Kansa vatki: రాగి గిన్నెతో పాదాలకు మర్దనా ఎందుకు చేస్తారు? ఊహించలేని లాభాలు..
Kansa vatki: రాగిగిన్నెతో పాదాలకు మర్దనా చేసే ప్రక్రియ ఆయుర్వేదంలో ఉంది. దాని వల్ల లాభాలు, ఆ మసాజ్ చేసే పద్ధతి గురించి తెల్సుకోండి.
ఆయుర్వేదంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్య చెబితే చాలు ఆయుర్వేదం పరిష్కారం చెప్పేస్తుంది. రకరకాల మసాజ్ థెరపీలుంటాయి. హాట్ స్టోన్ థెరపీ, అరోమా థెరపీ.. ఇలా చాలా రకాలుంటాయి. ఒత్తిడి తగ్గించేవి కొన్నయితే, రకరకాల నొప్పులు తగ్గించేవి కొన్ని, రోగనిరోధక శక్తిని పెంచేవి మరికొన్ని.. అలాంటి వాటిలో ఒకటి కంసా వాటి.
కంసా వాటి అంటే ఏమిటి?
కన్సా అంటే రాగి, వాటి అంటే గిన్నె. ఈ పద్ధతిలో రాగి గిన్నెతో పాదాలకు మర్దనా చేస్తారు. దీని కోసం వాడే గిన్నె తయారీలో రాగితో పాటూ జింక్, టిన్ కూడా వాడతారు. వీటి వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రాగి వల్ల వాపు తగ్గుతుంది. నొప్పులు తగ్గుతాయి. జింక్ వల్ల రోగ నిరోధక శక్తి, జీర్ణ శక్తి పెరుగుతుంది. టిన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ గిన్నెను పాదాల అడుగున ఉండే మర్మ కేంద్రాల మీద మర్దనా చేయడం వల్ల శరీరం, మెదడు మధ్య సమన్వయం పెరుగుతుంది. అయితే ఈ మర్దనాను అందరూ సులభంగా చేయడం కష్టమే. దాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో నైపుణ్యం ఉంటేనే పూర్తి ఫలితాలుంటాయి. కాకపోతే ఇంట్లో కొద్దిపాటు సాంత్వన కోసం మాత్రం ప్రయత్నించొచ్చు.
కంసా వాటి మసాజ్:
ఈ మసాజ్ పాదాల అడుగున చేసినా దాని ఫలితాలు మాత్రం మెదడు, పూర్తి శరీరంపై ఉంటాయి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల కేవలం పాదాలు, కాళ్లకే లాభం ఉండదు. దాదాపుగా 30 నుంచి 45 నిమిషాల పాటూ ఈ మసాజ్ చేస్తారు. ముందుగా పాదాలను, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. చిన్నపాటి పదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. పాదాల భాగంలో ఉండే ఆక్యుప్రెజర్ కేంద్రాలు ఉత్తేజితం అయ్యే విధంగా ఈ మసాజ్ చేస్తారు. దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
ముందుగా పాదాలకు నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. దాంతో కాసేపు మర్దనా చేసిన తర్వాత ఇప్పుడు రాగి గిన్నెవెనక భాగంతో పాదం అంతటా కాస్త నొక్కినట్లు చేస్తే వలయాకారంలో మర్దనా చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత మాత్రమే పాదాలను నీటిలో ఉంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
కంసా వ్యాండ్:
ఇప్పుడు ఆన్‌లైన్ కంసా వాట్కి పేరుతో రకరకాల రాగి గిన్నెలు దొరుకుతున్నాయి. అలాగే కంసా వ్యాండ్ పేరుతో హ్యాండిల్ లాగా ఉండి, కింద రాగి గిన్నెను పోలిన ఏర్పాటు ఉంటుంది. చేతితో దాన్ని పట్టుకుని కింద అడుగుభాగాన ఉండే రాగి గిన్నె భాగంతో పాదాలకు మసాజ్ చేసుకోవచ్చు. దీనిలోనే సైజును బట్టి దొరికే కంసా వ్యాండ్‌లను తలకు మసాజ్ చేయడానికీ వాడతారు.
రాగి గిన్నె మసాజ్ వల్ల లాభాలు:
- అలిసిన పాదాలకు సాంత్వన దొరుకుతుంది
- రక్త సరఫరా పెరుగుతుంది
- పాదాలకు మంచి మర్దనా అవుతుంది. పాదాల వాపు తగ్గుతుంది
- ప్రశాంతత పెరుగుతుంది
- ఒత్తిడి తగ్గుతుంది.
- నిద్ర బాగా పడుతుంది.
- మోకాలు, చీల మండలం నొప్పి తగ్గుతుంది.