Kitchen Tips: వంట పాత్రల నుంచి వస్తున్న వాసన ఎలా పోగొట్టాలి? ఈ 6 టిప్స్ పాటించండి
Kitchen Tips - Utensil Cleaning: కొన్ని రకాల వంటలు వండిన తర్వాత పాత్రల నుంచి వాసన ఎక్కువగా వస్తుంది. ఎంత తోమినా వాసన మాత్రం పోదు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే వాసన ఇట్టే పోతుంది. అవేంటంటే..
మాంసం, గుడ్లు లాంటివి వండిన సమయంలో వంట పాత్రల నుంచి నీచు వాసన ఎక్కువగా వస్తుంటుంది. కొన్ని రకాల మసాలాలు వేసి వండినప్పుడు కూడా ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. పాత్రలను ఎంత తోమినా నీచు వాసన మాత్రం వస్తుంటుంది. ఇది వంటింట్లో చిరాకు కలిగిస్తూ ఉంటుంది. ఏం చేయాలనే ఆందోళన నెలకొంటుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే వంట పాత్రల నుంచి వచ్చే వాసన పోతుంది. అలా వాసన తొలిగేందుకు సహకరించే 6 టిప్స్ ఇక్కడ చూడండి.
వైట్ వెనిగర్
వెనిగర్‌కు శుభ్రం చేసే గుణాలు మెండుగా ఉంటాయి. వంట పాత్ర నుంచి వచ్చే వాసనను ఇది ప్రభావంతంగా పోగొడుతుంది. ముందుగా పాత్రను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ వంట పాత్రలో కాస్త వెనిగర్ చల్లి.. కాసేపు ఆగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేస్తే పాత్ర వాసన పోతుంది.
నిమ్మకాయ
నిమ్మకాయలోనూ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాసన పోగొట్టేందుకు ఇది కూడా పని చేస్తుంది. వాసన వచ్చే పాత్రను పూర్తిగా నీటితో నింపి దాంట్లో నిమ్మరసం పిండి కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత పాత్రను డిష్‍వాష్‍తో శుభ్రం చేయాలి. లేకపోతే నిమ్మచెక్కతోనే పాత్రను రుద్దినా వాసన పోతుంది.
కాఫీ పొడి
పాత్ర వాసనను పోగొట్టేందుకు కాఫీ పొడిగా కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని నైట్రోజెన్ ఇందుకు సహకరిస్తుంది. ముందుగా పాత్రలో ఓ టేబుల్‍స్పూన్ కాఫీ పొడి వేయాలి. అనంతరం నీటితో నింపాలి. దాన్ని పొయ్యిపై ఓ రెండు నిమిషాలు మరిగించి మంట ఆర్పేయాలి. దాన్ని అలాగే ఓ పావుగంట పక్కనపెట్టాలి. ఆ తర్వాత డిష్‍వాషర్ పాత్రను క్లీన్ చేసుకోవాలి.
వంట సోడా
ఒకవేళ పాత్రల నుంచి మరీ విపరీతంగా వాసన వస్తుంటే వంట సోడా (బేకింగ్ సోడా) ఉపయోగించవచ్చు. ఈ సోడాలో క్లీనింగ్ గుణాలు చాలా ఉంటాయి. ముందుగా ఓ పెద్ద పాత్రలో నీరు పోసుకొని.. దాంట్లో వాసన వచ్చే పాత్రను ముంచాలి. నీటిలో రెండు చిటికెళ్ల వంట సోడా వేయాలి. నీటిని కాసేపు మరిగించాలి. ఆ తర్వాత పాత్రను నీటి నుంచి బయటికి తీయాలి.
శనగపిండి
శనగపిండి కూడా వంట పాత్రల్లోని వాసనను పోగొట్టగలదు. దీనికి వాసనను పీల్చుకునే గుణం ఉంటుంది. దీంతో వాసనను తొలగిస్తుంది. వాసన వచ్చే పాత్రలో శనగపిండిని కాస్త చిలకరించాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాత్రను గడగాలి. దీంతో ఆ పాత్ర వాసన పోతుంది.
దాల్చిన చెక్క
వంట నుంచి వాసన వస్తుంటే దాల్చిన చెక్కను వినియోగించవచ్చు. పాత్రలో దాల్చిన చెక్క పొడి లేదా ఓ రెండు చిన్న ముక్కలు వేసి, నిండుగా నీరు పోసి స్టవ్‍పై సుమారు 5 నిమిషాలు మరిగించాలి. చల్లారాక నీటిని పారబోస్తే వాసన పోతుంది.
టాపిక్