Jaggery Eating: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత బెల్లం తినాలి, హద్దు మీరి తింటే వచ్చే సమస్యలు ఏంటి?-how much jaggery should you eat daily to stay healthy and what problems can occur if consumed in excess ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jaggery Eating: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత బెల్లం తినాలి, హద్దు మీరి తింటే వచ్చే సమస్యలు ఏంటి?

Jaggery Eating: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత బెల్లం తినాలి, హద్దు మీరి తింటే వచ్చే సమస్యలు ఏంటి?

Ramya Sri Marka HT Telugu
Dec 29, 2024 10:00 AM IST

Jaggery Eating: హద్దు మీరి తింటే ఔషదమైన విషమే కదా. బెల్లం కూడా అంతే. బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తింటే అనర్థమేనట. రోజుకు ఎంత బెల్లం తినొచ్చు. ఒకవేళ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత బెల్లం తినాలి
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత బెల్లం తినాలి (shutterstock)

బెల్లం తినడం వల్ల ఎన్నో సమస్యలను దాటేయొచ్చని భావిస్తుంటాం. షుగర్ వ్యాధిగ్రస్థులు, షుగర్ రాకూడదని జాగ్రత్త పడేవాళ్లు చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటారు. అదే సమయంలో రక్త హీనత సమస్య ఉన్న వాళ్లు కూడా ఉపయోగించే వాటిలో ముందుండేది బెల్లమే. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా బాగా ఉపయోగపడే బెల్లంను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. బెల్లం సరైన మోతాదులో తింటే ఎన్ని లాభాలను అందిస్తుందో మితిమీరి తింటే అన్నే అనర్థాలను కలగజేస్తుంది. మరి అలాంటప్పుడు బెల్లం రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం.

yearly horoscope entry point

డయాబెటిస్ పేషెంట్లు ఎంత తినాలంటే:

బెల్లం తినడం అనేది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులకు, షుగర్ వ్యాధిగ్రస్థులకు బెల్లం తినే పరిమాణంలో కాస్త తేడా ఉంటుంది. డయాబెటిస్ లేదా బ్లడ్ షుగర్ వంటి సమస్యలు లేని వారు ఒక రోజులో 10-15 గ్రాముల బెల్లం తీసుకోవచ్చు. అంటే ఒకటి నుండి రెండు టీస్పూన్ల బెల్లం మాత్రమే తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు ఎంత తినాలి:

డయాబెటిక్ పేషెంట్లు తప్ప ఆరోగ్యంగా ఉన్న సాధారణ వ్యక్తి రోజంతా 25 గ్రాములకు మించి బెల్లం తినకూడదు. ఎందుకంటే బెల్లం సహజ స్వీటెనర్ కానీ ఇందులో అధిక మొత్తంలో కేలరీలు, చక్కెర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, అధిక చక్కెర తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. ఒక రోజులో రోజూ 10-15 గ్రాముల బెల్లం తింటే శరీరంలోకి చేరే విధంగా చక్కెరతో కూడిన మరే పదార్థము తినకూడదు. లేదంటే బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారు. ఫలితంగా కొవ్వు పెరిగి ఊబకాయానికి దారి తీసే అవకాశం ఉంది. క్రమంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెడిపోతాయి.

మితిమీరి తింటే వచ్చే సమస్యలు ఏంటి?

జీర్ణక్రియలో సమస్యలు:

బెల్లం అధికంగా తీసుకోవడం వలన అరుగుదల సమస్యలు, మలబద్ధకం లేదా గ్యాస్ వంటి సమస్యలు వచ్చి కడుపులో అసౌకర్యం కలిగించవచ్చు. ఫలితంగా మరుసటి రోజు చికాకుగా ఉండి ఏ పనిమీదా ఏకాగ్రత కుదర్చలేరు.

యాసిడ్ లెవల్స్ పెరుగుదల:

బెల్లం అధికంగా తీసుకోవడం వలన శరీరంలో యాసిడ్ లెవల్స్ పెరిగి, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ యాసిడ్ లెవల్స్ లో మార్పు కారణంగా అల్సర్ కూడా వచ్చే ప్రమాదముంది.

మెదడు పనితీరులో మార్పు:

బెల్లం కొద్దిపాటి పరిమాణంలో తీసుకోవడం మానసికంగా శుభపరిణామమే చూపిస్తుంది. అదే అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం వలన కొన్ని వ్యక్తుల్లో నరాల సంబంధిత సమస్యలు కనిపిస్తాయట. అంతేకాకుండా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు, రక్తపోటు వంటి సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దంతాలు, కాలేయం:

బెల్లం ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం‌పై ప్రభావం ఉండవచ్చు. ఎక్కువగా షుగర్ తీసుకోవడం వలన కాలేయంలో ఫ్యాటీ లివర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బెల్లంలో ఉండే తీపి గుణం దంతాలలో బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతుంది. ఎక్కువగా బెల్లం తినడం వలన పళ్లు బలహీనంగా మారొచ్చు. చిగుళ్లలో సమస్యలు మొదలుకావొచ్చట.

Whats_app_banner

సంబంధిత కథనం