బెడ్‌షీట్‌లను ఎన్నిరోజులకు మారుస్తున్నారు? అలాగే వాడితే ఏమౌతుందో తెలుసా?-how often should you change your bedsheet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బెడ్‌షీట్‌లను ఎన్నిరోజులకు మారుస్తున్నారు? అలాగే వాడితే ఏమౌతుందో తెలుసా?

బెడ్‌షీట్‌లను ఎన్నిరోజులకు మారుస్తున్నారు? అలాగే వాడితే ఏమౌతుందో తెలుసా?

Manda Vikas HT Telugu
Mar 07, 2022 06:23 PM IST

మన శరీరం ప్రతిరోజూ సుమారు 40,000 వరకు మృతకణాలను తొలగిస్తుంది. అలాగే బయటకు వెళ్లివచ్చినపుడు శరీరం అనేక హానికారక బాక్టీరియాలను, వైరస్‌లను మోసుకొస్తుంది. ఇవన్నీ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి , నిద్రపై ప్రభావితం చూపుతాయి.

బెడ్‌షీట్‌ - Bedroom
బెడ్‌షీట్‌ - Bedroom (Shutterstock)

కొందరు తమ పడకగదికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారు పడుకునే చోటును చక్కగా, పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఎప్పటికప్పుడు బెడ్‌షీట్‌లను మార్చుకుంటారు. కానీ మరికొందరికి తమ బెడ్ చిందరవందరగా ఎలా ఉన్నా పర్వాలేదు. పరుపుపై ఉన్న బెడ్‌షీట్‌ వారమైనా కానీ, నెలయినా అవనీ.. అదే బెడ్ మీద అలాగే దొర్లుతుంటారు తప్ప పరిశుభ్రత అనేది అస్సలు పాటించరు.

ఒకవేళ ఎవరైతే ఈ రెండో వర్గానికి చెందుతారో వారికి సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, STD లు (లైంగికంగా సంక్రమించే వ్యాధులు) సంక్రమించడమే కాకుండా నిద్రలేమి, చిరాకు లాంటి ఇతర మానసిక సమస్యలు తలెత్తి వారి రోగనిరోధకశక్తి కూడా క్రమంగా తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకే బెడ్‌షీట్‌ను నెలపాటుగా ఉపయోగిస్తే ఏమౌతుంది..?

పడక గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఒకసారి వాడిన బెడ్‌షీట్‌, దుప్పట్లను మళ్లీమళ్లీ ఉపయోగించకుండా, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన బెడ్‌షీట్‌లను ఉపయోగించాలని చెబుతున్నారు.ఒక బెడ్‌షీట్‌ను ఎన్నిరోజుల పాటు వాడుకోవచ్చు, ఎన్నిరోజులకోసారి మార్చుకోవాలి, ఎన్ని రోజులకు ఉతుక్కోవాలి? లాంటి విషయాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి..

సాధారణంగా న్యుమోనియా, అపెండిసైటిస్‌, గోనేరియాలకు కారణమయ్యే కొన్నిరకాల బ్యాక్టీరియాలు బెడ్‌పై 7 రోజులలో పెరగడం ప్రారంభిస్తాయి. కాబట్టి బెడ్‌షీట్‌లను వారం రోజులకు మించి ఉపయోగించకూడదు. అలాగే బెడ్‌షీట్‌లను, పిల్లో కవర్లను నెలరోజుల వరకు ఉతకకుండా ఉపయోగిస్తే మొటిమలు, అలెర్జీలు, తామర, ఉబ్బసం, జలుబు, ఫ్లూ లాంటి జబ్బుల బారినపడవచ్చు. నిద్రలేమికి కూడా కారణమవుతుంది. కాబట్టి ప్రతీ రెండు వారాలకోసారైనా డిటర్జెంట్‌తో బెడ్‌షీట్‌లను ఉతుక్కోవాలి.

Check This Post:

మన శరీరం ప్రతిరోజూ సుమారు 40,000 వరకు మృతకణాలను తొలగిస్తుంది. అలాగే బయటకు వెళ్లివచ్చినపుడు శరీరం అనేక హానికారక బాక్టీరియాలను, వైరస్‌లను మోసుకొస్తుంది. ఇవన్నీ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి , నిద్రపై ప్రభావితం చూపుతాయి. కాబట్టి సుఖంగా నిద్రపోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, మన పడకను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ పరిశుభ్రమైన బెడ్‌షీట్‌లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

WhatsApp channel