Coconut Kheer: కొబ్బరితో అదిరిపోయే పాయసం.. సింపుల్ రెసిపీ ఇదే-how to cook coconut kheer recipe with simple tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Kheer: కొబ్బరితో అదిరిపోయే పాయసం.. సింపుల్ రెసిపీ ఇదే

Coconut Kheer: కొబ్బరితో అదిరిపోయే పాయసం.. సింపుల్ రెసిపీ ఇదే

Koutik Pranaya Sree HT Telugu
Aug 06, 2024 03:30 PM IST

Coconut Kheer: పిల్లలకు సింపుల్‌గా ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ కొబ్బరి పాయసం చేసి చూడండి.

కొబ్బరి పాయసం
కొబ్బరి పాయసం (Shutterstock)

శ్రావణమాసం వచ్చేసిందంటే ప్రతిరోజూ పండగలాగే ఉంటుంది. నైవేద్యాల కోసం, ఇంట్లో తినడానికి ప్రత్యేక వంటలు చేసుకుంటారు. శివుణికి నైవేద్యంగా పెట్టడంతో పాటూ పిల్లలు కూడా ఇష్టంగా తినే కొబ్బరి పాయసం ఒక్కసారి చేసి చూడండి. దీని తయారీ చాలా సులభం. కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

కొబ్బరి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:

100 గ్రాముల బియ్యం

3 కప్పుల కొబ్బరి పాలు

1 కప్పు మిల్క్ మెయిడ్

200 గ్రాముల కోవా

1 చిన్న చెంచాడు యాలకుల పొడి

1 చిన్న చెంచా దాల్చిన చెక్క పొడి

చిటికెడు కుంకుమ పువ్వు

చెంచాడు పిస్తా తరుగు

సగం కప్పు బెల్లం తరుగు లేదా పంచదార

కొబ్బరి పాయసం తయారీ విధానం:

1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు బియ్యం మునిగేటన్ని నీళ్లు పోసుకుని కనీసం పావుగంట సేపు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో కొబ్బరి పాలు పోసుకుని అయిదు నిమిషాలు ఉడికించాలి.

4. అవి చిక్కబడ్డాక దాల్చిన చెక్క పొడి, కోవా, మిల్క్ మెయిడ్, కుంకుమపువ్వు, పంచదార లేదా బెల్లం పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరికి వస్తుంది.

5. ఇందులో ఉడికించుకున్న అన్నాన్ని కలిపేసుకోవాలి. బాగా కలియబెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.

6. చివరగా రెండు చెంచాల నెయ్యి, పిస్తా తరుగు వేసుకుని కలుపుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలు.

7. ఇష్టం ఉంటే పాయసం తినే రెండు నిమిషాల ముందు మరి కొద్దిగా కోవా కలపుకుని సర్వ్ చేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. అంతే కొబ్బరి పాయసం రెడీ.

కొబ్బరి పాలు సూపర్ మార్కెట్లో సులువుగా దొరుకుతాయి. లేదంటే పచ్చికొబ్బరిని ముక్కలు చేసి కాస్త నీళ్లు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక కాటన్ వస్త్రంలో ఈ కొబ్బరి మిశ్రమం వేసి పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని ఈ పాయసం కోసం వాడుకోవడమే. దీంతో పాయసానికి చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది.

టాపిక్