Masala Khara Bath: ఘుమఘుమలాడే మసాలా ఖారా బాత్.. ఎన్నిసార్లయినా తినేయొచ్చు..
Masala Khara Bath: మసాలా ఖారా బాత్ కర్ణాటక వంటకం. ఉప్మా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఈ ప్రత్యేక మసాలాతో ఒకసారి వండి చూడండి.
ఉప్మా అంటే చాలా సింపుల్‌గా వండుకునే వంటకం. కానీ దీన్ని కూడా ప్రత్యేకంగా చేయాలంటే ఒకసారి మసాలా ఖారా బాత్ ట్రై చేయండి. బాత్ అంటున్నారు.. మళ్లీ ఉప్మా ఏంటీ అనుకోకండి. టమాటా బాత్ ఎలాగైతే రవ్వతో చేస్తామో ఈ మసాలా ఖారా బాత్ కూడా గోధుమరవ్వతో చేస్తాం. మన ఉప్మాలా కాకుండా దీంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన మసాలా ఉపయోగిస్తాం. అలాగే కొన్ని కూరగాయలూ వాడతాం. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
మసాలా ఖారా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు గోధుమరవ్వ
సగం కప్పు ఉప్పు
3 చెంచాల నెయ్యి
పావు చెంచా ఆవాలు
పావు చెంచా జీలకర్ర
సగం చెంచా మినప్పప్పు
సగం చెంచా అల్లం ముక్కలు
పావు టీస్పూన్ ఇంగువ
1 కరివేపాకు రెమ్మ
2 చెంచాల పల్లీలు
1 చెంచా జీడిపప్పు
పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు
సగం కప్పు క్యారట్ ముక్కలు, బటానీ
1 టమాటా, సన్నటి ముక్కలు
చెంచా ఉప్పు
సగం టీస్పూన్ పసుపు
1 చెంచా నిమ్మరసం
గుప్పెడు తరిగిన కొత్తిమీర
మసాలా కోసం:
1 చెంచా ధనియాలు
1 టీస్పూన్ శనగపప్పు
1 టీస్పూన్ మినప్పప్పు
2 ఎండుమిర్చి
అంగుళం దాల్చిన చెక్క ముక్క
2 లవంగాలు
మసాలా ఖారా బాత్ తయారీ విధానం:
1. ముందుగా దీనికోసం కావాల్సిన మసాలా పొడి రెడీ చేసుకోవాలి. అందుకోసం కడాయిలో నూనె లేకుండా ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని రెండు నిమిషాలు వేయించాలి. వాసన రాగానే స్టవ్ కట్టేయాలి.
2. వీటిని ఒక పల్లెంలోకి తీసుకుని చల్లారాక ఒక మిక్సీ జార్‌లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మసాలా రెడీ అయినట్లే.
3. అదే ప్యాన్‌లో సన్నం రవ్వ వేసుకుని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. కాసేపటికి బంగారు వర్ణంలోకి మారుతుంది. వాసన వస్తుంది. అప్పుడు దాన్ని మరో బౌల్ లోకి తీసుకోవాలి.
4. ఇప్పుడు ఖారా బాత్ తయారీ కోసం ఒక కడాయిలో నెయ్యి వేసుకుని వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, అల్లం, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. అవి కాస్త వేగాక పల్లీలు, జీడిపప్పు వేసుకుని వేయించాలి.
5. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగితే కూరగాయ ముక్కలు, ఉప్పు, పసుపు, వేసుకోవాలి. వెంటనే వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకుని కలుపుకోవాలి.
6. ఒక నిమిషం పాటూ రవ్వ వేయించుకున్నాక నీళ్లు పోసుకోవాలి. వెంటనే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
7. ఉండలు కట్టకుండా రవ్వను కలుపుతూ ఉండాలి. కాసేపటికి బుడగలు వచ్చినప్పుడు స్టవ్ సన్నం మంట మీద పెట్టి మూత పెట్టుకోవాలి.
8. మూత పెట్టుకుని కనీసం పది నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్లు పూర్తిగా ఇంకిపోవాలి. చివరగా నెయ్యి, నిమ్మరసం, తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి.
9. రెండు నిమిషాలు మూత పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలు. మసాలా ఖారా బాత్ రెడీ అయినట్లే.