Almond side effects: వయసు బట్టి రోజుకు ఎన్ని బాదాం పలుకులు తినాలో తెలుసా.. ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్, పోషక నష్టం
Almond side effects: బాదాం మితంగా తింటేనే దాని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలం. రుచి బాగుంది కదాని, ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తిన్నారంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. కాబట్టి వయసును బట్టి రోజుకు ఎన్ని బాదాం తీసుకుంటే మంచిదో, ఎక్కువగా తింటే ఏ సమస్యలు వస్తాయో చూడండి.
మనలో చాలా మందికి ఉదయాన్నే నానబెట్టిన బాదాం తినే అలవాటుంటుంది. బాదాం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ వాటిని అతిగా తింటే మాత్రం అనర్థమే. ఇంతకీ ఏ వయసు వాళ్లు రోజుకు ఎన్ని బాదాం తినొచ్చు? ఎక్కువగా తింటే జరిగే నష్టాలేంటో చూడండి.
ఎవరెన్ని తినొచ్చు?
సాదారణంగా రోజుకు 20 నుంచి 23 బాదాం గింజలు తిన్నా ఆరోగ్యకరమే. ఇక చిన్న పిల్లలు రోజుకు 3 నుంచి 4 బాదాంలు తింటే సరిపోతుంది. 5 నుంచి 8 ఏళ్ల వయసు మధ్య పిల్లలైతే రోజుకు 8 నుంచి 10 బాదాంలు తిన్నా ఆరోగ్యకరమే. ఈ మోతాదు కన్నా ఎక్కువ తింటే మాత్రం సమస్యలు వచ్చేస్తాయి. బాదాం ఎక్కువగా తింటే ఏమవుతుందో చూడండి
కిడ్నీ స్టోన్స్:
శరీరంలో ఎక్కువ మోతాదులో క్యాల్షియం ఆక్జలేట్లు చేరినప్పుడు కిడ్నీలో రాళ్లు రావచ్చు. కానీ మితంగా తింటే మాత్రం ఈ సమస్య రాకుండా బాదాంలతో కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి కిడ్నీలు బలహీనంగా ఉన్నవాళ్లు, ఇదివరకు కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.
బరువు:
బాదాంలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వంద గ్రాముల బాదాంలో 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంట్లో ఎక్కువగా మోనో శ్యాచురేటెడ్ కొవ్వులుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కదలకుండా కూర్చునే బద్దకమైన జీవనవిధానం ఉంటే ఈ కేలరీలు ఖర్చవవు. దీంతో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.
విటమిన్ ఈ:
100 గ్రాముల బాదాంలో అంటే దాదాపుగా సగం కప్పు అనుకోండి. దాంట్లో 25 మిల్లీ గ్రాముల విటమిన్ ఈ ఉంటుంది. సాధారణంగా శరీరానికి రోజుకు 15 మి.గ్రాముల విటమిన్ అవసరం. కప్పు బాదాం గనక ఏ రూపంలో అయినా తీసుకున్నారంటే మీకు కావాల్సినదానికంటే రెండింతల విటమిన్ ఈ అందుతుంది. ఇంత వరకు అయితే పరవాలేదు. దీంతో పాటే ఆహారంలో విటమిన్ ఈ ఉండే గుడ్లు, పాలకూర, గింజలు తీసుకున్నారంటే దీని మోతాదు ఎక్కువగా అందుతుంది. దాంతో డయేరియా, దృష్టిలో అస్పష్టత లాంటి సమస్యలు వచ్చేస్తాయి.
పోషకాల శోషణ:
దీంట్లో పీచు శాతం ఎక్కువ. దీంతో ఇది క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి పోషకాలతో చేరి శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడొచ్చు. దీంతో పోషకాహార లోపం వస్తుంది.
పోషకాల మోతాదు:
100 గ్రాముల బాదాం గింజల్లో 2.3 మిల్లీ గ్రాముల మాంగనీసు ఉంటుంది. ఇది మన శరీరానికి కావాల్సిన అత్యధిక మోతాదు. రోజుకు శరీరానికి 1.3 మి.గ్రా నుంచి 2.3 మి.గ్రా మాంగనీసు అవసరం. కానీ బాదాంతో పాటూ ఆకుకూరలు, హెర్బల్ టీలు, ధాన్యాలు తీసుకుంటే మాంగనీసు శరీరంలో ఎక్కువగా చేరుతుంది. దీంతో బీపీ మందులు, యాంటీ బయాటిక్స్ పనితీరు మీద ప్రభావం పడుతుంది.
మలబద్దకం:
ఎక్కువగా బాదాం తింటే జీర్ణ సంబంధిత వ్యాధులూ చుట్టు ముట్టేస్తాయి. బ్లోటింగ్, మలబద్దకం, కడుపులో వికారం లాంటి సమస్యలొస్తాయి. బాదాంలో పీచు శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. శరీరంలో పీచు ఎక్కువగా చేరితే ఏ సమస్య రాకుండా ఉండటానికి తాగే నీటి మోతాదు కూడా పెంచాలి. దీనికన్నా బాదాం మితంగా తినడమే ఉత్తమం.