Office chair: ఎలాంటి ఆఫీస్ చెయిర్ వాడుతున్నారు? ఇలా ఉంటేనే నొప్పులు, అసౌకర్యం-how to buy best office chair know these tips and tricks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Office Chair: ఎలాంటి ఆఫీస్ చెయిర్ వాడుతున్నారు? ఇలా ఉంటేనే నొప్పులు, అసౌకర్యం

Office chair: ఎలాంటి ఆఫీస్ చెయిర్ వాడుతున్నారు? ఇలా ఉంటేనే నొప్పులు, అసౌకర్యం

Koutik Pranaya Sree HT Telugu
Aug 30, 2024 02:00 PM IST

Office chair: రోజంతా కూర్చునే ఆఫీస్ చెయిర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుర్చీ సరిగ్గా లేకపోతే దీర్ఘాకాలిక రోగాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. మీరు కుర్చీ కొనేముందు ఏమేం విషయాలు గమనించాలో చూడండి. అవి లేకపోతే మీరు వాడుతున్న కుర్చీనే ఎలా మార్చుకోవచ్చో తెల్సుకోండి.

ఆఫీస్ చెయిర్
ఆఫీస్ చెయిర్ (freepik)

రోజులో సగం భాగం ఆఫీసు కుర్చీ మీదే గడిపేస్తున్నారు చాలా మంది. ఆ కుర్చీ గనక సరిగ్గా లేకపోతే ఆరోగ్యానికి విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నొప్పులు, ఆరోగ్య సమస్యలు వస్తాయనేది కచ్చితమైన మాట. అందుకే మీరు కూర్చునే చెయిర్ కొనేముందు కొన్ని విషయాలు తెల్సుకోండి. మీరు వాడుతున్న కుర్చీ ఇలా లేకపోతే వెంటనే మార్చేయండి.

మంచి ఆఫీస్ చెయిర్ వాడితే..

సౌకర్యాన్ని పెంచేలా డిజైన్ చేసిన ఫర్నీచర్ ను ఎర్గోనామిక్ ఫర్నీచర్ అంటారు. ఇది సాధారణంగా కన్నా కాస్త ఎక్కువ ధరే ఉంటుంది. కానీ ఒక్కసారి కొనుక్కుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. వీటిని వాడితే నడుం నొప్పి, భుజాలు, మెడ దగ్గర నొప్పి రావు. వెన్నెముక మీద భారం పడదు. మీ శరీర సహజ ఆకృతికి కాస్త దగ్గరగా, సౌకర్యంగా ఈ కుర్చీలుంటాయి. మీరు వాడే కుర్చీ ఎలాగుండాలో చూడండి.

ఇలాంటి ఆఫీస్ చెయిర్ కొనుక్కోండి:

1. లూంబార్ సపోర్ట్:

కుర్చీలో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది. మంచి లూంబార్ సపోర్ట్ ఉన్న కుర్చీతో ఆ ఇబ్బంది రాదు. ఇది మీ వెన్నెముక లాగా కాస్త మెలి తిరిగి వంకరగా ఉంటుంది. దాంతో ఆనుకున్నప్పుడు శరీరానికి అతుక్కుపోతుంది. కాబట్టి కుర్చీ కొనేటప్పుడు మీరు ఆనుకునే భాగం సమాంతరంగా ఉండకుండా చూడండి. మీరిప్పుడు వాడుతున్న కుర్చీ సమాంతరంగా ఉంటే లూంబార్ సపోర్ట్ యాక్సెసరీలు దొరుకుతాయి. వీటిని కుర్చీకి కట్టేసి వాడుకుంటే సరిపోతుంది. వీటితో నడుము నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

2. సీట్ ఎత్తు:

తక్కువ ధరలో కుర్చీ కొనుక్కుంటే దానికి ఎత్తును మార్చుకునే వీలుండదు. దాంతో మీరు టైపింగ్ లాంటివి చేసేటప్పుడు చేతులు సమాంతరంగా ఉండవు. మీ మెడ నిటారుగా ఉండదు. భుజాలు ముందుకు వంచాల్సి వస్తుంది. కాబట్టి కాస్త ధర ఎక్కువైనా సరే సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకునే వీలున్న కుర్చీలే కొనండి.

ఎత్తు కనీసం 5 ఇంచుల నుంచి 10 లేదా 15 ఇంచుల వరకు మార్చుకునే వీలున్న కుర్చీలు తీసుకోండి. దీంతో మీ మోచేయి, చేయి సరైన కోణంలో ఉంటాయి. మీ పాదాలు నేలను తాకుతాయి. ఎత్తు సమస్య అనిపిస్తే కాళ్ల కింద ఒక ఫూట్ రెస్ట్ పెట్టుకోవడం కూడా మంచిదే.

మీరు కొనే కుర్చీకి సీట్ ఎత్తును మార్చడంతో పాటే ఆర్మ్ రెస్ట్ కూడా కిందికి మీదికి అనే వీలుండాలి. అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్టులుంటే భుజాల్లో నొప్పి రాదు.

3. సీట్ మృదుత్వం:

రోజు మొత్తం కూర్చునే కుర్చీ ఏదో సిమెంటు బల్ల మీద కూర్చున్న అనుభూతి ఇవ్వకూడదు. అలాగనీ కూర్చుంటే లోపలికి పోయే మెత్తని దిండు మీద కూర్చున్నట్లూ ఉండొద్దు. ఈ మధ్య ప్లాస్టిక్ జాలీతో డిజైన్ చేసినవి వస్తున్నాయి. వాటితో గాలి ప్రవాహం బాగుంటుంది. కూర్చునే చోట వేడెక్కదు. అలాగే కుషన్ ఉన్నవి ఎంచుకుంటే వాటి మందం కనీసం మూడ్నాలుగు ఇంచులైనా ఉండాలి.

టాపిక్