Panchatatva walk: పంచతత్వ మార్గంలో నడిచారంటే అన్ని రోగాలు మాయం, దాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేయొచ్చు
Panchatatva walk: పంచభూతాల స్ఫూర్తితో ఏర్పాటు చేసే పంచతత్వ మార్గం మీద నడిస్తే ఎన్నో లాభాలుంటాయి. ఈ ట్రాక్ మీద వాకింగ్ చేస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పంచతత్వ మార్గం ఇంట్లోనే ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో చూడండి.
వాకింగ్ చాలా మందికి ఒక అలవాటుగా మారిపోతోంది. ఏదో ఒక పూట వాకింగ్ చేయడానికి ప్రయత్నించే వాళ్ల సంఖ్య పెరిగింది. అయితే వాకింగ్ షూ వేసుకుని నడవడం కన్నా అనేక ప్రయోజనాలు ఇచ్చే పంచతత్వ వాకింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. ముఖ్య పట్టణాల్లో ప్రభుత్వమే కొన్ని పార్కుల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. అయితే వీటిని మీరే, మీ ఇంట్లోనే కాస్త స్థలం ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసిన పంచతత్వ మార్గం మీద నడిస్తే అనేక లాభాలుంటాయి.
పంచతత్వ వాక్ లాభాలు
నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం.. ఈ పంచభూతాల స్ఫూర్తితో ఏర్పాటు చేసేదే పంచతత్వ మార్గం. ఈ మార్గంలో నడవటం వల్ల పాదాల అంచున ఉండే నాడులు ఉత్తేజితం అవుతాయి. ఆక్యూప్రెజర్ జరిగి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
వృద్ధులు ఈ పంచతత్వ వాక్ చేయడం వల్ల కాళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. కంటి చూపు మెరుగవుతుంది. రోగనిరోధకశక్తి కూడా బాగుంటుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఆక్యూప్రెజర్ అవుతుంది. రక్త సరఫరా పెరుగుతుంది. మామూలుగా నడవడం కన్నా రాళ్లమీద, గడ్డిమీద చెప్పులు, షూ లేకుండా నడిస్తే మామూలు నడక కన్నా రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
వివిధ రకాల ఉపరితలాల మీద నడవడమే దీని ఉద్దేశం. అయితేనే లాభాలు పొందగలం. ముందు కాళ్లకు ఏమీ వేసుకోకుండా చిన్న రాళ్ల మీద నడవాలి. తర్వాత కాస్త మృదువుగా ఉండే రాళ్ల మీద నడిచాక ఇసుకలో నడుస్తారు. తర్వాత చెక్క ముక్కల మీద, తర్వాత నల్లబట్టి, ఎర్రమట్టి, చివరగా నీళ్లలో అడుగుపెడతారు.
దీని ప్రకారమే పంచతత్వ ట్రాక్ మీ స్లాబ్ మీదనో, ఇంటి ముందో ఏర్పాటు చేసుకోవచ్చు. ముందు రెండు మూడు అడుగుల ఎడంతో రెండు సమాంతర రేఖలు గీయండి. వాటిని 9 గడుల్లాగా విభజించండి. మొదటి గడిలో 20 మి. మి సైజున్న రాల్లు, తర్వాత 10 మి. మి సైజున్న గులకరాళ్లు, తర్వాత 6 మి. మి సైజున్న రాళ్లు ఒక్కో గడిలో పోసుకుంటూ వెళ్లండి.
తర్వాత నది తీరంలో దొరికే సన్నటి ఇసుక, కాస్త పెద్దగా ఉండే చెక్క ముక్కలు, నల్ల మట్టి ఒక్కోగడిలో పోయండి. చివరి గడి చుట్టూ సిమెంటుతో నీళ్లు ఆగేలా ఏర్పాటు కట్టి దాంట్లో నీళ్లు నింపండి. అంతే.. మీ పంచతత్వ వాక్ ట్రాక్ రెడీ అయినట్లే.
ఇక మొదలెడదాం
ఇప్పుడు మీరు పంచతత్వ వాక్ ట్రాక్ నిర్మించాక ఎలా మొదలుపెట్టాలో చూడండి. ముందు గుళకరాళ్లలో కాలు పెట్టండి. చాలా గరుగ్గా కుచ్చుతున్నట్లుంటుంది. అందులో నుంచి నడిచాక కాస్త చిన్న రాళ్లలో నడిస్తే బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఇసుకలో పెట్టగానే మెత్తని అనుభూతి పొందుతారు. చెక్కముక్కలు కాస్త బరకగా అనిపించినా ఏదో మసాజ్ అవుతున్నట్లనిపిస్తుంది. నల్లమట్టిలో అడుగు పెట్టగానే మీ పాదాలు ఆనందపడతాయి. చివరగా నీళ్లలో కాళ్లు పెట్టి నడిచి బయటకు వచ్చేయండి. అంతే.. మీ పంచతత్వ వాక్ పూర్తయినట్లే. ట్రాక్ పొడవు బట్టి ఎన్నిసార్లయినా దీంట్లో నడవొచ్చు.
టాపిక్