. దాటుతారు.
ఓ మనిషి దూరమైతే.. మనసులు భరించలేని నొప్పి ఉంటుంది. విచారం, కన్నీళ్లు, దుఃఖం, శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. శారీరకంగా మీరు నిద్రలేమి, ఆకలి లేకపోవడం, అలసట, తలనొప్పిని కూడా ఎదుర్కొంటారు. స్నేహితులకు దూరమవుతారు. సామాజిక బాధ్యతలకు దూరంగా ఉంటారు. మీకు దగ్గరగా ఉన్న వారి నుండి ఒంటరిగా ఉంటారు. మీకు మీరే శిక్షను వేసుకుంటారు. మిమ్మల్ని మీరు మనసులోని బాధతో బందీ చేసుకుంటారు. బంధం నుంచి దూరమైన విషయం గురించి పదే పదే ఆలోచిస్తారు. దేనితోనూ అటాచ్ అవ్వరు. ఏ వేడుకలోనూ పాల్గొనరు.
ఇలాంటివి జీవితంలో రావడం సహజం. ఎదుర్కొన్నవాడే నిజమైన మనిషి. అదే బాధలో కూరుకుపోతే మీకంటే మూర్ఖులు ఎవరూ ఉండరు. మీకు సమస్య ఉందని, అది సాధారణమైనదని గ్రహించాలి. అవసరమైతే స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సలహాలు, మార్గదర్శకాలను అనుసరించాలి.
అవసరమైతే ధ్యానం చేసి మనశ్శాంతిని పొందండి. ఇది మీ భావోద్వేగాలను మరోవైపు తీసుకెళ్తుంది. మిమ్మల్ని శాంతింపజేస్తుంది. భయాన్ని, ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ధ్యానం ద్వారా మనశ్శాంతి, స్వీయ విశ్రాంతిని పొందవచ్చు. ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి. గతం గురించి పశ్చాత్తాపపడడం లేదా భవిష్యత్తు గురించి పశ్చాత్తాపం చెందడం వల్ల గుండెపోటు వస్తుందని నిపుణులు అంటున్నారు.
జీవితంలో నుంచి ఒకరు వెళ్లిపోతే లైఫ్ అక్కడితో అయిపోదు.. అక్కడితో ఆగిపోదు. చూడాల్సింది చాలా ఉంది. మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రాముఖ్యత ఇవ్వండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి దారి తీస్తుంది. వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
సంబంధం వల్ల మీ హృదయం పగిలిపోతే.. మీ మానసిక ఆరోగ్యాన్ని రక్షించే ఆరోగ్యకరమైన సరిహద్దులను సెట్ చేయండి. భవిష్యత్తులో మీ బాధను తగ్గిస్తుంది. బాధ తాత్కలికం.. దానికంటే ఎక్కువే మీ జీవితం. మీ ఆసక్తులు, అభిరుచులను తిరిగి కనుగొనండి. కొత్త హాబీలను ఎంచుకోవాలి. మిమ్మల్ని వదిలేసిన వాళ్లు.. మిస్ చేసుకున్నామనే ఫీల్ కలిగేలా బతకాలి.
మెుదట జరిగిపోయిందేదో జరిగిపోయిందని మిమ్మల్ని మీరు క్షమించండి. మీకు ఇంత పెద్ద గాయం కావడానికి కారణం మీరే. ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం ముమ్మటికీ మీ తప్పే. నొప్పితో మిమ్మల్ని బంధించే ప్రతిదాన్ని వదిలేయడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని బాధపెట్టిన వారిపై దృష్టి పెట్టవద్దు. అసలు వారి గురించి ఆలోచించొద్దు.
మీకు దగ్గరగా ఉన్న వారితో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండండి. ముఖ్యంగా ఇలాంటి బాధను ఇప్పటికే అనుభవించిన వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. మీ బాధను ఇతరులకు తెలియజేసినప్పుడు, అది తగ్గిపోతుంది. వారు కూడా కొన్ని రకాల సలాహాలు ఇస్తారు.
మిమ్మల్ని రక్షించడానికి సానుకూలంగా ఆలోచించాలి. ప్రతికూల ఆలోచనలు మానుకోండి. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి ప్రయాణం చేయండి. మీరు దాని నుండి ఆనందాన్ని పొందుతారు. మీరు కోలుకున్నప్పుడు, నిజమైన ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ మనసులోని బాధను నయం చేయడానికి సమయం పడుతుంది. కానీ కచ్చితంగా కాలం అనేది మారుతుంది. మీకు మంచి రోజు వస్తుంది. మనం ఇష్టపడిన వాళ్లు జీవితంలో నుంచి వెళ్లిపోయారని.. మనం కూడా మన జీవితంలో నుంచి వెళ్లిపోకూడదు. జీవితమంటేనే పోరాటం.. నిన్ను పరీక్షించేందుకు సవాళ్లు వస్తుంటాయి. గతంలోని బాధతో ప్రస్తుతాన్ని నాశనం చేసి.. భవిష్యత్ అంధకారం చేసుకోకూడదు. ఈరోజు హ్యాపీగా జీవించు..చీర్స్..!