మీ డెస్క్ వద్ద ఎక్కువసేపు కూర్చోవడం, టెలివిజన్ చూడటం లేదా అటూ ఇటూ తిరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఉరుకుల పరుగుల జీవితం, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా జీవనశైలిని చురుగ్గా ఉంచుకోవడం చాలా తప్పనిసరి అయింది. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ మాదిరిగా కూర్చోవడం కూడా గుండె సంబంధ వ్యాధులతో సహా దీర్ఘకాలిక వ్యాధులకు ప్రమాద కారకంగా మారింది. తక్కువగా కదులుతున్నప్పుడు, మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు పేరుకుపోవడం జరుగుతుంది. కదలిక లేకపోవడం వల్ల ఎముకలు, కండరాలు కూడా బలహీనమవుతాయి.
మీరు కదలకుండా ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు మీ రక్త ప్రసరణ, రక్తపోటు ప్రభావితం అవుతుంది. ఇది ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అధికంగా కూర్చోవడం అథెరోస్ల్కెరోసిస్‌తో ముడిపడి ఉంటుంది. అంటే ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. మీరు నిశ్చల జీవనశైలిని గడుపుతున్నప్పుడు, వ్యాయామం, నడక మీ దినచర్యలో భాగం కావాలి. డెస్క్ ఉద్యోగం చేస్తున్నట్టయితే రోజుకు కొంత దూరమైనా నడవాలి. అలాగే స్ట్రెచ్ వ్యాయామాలు చేయాలి. లేదంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి.
దైనందిన జీవితంలో క్రమంగా వస్తున్న మార్పులతో ఎక్కువ మంది ఒకే చోట కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిశ్చల జీవనశైలి సర్వసాధారణంగా మారింది. చాలా మంది వ్యక్తులు డెస్క్‌ల ముందు, స్క్రీన్ల ముందు లేదా ప్రయాణాల సమయంలో ఎక్కువసేపు గడుపుతారు. ఈ మితిమీరిన కూర్చోవడం ధూమపానంతో వచ్చే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'కూర్చోవడం.. ఇదో తరహా కొత్త ధూమపానం' అనే పదబంధం చలామణిలోకి వచ్చింది. ఎక్కువసేపు కూర్చోవడం గుండె ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది నాఢీ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఎక్కువ సేపు కూర్చుంటే మీ గుండెకు జరిగే హాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కదలిక లేని అలవాట్ల నుండి బయటపడేందుకు ఉన్న అవసరాన్ని గుర్తించండి అని ఘజియాబాద్లోని మణిపాల్ హాస్పిటల్స్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అభిషేక్ సింగ్ చెప్పారు.
ఎక్కువ గంటలు కూర్చోవడం మీ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గుండెపోటు ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో డాక్టర్ సింగ్ వివరించారు.
అథెరోస్ల్కెరోసిస్, ధమనులలో ఫలకం ఏర్పడటం, గుండె జబ్బులకు ముఖ్యమైన ప్రమాద కారకం. ఎక్కువసేపు కూర్చోవడం కదలిక జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కొవ్వు నిల్వలను క్లియర్ చేసే శరీర యంత్రాంగాలలో సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ధమనులను సంకుచితం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఎక్కువసేపు కూర్చోవడం రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది. ముఖ్యంగా దిగువ అవయవాలలో ఈ పరిస్థితి ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం, డీప్ సిర థ్రాంబోసిస్ (డివిటి) ఏర్పడటానికి దారితీస్తుంది. చివరికి, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తం సజావుగా ప్రవహించడానికి, ఈ ప్రాణాంతక పరిస్థితులను నివారించడానికి క్రమం తప్పకుండా చలనం, వ్యాయామం అవసరం.
ఎక్కువసేపు కూర్చోవడం రక్తపోటు స్థాయిలతో ముడిపడి ఉంది. శారీరక శ్రమ లేకపోవడం, రక్త ప్రవాహం తగ్గడం రక్తపోటుకు దోహదం చేస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధులకు ముఖ్యమైన ప్రమాద కారకం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ తిరగడం రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
ఎక్కువసేపు కూర్చోవడం బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. బరువు పెరగడం గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. పల్మనరీ ఎంబాలిజం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కూర్చునే సమయాన్ని తగ్గించడం బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అదేపనిగా కూర్చోవడం చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ అసమతుల్యత అథెరోస్ల్కెరోసిస్ వృద్ధికి దోహదం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.