Paneer Afghani: క్రీమీ గ్రేవీతో పన్నీర్ అఫ్ఘనీ.. రాఖీ రోజు కొత్త రుచిలో పన్నీర్ కర్రీ ఆస్వాదించండి-how to cook paneer afghani curry with great taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Paneer Afghani: క్రీమీ గ్రేవీతో పన్నీర్ అఫ్ఘనీ.. రాఖీ రోజు కొత్త రుచిలో పన్నీర్ కర్రీ ఆస్వాదించండి

Paneer Afghani: క్రీమీ గ్రేవీతో పన్నీర్ అఫ్ఘనీ.. రాఖీ రోజు కొత్త రుచిలో పన్నీర్ కర్రీ ఆస్వాదించండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 18, 2024 11:30 AM IST

Paneer Afghani: పన్నీర్ కర్రీ అంటే ఎక్కువగా పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కాజూ మసాలా, పాలక్ పన్నీర్.. ఇవే ఎక్కువగా వింటాం. కానీ ఇవి తిని బోర్ కొట్టేస్తుంది. రాఖీ రోజు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే ఈ పన్నీర్ అఫ్ఘనీ కర్రీ ప్రయత్నించండి. వేడుకను ప్రత్యేకంగా మార్చేయండి.

పన్నీర్ అఫ్ఘనీ
పన్నీర్ అఫ్ఘనీ

తెల్లగా క్రీమీగా మీగడతో చేశారామో అన్నట్టుంటుంది ఈ పన్నీర్ అఫ్ఘనీ కర్రీ. తింటుంటే కూడా అదే కమ్మదనం. రాఖీ రోజు ప్రత్యేకంగా ఏదైనా వండాలనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ. ఎప్పుడూ ఒకేసారి పన్నీర్ కాకుండా కాస్త కొత్త రుచితో వండాలంటే ఇది ప్రయత్నించండి. 

అఫ్ఘనీ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

అరకేజీ పన్నీర్, పొడవాటి ముక్కల్లా కట్ చేసుకోవాలి

2 చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద

1 చెంచా వంటనూనె

రుచికి సరిపడా ఉప్పు

చిటికెడు ఇంగువ

అరచెంచా మిరియాల పొడి

గుప్పెడు కొత్తిమీర తరుగు

గ్రేవీ కోసం:

ఒకటిన్నర చెంచాల నూనె

2 పచ్చిమిర్చి

అంగుళం అల్లం ముక్క

4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర

పావు కప్పు నానబెట్టిన జీడిపప్పు

పావు కప్పు ఫ్రెష్ క్రీం

1 కప్పు తియ్యటి పెరుగు

అరచెంచా ధనియాల పొడి

అరచెంచా జీలకర్ర పొడి

సగం చెంచా పసుపు

సగం చెంచా గరం మసాలా

1 చెంచా కసూరీ మేతీ

పన్నీర్ మ్యారినేషన్ కోసం:

1 చెంచా నూనె

2 చెంచాల పచ్చిమిర్చి ముద్ద

1 చెంచా బటర్

2 బిర్యానీ ఆకులు

అంగుళం దాల్చిన చెక్క ముక్క

2 యాలకులు

నాలుగైదు లవంగాలు

1 చెంచా అల్లం తరుగు

పావు చెంచా గరం మసాలా

అఫ్ఘనీ పన్నీర్ కర్రీ తయారీ విధానం:

1. ముందుగా పన్నీర్ మ్యారినేషన్ కోసం పన్నీర్ ముక్కలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో ఉప్పు, చెంచాడు నూనె, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర తరుగు, ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి. కనీసం పావుగంట పక్కన పెట్టుకోవాలి.

2. ఈ లోపు మసాలా కోసం చెంచా నూనె కడాయిలో వేడి చేసుకోవాలి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి నిమిషం పాటూ వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ కట్టేయాలి.

3. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని మీగడ లాగా మిక్సీ పట్టాలి.

4. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు, కొద్దిగా ఫ్రెష్ క్రీం లేదా మీగడ, పెరుగు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, కసూరీ మేతీ, ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకోవాలి. పక్కన పెట్టేయాలి.

5. ఇప్పుడు పన్నీర్ ముక్కల్లో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలపుకుని పక్కన పెట్టుకోవాలి.

6. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో చెంచాడు నూనె వేసుకోవాలి. మసాలా పట్టించిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ముక్కల్ని ప్లేట్ లోకి తీసుకోవాలి.

7. కర్రీ తయారు చేయడం కోసం అదే ప్యాన్ లో మరో చెంచా నూనె, కొద్దిగా బటర్ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.

8. అల్లం ముక్కలు కూడా వేసుకుని అర నిమిషం వేయించాలి. గరం మసాలా వేసుకుని బాగా కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న కాజూ గ్రేవీని వేసుకోవాలి.

9. పచ్చివాసన పోయేదాకా గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. కాసేపటికి చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దించుకుంటే పన్నీర్ అఫ్ఘనీ రెడీ.

 

టాపిక్