Kitchen Tips: పాయసంలో తీపి మరీ ఎక్కువైందా? ఈ టిప్స్ పాటిస్తే స్వీట్ తగ్గడంతో పాటు మరింత టేస్ట్
Cooking Tips: పాయసంలో ఒక్కోసారి తీపి ఎక్కువ అవుతుంది. దీంతో తినడం కష్టం అవుతుంది. అలాంటి సమయాల్లో కొన్ని మార్గాల ద్వారా తీపి తగ్గించవచ్చు. స్వీట్ బ్యాలెన్స్ చేయవచ్చు.
పండగైనా, ప్రత్యేకమైన రోజైనా, అతిథులు వచ్చినా చాలా మంది ఇళ్లలో పాయసం చేసుకుంటారు. సాధారణ సమయాల్లోనూ తీపి తినాలంటే పాయసం మంచి ఆప్షన్‍గా ఉంటుంది. రకరకాల పదార్థాలతో వివిధ రకాలుగా పాయసాలు చేస్తుంటారు. చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, పాయసం చేసేటప్పుడు ఒక్కోసారి ఎక్కువగా చెక్కర లేదా బెల్లం పడుతుంటుంది. దీంతో ఎక్కువగా తియ్యగా మారుతుంది. మరీ తీపిగా ఉంటే పాయసం తినేందుకు కష్టంగా ఉంటుంది. అలాంటి టైమ్‍లో పాయసంలో తీపి తగ్గించేందుకు కొన్ని టిప్స్ ఉపయోగపడతాయి.
కొబ్బరిపొడి
పాయసంలో తీపి మరీ ఎక్కువైతే కొబ్బరిపొడి లేదా కొబ్బరి తురుము వేయవచ్చు. ఇది స్వీట్‍ను బాగా తగ్గించగలదు. మంచి టేస్ట్ కూడా ఇస్తుంది.
బాదంపొడి
పాయసంలో స్వీట్ ఎక్కువైతే బాదం పొడి వాడొచ్చు. ఓ మోస్తరు గిన్నెడు పాయసానికి ఓ రెండు టేబుల్ స్పూన్‍ల బాదం పొడి వేసుకోవచ్చు. తీపి ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలో ఆ మేరకు దీన్ని వేసుకోవచ్చు. బాదంపొడి పాయసానికి మరింత మెరుగైన టేస్ట్ తీసుకొస్తుంది. విభిన్నమైన రుచితో ఆకట్టుకుంటుంది. డ్రైఫ్రూట్లను పౌడర్‌లా చేసుకొని కూడా వేసుకున్నా పాయసంలో తీపి తగ్గుతుంది.
ఉప్పు వేయవచ్చు
వంటకాల్లో తీపిదనాన్ని ఉప్పు తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు. పాయసంలో తీపి ఎక్కువైతే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. స్వీట్‍ను ఉప్పు బ్యాలెన్స్ చేస్తుంది. ఫ్లేవర్ కూడా పెంచగలదు.
గసగసాల పొడి
ఏ వంటకంలో అయినా తీపి తగ్గించాలంటే గసగసాల పొడిని వేయవచ్చు. పాయసంలో ఇది వస్తే తీపి తగ్గడంతో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ముందుగా గసగసాలను సన్నని మంటపై బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని మెత్తని పొడిలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడిని పాయసంలో వేయాలి.
ఈ జాగ్రత్త తప్పనిసరి
పాయసంలో తీపి తగ్గించేందుకు పైన చెప్పిన చిట్కాలు పాటించవచ్చు. అయితే, పాయసం ఎంత ఉందో అనే దాన్ని బట్టి వాటిని మోతాదు మేరకు వేసుకోవాలి. మరీ ఎక్కువైతే రుచి ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పాయసం ఎంత ఉంది, తీపిని ఎంత అడ్జస్ట్ చేస్తే సరిపోతుందనే విషయాలను బట్టి వాటిని వేసుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్