Rules of Ayurvedic bathing: స్నానానికి ఉత్తమ సమయం? నీళ్లు ఎంత వేడిగా ఉండాలి
ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే సమయం మాత్రమే కాదు.. సరైన నీటి ఉష్ణోగ్రత కూడా కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన ఆరోగ్యంలో స్నానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరం నుండి మురికి, చెమట, మలినాలు తొలగించడం నుండి మనస్సును పునరుజ్జీవింపజేయడం వరకు దాని పాత్ర కీలకం. ఒత్తిడిని ఎదుర్కోవటానికి, కండరాలు, నరాలు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతిరోజూ స్నానం చేయడం చాలా అవసరం. మీరు స్నానం ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారన్న విషయాలు కూడా మీ శక్తి స్థాయిలు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.

ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే సమయం మాత్రమే కాదు, సరైన నీటి ఉష్ణోగ్రత కూడా ముఖ్యం. సంపూర్ణ ఆరోగ్యంలో శుభ్రత ఒక ముఖ్యమైన భాగం కాబట్టి స్నానం చేయడానికి తగినంత నీరు తప్పనిసరిగా ఉపయోగించాలి. దోషాలను సమతుల్యం చేయడానికి, అనారోగ్యాలను నివారించడానికి స్నానానికి ముందు అభ్యంగాన్ని లేదా వెచ్చని మూలికలతో కలిపిన నూనెను ఉపయోగించాలని పురాతన వైద్య విధానం సిఫార్సు చేస్తుంది.
ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నీతికా కోహ్లి మీ శరీరం, మనస్సును పోషించే స్నానం కోసం చిట్కాలు సూచించారు.
స్నానం చేయడానికి ఉత్తమ సమయం
డాక్టర్ కోహ్లి రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని సూచించారు. మల విసర్జన, దంతాలు శుభ్రం చేసిన అనంతరం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. మరొక సారి సూర్యాస్తమయం సమయంలో గోరువెచ్చని నీటితో, ఒత్తిడిని తగ్గించడానికి, మీ కండరాలు నరాల విశ్రాంతి కోసం చేయాలని సూచించారు. ఇలా చేస్తే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.
తగినంత నీటిని ఉపయోగించండి
ఒక వ్యక్తి గజేంద్రుడి (ఏనుగులా స్నానం చేయాలి)లా స్నానాన్ని తప్పక చేయవలసి ఉంటుందని ఆయుర్వేద గ్రంథం పేర్కొంది. దీని అర్థం మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడానికి తగినంత నీటిని ఉపయోగించాలి.
అభ్యంగ, ఆయిల్ మసాజ్
స్నానానికి ముందు అభ్యంగ, నూనె మర్ధన చేయాలి. నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైన నూనె. అయితే, మీరు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.
హెర్బల్ పౌడర్ ఉపయోగించండి
ఆయిల్ మసాజ్ తర్వాత, నీటితో కడుక్కోవడానికి ముందు హెర్బల్ పౌడర్‌ను నెమ్మదిగా మీ శరీరంపై రుద్దండి.
హెర్బల్ బాత్ పౌడర్‌లో ఉపయోగించే కొన్ని పదార్థాలు:
శనగ పిండి
పెసర పిండి
పసుపు
గులాబీ రేకులు
చందనం
వేప ఆకులు
నీటి ఉష్ణోగ్రత
ఉత్తమ స్నానం అనుభవం కోసం, గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. అయితే, మీ జుట్టు, కళ్లలో ఏదైనా ముప్పును నివారించడానికి ఈ నీటిని నేరుగా మీ తలపై పోయకుండా ఉండటం మంచిది. మీ తల కడుగుతున్నప్పుడు వేడి నీళ్లు కేవలం గది ఉష్ణోగ్రత వద్ద ఉంటే చాలని గ్రహించండి.
అలాగే భోజనం చేసిన వెంటనే తలస్నానం చేయవద్దని కూడా డాక్టర్ కోహ్లీ సలహా ఇస్తున్నారు. మరో విషయం.. స్నానం చేసేటప్పుడు ముందుగా నీటిని తలపై గానీ, శరీరం పై భాగంలో గానీ పోసుకోరాదు. ముందుగా కాళ్లు, నడుము భాగం వరకు కడిగి ఆ పై క్రమంగా పైకి రావాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు, రక్త ప్రసరణలో మార్పులు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి.