Fruits in Dinner: డిన్నర్లో కేవలం పండ్లు మాత్రమే తినడం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి-how does eating only fruit for dinner affect health everyone should know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits In Dinner: డిన్నర్లో కేవలం పండ్లు మాత్రమే తినడం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

Fruits in Dinner: డిన్నర్లో కేవలం పండ్లు మాత్రమే తినడం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

Haritha Chappa HT Telugu
Published Jun 22, 2024 02:00 PM IST

Fruits in Dinner: రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తిని నిద్రపోయే వారు ఎంతో మంది. బరువు తగ్గాలన్న ఆశతో ఇలా చేస్తారు. ఇలా పండ్లు మాత్రమే తిని నిద్రపోవడం ఆరోగ్యకరమో కాదో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

రాత్రి పూట పండ్లు మాత్రమే తినవచ్చా?
రాత్రి పూట పండ్లు మాత్రమే తినవచ్చా? (Shutterstock)

పండ్లు తినడం మంచిదే. ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన పండ్లు మీ శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలను అందించడంతో పాటూ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. రాత్రి పూట ఎంతో మంది భోజనం చేయడం మానేశారు. ఒక ప్లేట్ నిండా పండ్లు తిని నిద్రపోతున్నారు. ఇలా బియ్యం, చపాతీ, కూరగాయలతో చేసిన వంటకాలకు బదులు ఇలా పండ్లు మాత్రమే తిని నిద్రపోవడం మంచిదో కాదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

బరువు తగ్గించే ప్రయాణంలో భాగంగా ఎంతో మంది ప్రజలు పండ్లు, సలాడ్లు తిని నిద్రపోతున్నారు. కానీ కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల ప్రోటీన్, కొవ్వులు, పిండి పదార్థాలు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందవు. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

డిన్నర్లో పండ్లు తినడం మంచిదేనా?

మీరు రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు తగ్గిపోరు. బరువు తగ్గాలంటే సమతులాహారం తీసుకోవడంతో పాటూ వ్యాయామం చేయాలి. అలాగే కొవ్వు లేని ఆహారాన్ని తినాలి. డిన్నర్లో తేలికపాటి ఆహారం ఉండడం మంచిదే, కానీ ప్రొటీన్ లేని ఆహారం మాత్రం ఉండకూడదు. పులావ్, కిచిడీ, పప్పు అన్నం, చిరుధాన్యాలతో చేసిన అల్పాహారాలు లాంటివి డిన్నర్లో తినవచ్చు. వీటిలో ప్రోటీన్ ఉంటుంది. అలా కాకుండా కేవలం పండ్లు మాత్రమే తింటే కొన్ని రకాల పోషకాలు శరీరానికి అందక అది ఆకలితో అలమటిస్తుంది.

పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కేవలం పండ్లను మాత్రమే రాత్రి భోజనంలో తినడం మంచి పద్దతి కాదు. గోధుమలతో చేసిన, లేదా అన్నం, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యం. సాధారణంగా డైటీషియన్లు పండ్లను అల్పాహారంలో లేదా సాయంత్రం చిరుతిండిగా తినమని సిఫార్సు చేస్తారు. కానీ వాటినే ప్రధాన భోజనంగా తినమని చెప్పరు.

సమతుల ఆహారంలో పండ్లు కూడా భాగమే. సమతుల్య ఆహారంతోనే మన రోజువారీ పోషక అవసరాలను తీర్చకోగలం. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు వంటివన్నీ ఆహారంలో భాగం కావాలి. అయితే రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తినేవారు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సమయాల్లో మాత్రం సమతుల్య పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేసి రాత్రి భోజనంలో పండ్లు మాత్రమే తీసుకుంటే మాత్రం శరీరానికి ఏమాత్రం మంచిది. ఉదయం చేసే అల్పాహారంలో ప్రొటీన్ నిండిన ఆహారాన్ని తినాలి. అలాగే మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా రోటి, పెరుగు, కూరగాయలతో వండిన వంటకాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి 7 గంటలకు త్వరగా డిన్నర్ తినేస్తే, నిద్రపోయే ముందు అంటే 9 గంటల సమయంలో ఆపిల్, నట్స్ వంటివి తింటే మంచిది.

ఆరోగ్యకరమైన డిన్నర్ ఐడియాలు

మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూ, చర్మ సౌందర్యాన్ని, జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించే ఆహారాన్ని తినడం చాలా అవసరం. అలాగే బరువు పెరగకుండా ఉండే భోజనాన్ని కూడా తినాలి. రాత్రి భోజనంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో డైటీషియన్లు సిఫారసు చేస్తున్నారు.

  • కిచిడీ, సబ్జీ
  • పప్పు, అన్నం
  • మిల్లెట్ కిచిడీ
  • మిల్లెట్ దోశ, సాంబార్
  • ఎగ్ పులావ్
  • ఎగ్ కర్రీ, అన్నము
  • ఆమ్లెట్ చపాతీ, కూర
  • రోటీ, కూర

Whats_app_banner