Parenting tips: పిల్లలపై కోపం తెచ్చుకుంటున్నారా? ఒక్క క్షణం ఇలా ఆలోచించండి..
ఇంటి పని, ఆఫీసు పని, రాకపోకలు ఇలా అన్ని ఒత్తిళ్ల మధ్య తల్లులు తమ పిల్లలపై తరచూ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. మాటలు వినని పిల్లలు తల్లి కోపానికి గురికావడం మామూలే. కానీ పిల్లలపై కోపం తెచ్చుకునే ముందు ఈ కథనాన్ని చదవండి.
చిన్నపిల్లలు ఉన్న తల్లులకు ముక్కు కొనపై కోపం రావడం సహజం. అమ్మ ఎంత ముచ్చటించినా, కౌగిలింతలతో ఆత్మీయత పంచినా.. కోపం వస్తే మాత్రం రాక్షసంగా కనిపిస్తుంది. అరవడం, కేకలు వేయడం, కొట్టడం ఇలా అన్నీ చేస్తుంది. ఎంత చెప్పినా వినని పిల్లలను చూస్తే తల్లికి కోపం వస్తుంది.
పిల్లలను చూసుకోవడమే కాకుండా ఇంటిపనులు, ఆఫీసు పనులు, బయటి పనులు అన్నీ తానే స్వయంగా చూసుకుంటుంది కాబట్టి సహజంగానే ఓపిక కోల్పోతుంది. కానీ పిల్లలను కొట్టడం, పిల్లలపై కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మరి తల్లికి కోపం రాకుండా పిల్లలతో నవ్వడం సాధ్యమేనా? ఈ రకమైన ప్రశ్నలు మనసులో సర్వసాధారణం. ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారం ఏమిటి?
మనిషికి కోపం రావడం సహజం. నిద్ర సరిగా లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నప్పుడు, లేదా ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఓపిక నశించడం సహజం. పిల్లల మీద ఆ కోపాన్ని ఎప్పుడూ బయట పెట్టకండి. ఇది అమాయక పిల్లలపై ప్రభావం చూపుతుంది.
మనసును మళ్లించండి
చాలాసార్లు తల్లులు తమ పిల్లలను తిట్టిన తర్వాత తమ తప్పు గుర్తిస్తుంటారు. కోపం వచ్చినప్పుడు వెంటనే ఆ స్థలం లేదా ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రయత్నించండి. అక్కడే ఉండి కోపాన్ని పెంచుకునే బదులు, వారిపై అరిచే బదులు ప్లేస్ మార్చుకోవడం బెటర్. మరో గదిలోకి వెళ్లండి. టీవీ చూడటం, సంగీతం వినడం లేదా మీకు కోపం వచ్చిన వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్లడం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో సహాయపడుతుంది.
నిశబ్దంగా ఉండండి
'మాట వెండి, మౌనం బంగారం' అనే సామెత ఉంది కాబట్టి కోపం వచ్చినప్పుడు మాట్లాడే బదులు కొన్ని నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. మౌనంగా ఉండడం ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీకు కోపం వచ్చినప్పుడు, మీ మనస్సులో ఒకటి నుండి వంద వరకు లెక్కించండి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కోపం కూడా చల్లబడుతుంది.
అర్థమయ్యే రీతిలో వివరించండి
కోపంతో పిల్లలను దుర్భాషలాడడం వల్ల ప్రయోజనం లేదు. వారు మరింత బాధపడతారు. కాబట్టి ‘నువ్వు నన్ను బాధపెడుతున్నావు. నాకు విచారం, బాధ కలుగుతాయి..’ అని చెప్పడం వల్ల వారి తప్పును సరిదిద్దుకోవడానికి వారికి సహాయం చేసినట్టవుతుంది.
పిల్లలకు వివరించడానికి ప్రయత్నించండి
పిల్లలు మొండిగా మారకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండండి. పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంచే పదాలు మాట్లాడండి. పిల్లలు చేసే ప్రతి పనిని ప్రోత్సహించాలి. అభినందించాలి. పిల్లలను ఆత్మీయంగా కౌగిలించుకొని మంచి మాటలు చెప్పి వారిని సరైన దిశలో నడిపించండి.
మీరు మీ పిల్లలపై కోపంగా ఉన్నప్పుడు, గత సంఘటనల గురించి వారికి చెప్పడం సరికాదు. ఇది వారి మనస్సుకు మరింత నష్టం కలిగిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా సమస్యలకు పరిష్కారాలు ఇవ్వండి.
మీ మనస్సును శాంతపరచడానికి మార్గాలు
మీరు ఊహించుకున్నందంతా నిజం కాదు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ఆలోచనలు ఓపేపర్ పై రాయండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. కోపం కూడా అదుపులోకి వస్తుంది. ప్రతిరోజూ మీ మనస్సును శాంతపరచడానికి మార్గాలను కనుగొనండి. ఒక్కమాటలో చెప్పాలంటే...వ్యాయామం చేయడం, సంగీతం వినడం, ధ్యానం చేయడం, పుస్తకం చదవడం, మీ పిల్లలను రోజూ బయటికి తీసుకెళ్లి వారితో ఆడుకోవడం వంటివి కూడా మీ కోపాన్ని అదుపులో ఉంచుతాయి.
పిల్లలకు చెప్పండి
మీరు పిల్లల ఆగ్రహావేశాలను తట్టుకోలేక కోపంతో పిల్లలను కొడితే వారు కూడా ఏడుస్తూ ఒక చోట కూర్చుంటారు. ఆ పరిస్థితి రానివ్వకండి. ఒకవేళ వచ్చినా పిల్లల దగ్గరకు వెళ్లి ఇలా కొట్టడం తప్పే.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రానివ్వనని పిల్లలకు క్షమాపణ చెబితే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు.
వ్యాసం: అక్షర కిరణ్