Junk Food: మీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? వారానికి ఎన్నిసార్లు తినచ్చో తెలుసుకోండి!
Junk Food: జంక్ ఫుడ్ ప్రస్తుత జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా తప్పక కొందరు, ఇష్టమై మరికొందరు జంక్ ఫుడ్‌ను ఎక్కువగానే తింటున్నారు. మీరు వారిలో ఒకరైతే వారానికి ఎన్నిసార్లు జంక్ ఫుడ్ తినచ్చు, ఎలా తినచ్చు వంటి కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి.
ఇంట్లో కూరగాయలు లేకపోయినా, వంట చేయడానికి సమయం లేకపోయినా లేక రోజూ తినే ఆహారం బోక్ కొట్టిన టక్కున గుర్తొచ్చేది జంక్ ఫుడ్. బండి తీసామా, బయటకు వెళ్లామా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తినేసామా! అంతే. ఇలా ఏదో ఒక కారణంతో ప్రస్తుతం జంక్ ఫుడ్ అనేది అందరి జీవనవిధానంలో భాగమైపోయింది. ఏదైమైనప్పటికీ బయట దొరికే ఈ ఆహారాలు కొన్ని సార్లు తినడంలో తప్పులేదు. ఇందులో కొందరు తప్పని పరిస్థితుల్లో తినేవారైతే మరికొందరు జంక్ ఫుడ్ అంటే ఇష్టంతో ఎక్కువసార్లు తింటున్నారు.

ముఖ్యంగా యువత, చిన్నారులు పిజ్జా, బర్గర్, మోమోస్, ఫ్రైస్ వంటి వాటిని రోజూ తినాలని కోరుకుంటున్నారు. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇక్కడ వాస్తవం ఏంటంటే.. దీన్ని పూర్తిగా మన ఆహారం నుండి తొలగించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే కొంతమేరకు మాత్రమే తినాల చూసుకోవాలి.
అంటే జంక్ ఫుడ్ ఎంత తినడం సురక్షితం..? అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చు. దీనికి సమాధానం ఇక్కడ మీకు దొరుకుతుంది. జంక్ ఫుడ్ తినే సమయంలో ఆరోగ్యంతో పాటు, రుచిని కూడా కాపాడుకోవడానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తినాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వారంలో ఎన్నిసార్లు జంక్ ఫుడ్ తినచ్చు?
జంక్ ఫుడ్‌లో పిజ్జా, బర్గర్, మోమో వంటి ఫ్రైడ్ ఫుడ్, తీపి స్నాక్స్, ప్యాకెట్ స్నాక్స్, తీపి పానీయాలు వంటివి అన్నీ ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలో చక్కెర, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి, అయితే పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వారంలో ఎంత జంక్ ఫుడ్ తినడం సురక్షితం అనే దానికి సార్వత్రికంగా ఒక మోతాదు అనేది నిర్ణయించలేం. కాకపోతే నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటిని తక్కువగా తీసుకోవాలి. అంటే వారంలో ఒకటి లేదా రెండు సార్లు జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లే అవకాశాలు తగ్గుతాయి. అంతకు మించి తినకుండి జాగ్రత్త పడండి.
జంక్ తినే సమయంలో గుర్తుంచుకోవాల్సి విషయాలేంటి?
- జంక్ ఫుడ్ తీసుకోవడాన్ని పరిమితం చేయడంతో పాటు, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.
- మొదటిది, జంక్ ఫుడ్ ఎంపిక చేసే సమయంలోనే జాగ్రత్తగా చేయండి. జంక్ ఫుడ్‌లో కూడా మిగిలిన వాటితో పోలిస్తే కొన్ని పదార్థాలు కొంచెం ఆరోగ్యకరంగా ఉంటాయి. బయట ఆహారం తినాలనుకున్నప్పుడు, లేదా తినాల్సి వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుని తినండి.ఆహారంలో కూరగాయలు, పండ్లు, గోధుమ ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి.
- అంతే కాదు నచ్చింది కదా అని ఎక్కువ తినకుండా ఆహారాన్ని సమతుల్యంగా ఉంచుకునేలా చూసుకోండి. మితంగా తీసుకుంటే ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- జంక్ ఫుడ్ తిన్న తర్వాత డ్రింకులకు బదులుగా సోంపులు, జీలకర్ర వంటి అరుగుదలకు సహాయపడే వాటిని తీసుకోండి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడి ఆరోగ్యానికి నష్టం రాకుండా కాపాడతాయి.
- అలాగే జంక్ ఫుడ్ తిన్న మరుసటి రోజు మీరు చేసే వాకింగ్, జాగింగ్ వంటి శారీరక కర్యకలాపాలను రోజు కంటే కాస్త ఎక్కువగా చేయండి.
జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు
కొంతమందికి జంక్ ఫుడ్ తినడం వెంటనే ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించకపోవచ్చు. అలాంటి వారు దాదాపు రోజూ వీటిని తింటుంటారు. నిజానికి వెంటనే ఎలాంటి ప్రభావం చూపలేదంటే జంక్ ఫుడ్ వారికి నష్టం చేయదనేం లేదు. దీర్ఘకాలంలో దీని దుష్ప్రభావాలు బాగా ఇబ్బంది పెట్టవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, ఊబకాయం, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు అధిక జంక్ ఫుడ్ తినడం వల్ల సంభవించవచ్చు. అందువల్ల, మీరు జంక్ ఫుడ్ వీలైనంత తినడం తగ్గించడం మంచిది.
టాపిక్