Lizards Avoiding Tips : ఈ చిట్కాలతో ఇంట్లో నుంచి బల్లులను శాశ్వతంగా తరిమికొట్టొచ్చు
Lizards Avoiding Tips Telugu : చాలా మందికి బల్లి అంటే భయం. ఇంటి గోడ మీద ఉంటే.. ఎక్కడ మీద పడుతుందోనని ఆందోళన పడతారు. అయితే శాశ్వతంగా బల్లులను ఇంట్లో నుంచి పంపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చాలా మందికి బల్లులంటే అసహ్యం ఉంటుంది. మరికొందరికి భయం కూడా ఎక్కువే. వంటగది, ఇంటి గోడలపై బల్లులు పాకడం మనకు చికాకు కలిగిస్తుంది. ష్.. ష్ అని ఎంత అరిచినా అవి వెళ్లవు. కొన్నిసార్లు మీద పడుతుంటాయి. ఇలా పడితే మంచి, చెడు రెండూ ఉంటాయని నమ్ముతారు. ఎందుకంటే బల్లికి శుకునం పరంగానూ ప్రాధాన్యత ఉంది. బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా వీటిని తొలగించవచ్చు.
వంటగది, కిటికీ, గోడ, ఇంటి మూలల్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ స్థలాలను గుర్తించండి. అక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లిని కోయండి. బల్లులు వాటి వాసనను ఇష్టపడవు. కాబట్టి అది అక్కడికి రాదు. ఈ పద్ధతి ద్వారా బల్లులను అక్కడ నుంచి తరిమికొట్టోచ్చు. బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయనే ప్రదేశాన్ని గుర్తించి.. మీరు అక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లి కోసి పెట్టాల్సి ఉంటుంది.
చాలా సార్లు గుడ్డు ఆమ్లెట్ వేసుకుని.. వాటి పెంకులను పడేస్తాం. కానీ వీటితో చాలా ఉపయోగం ఉందని కొద్ది మందికే తెలుసు. గుడ్డు ఆమ్లెట్ తయారుచేసిన తర్వాత వాటి పెంకులను పడేయకండి. బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఈ గుడ్ల పెంకులను వేలాడదీయండి. బల్లులకు గుడ్డు పెంకు వాసన నచ్చక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని చాలా మంది చెబుతారు.
నిమ్మరసంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. బల్లులను పొగొట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓ చిన్న డబ్బా తీసుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం పిండుకోవాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయను బాగా చూర్ణం చేసి అందులో వేయాలి. తర్వాత ఓ గుడ్డతో రసాన్ని తీసి.. మీ దగ్గర పుదీనా ఉంటే ఆ ఆకులను కూడా వేసుకోవచ్చు.
ఈ రసాన్ని ఒక సీసాలో వేసి బల్లి ఎక్కువ తిరిగే ప్రదేశంలో స్ర్పే చేయెుచ్చు. లేదా టిష్యూ పేపర్‌కు అంటించి.. బల్లి ఉండే ప్రదేశంలో ఉంచవచ్చు. ఇలా చేస్తే.. బల్లులు తిరిగి అటువైపు రావు. వారానికి రెండుసార్లు ఇలా చేయండి. దీంతో బొద్దింకలు కూడా తొలగిపోతాయి.
బ్లాక్ పెప్పర్ స్ప్రేని ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది బల్లులు తిరిగే ప్రదేశంలో కొట్టడం వల్ల అవి రాకుండా ఉంటాయి. ఇది స్ర్పే చేసేప్పుడు మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే.. కంటిలో పెప్పర్ పడితే మంటను తట్టుకోలేరు.
మీ ఇంట్లో AC ఉంటే, బల్లులను తరిమికొట్టేందుకు ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రతను తగ్గించండి. బల్లులకు చల్లని వాతావరణం నచ్చదు కాబట్టి అవి వెళ్లిపోతాయి.
ఇలా పైన చెప్పిన చిట్కాలను పాటించి బల్లులను మీ ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు. బల్లులను చంపడం మంచిది కాదని చెబుతారు. అందుకే వాటిని చంపకుండా మీ ఇంటివైపు రాకుండా చేయాలి. అందులో భాగంగా పైన చెప్పిన చిట్కాలను పాటించండి.