Telugu News / Lifestyle /
Stuffed Idli: ఇడ్లీ రుచి కొత్తగా కావాలంటే.. ఈ స్టఫ్డ్ ఇడ్లీ ప్రయత్నించండి..
Stuffed Idli: మామూలు ఇడ్లీలు తిని బోర్ కొడుతోందా. అయితే ఒకసారి స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా ఉంటాయి.
స్టఫ్డ్ ఇడ్లీ
ఇడ్లీల రుచి కొత్తగా కావాలనుకుంటే స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడొచ్చు. బంగాళదుంపలు, వివిధ కూరగాయ ముక్కలతో చేసిన సింపుల్ మసాలా స్టఫ్ చేసిన ఇడ్లీలు రుచిలో బాగుంటాయి. వాటిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు:
1 పెద్ద బంగాళదుంప, ఉడికించి మెదుపుకోవాలి
1 చెంచా నూనె
పావు చెంచా ఆవాలు
సగం చెంచా మినప్పప్పు
1 ఉల్లిపాయ, సన్నటి తరుగు
1 టమాటా, సన్నటి ముక్కలు
1 క్యాప్సికం, సన్నటి ముక్కలు
అరచెంచా కారం
పావు చెంచా పసుపు
పావు కప్పు నీళ్లు
2 చెంచాల కొత్తిమీర తరుగు
తగినంత ఉప్పు
తగినంత ఇడ్లీ పిండి
తయారీ విధానం:
- కడాయి వేడి చేసుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు, మినప్పప్పు వేసుకుని వేగనివ్వాలి.
- అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని వేగనివ్వాలి. కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి.
- చివరగా ఉడికించుకుని, మెదుపుకున్న బంగాళదుంప ముద్ద కూడా వేసుకోవాలి. సన్నం మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి.
- అందులో పావు కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి. మళ్లీ కాసేపు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మసాలా నీళ్లన్నీ ఇంకిపోయి కాస్త పొడిగా తయారవుతుంది. దాన్ని చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసుకుని సగం గరిటె ఇడ్లీ పిండి వేసుకోవాలి. మధ్యలో మసాలా మిశ్రమం ఒక ఉండ వేయాలి. మీద మళ్లీ ఇడ్లీ పిండి పోసుకోవాలి. అంతే ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. స్టఫ్డ్ ఇడ్లీలు రెడీ అయిపోతాయి.