Thumb Sucking Habit : మీ పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకుంటున్నారా? అయితే ఎత్తు పళ్లు వస్తాయ్..
Thumb Sucking Problems : చిన్న పిల్లలకు నోట్లో బోటనవేలు పెట్టుకుని చప్పరించడం అలవాటుగా ఉంటుంది. ఎంత చెప్పినా అస్సలు వినరు. కొట్టినా.. తిట్టినా.. ప్రయోజనం ఉండదు. దీనిద్వారా పంటి, దవడ సమస్యలు వస్తాయి.
పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం సాధారణం. ఇది చాలా మంది తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తుంది. అయితే ఇది చిన్న పిల్లలు ప్రశాంతంగా ఉండటానికి, నిద్రించడానికి కూడా సహాయపడుతుంది. దీనితో ప్రస్తుతంలో ఎలాంటి సమస్య ఉండనప్పటికీ.. భవిష్యత్‍లో మాత్రం ఇబ్బందే అంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి దంత ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
బొటనవేలు చప్పరించడం పిల్లల దంతాలు, మొత్తం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాశ్వత దంత నష్టం, ప్రసంగించే క్వాలిటీపై ప్రభావం పడుతుంది. ఇటీవల దీనికి సంబంధించి ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఒక పిల్లవాడు బొటనవేలును అలవాటుగా చప్పరించినప్పుడు అది ముందు పళ్లు బయటికి వంగిపోయేలా చేస్తుందని వీడియో వివరిస్తుంది. ఈ నిరంతర అలవాటు దంత సమస్యకు దారి తీస్తుంది. ముందు దంతాల అమరికకు అంతరాయం కలిగిస్తుంది. ఇలా అయితే భవిష్యత్‍లో దంతాలు సరిచేయడానికి బ్రేస్‌లు అవసరం వస్తుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది.
మీ బిడ్డ బొటనవేలు చప్పరించే అలవాటను మాన్పించాలి. దీనికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మీ బిడ్డ ఆ అలవాటును మానుకున్నప్పుడు ప్రశంసలు, బహుమతులు అందించండి. అలవాటు మానేస్తే.. గిఫ్ట్ ఇస్తామని చెప్పండి. వారికోసం రివార్డ్ చార్ట్ తయారు చేయండి. ఇదిగో ఇన్ని రోజులు నువ్ బొటనవేలు నోట్లో పెట్టుకోలేదు.. ఇన్ని బహుమతులు అని చెప్పండి.
బొటనవేలు చప్పరించడాని కారణాలను గుర్తించండి. పిల్లల భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి. ఒత్తిడి, విసుగు, అలసట కారణంగా ఇలా చేస్తున్నారా అని చూడండి. దీనిద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.
మీ పిల్లల చేతులు నోటిలోకి తీసుకెళ్లకుండా ప్రత్యామ్నాయ ఆలోచన చేయండి. వేరే కార్యకలాపాలపై వారికి ధ్యాస ఉండేలా చేయాలి. రెండు చేతులను ఉపయోగించి ఆడుకోవాల్సిన బొమ్మలు, పజిల్‌లు, ఇతర ఆటలను నేర్పించండి.
కొంతమంది తల్లిదండ్రులు బొటనవేలు నోట్లో పెట్టుకోవడాన్ని తగ్గించేందుకు థంబ్ గార్డ్‌లు లేదా గ్లోవ్‌లను పిల్లలకు ఇస్తారు. ఈ పరికరాలు బొటనవేలు చప్పరించడాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వారికి సంతృప్తి ఉండదు. బొటనవేలును చప్పరించకుండా రిమైండర్‌గా పనిచేస్తాయి.
చేదు రుచి కూడా మీ పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకోకుండా చేస్తాయి. వేప రసం లాంటిది వేలుకు రాయండి. వీటిని చప్పరించడం అసహ్యకరమైనదిగా పిల్లలు అనుకుంటారు. మార్కెట్లో వేరేవి కూడా కొన్ని దొరుకుతాయి. సురక్షితమైనవి, విషపూరితం కానివి తెచ్చుకోవాలి. కానీ ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో వాడాలి.
కొన్నిసార్లు పిల్లలు తమ తోటివారు లేదా తోబుట్టువులకు ఈ అలవాటు లేకపోవడాన్ని గమనిస్తారు. మీ ఇంట్లో ఉన్నవారిని ఎగ్జాంపుల్‍గా చూపించండి.