ఒక మారుమూల గ్రామంలో పుట్టిన సాధారణ అమ్మాయి నందిని గుప్తా. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. చిన్నప్పటినుంచి పొలాల గట్ల మీద పెరిగిన బాల్యం నందినిది. అలాంటి అమ్మాయి ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక రైతు బిడ్డకు ఇంత ధైర్యం.. ఏదైనా సాధించగలననే సానుకూల దృక్పథం ఎలా వచ్చింది?
జీవితం ఎవరికీ పూల పాన్సు కాదు. ఒత్తిళ్లు ప్రతిక్షణం అణిచివేయడానికి చూస్తూనే ఉంటాయి. అలాంటి ఒత్తిళ్ళ మధ్య కూడా నందిని గుప్తా తన ప్రశాంతమైన ప్రవర్తనతోనే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రపంచ వేదికపై నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ముఖ్యంగా అపారమైన ఒత్తిడిని తట్టుకునే శక్తి కావాలి. ఆమె ఆ ఒత్తిడిని తట్టుకోవడం చిన్నప్పటినుంచి అలవరచుకుంది. పాజిటివ్ థింకింగ్ అనేది ఆమెకి ఎంతగానో సహాయపడినట్టు చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. నందిని కఠినమైన పరిస్థితులను కూడా తన సానుకూల మనస్తత్వం వల్ల అధిగమించి బయటపడ్డానని వివరించింది.
పోటీ సమయంలో ఎవరికైనా అతి తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, దాన్ని తట్టుకోవడం కూడా అందాల పోటీల్లో భాగమేనని చెబుతోంది నందిని. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నప్పుడు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అనేకమంది మోడల్స్ పరిచయమయ్యారని, వారితో మంచి రోజులు చెడు రోజులు రెండూ ఉన్నాయని వివరించింది. కానీ వారందరినీ తన కుటుంబంగా భావించే వారితో 40 రోజులు పాటు ప్రయాణం చేశానని.. అందుకే వారిని కుటుంబంగా చెడు సంఘటనలను కూడా సానుకూలంగా మలుచుకున్నాను అని చెబుతోంది. మిస్ ఇండియా పోటీలు ముగిసిపోయాక అందరం ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లే రోజు వచ్చిందని ఆ రోజు అన్ని విషయాలను మరిచిపోయి ఎంతో బాధపడ్డామని వివరించింది నందిని గుప్తా.
అంతర్జాతీయ వేదికపై మెరవాలంటే కేవలం అందం ఉంటే సరిపోదని చెబుతోంది నందిని గుప్తా. అక్కడ జరిగే ప్రతి సంఘటనను సానుకూలంగా ఆలోచించి తీసుకుంటే ముందుకు సాగడం సులువవుతుందని... లేకుంటే ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది అని వివరిస్తోంది.
సానుకూలంగా ఉండేందుకు ప్రతి ఉదయం రెండు నుండి ఐదు నిమిషాలు పాటు ధ్యానం చేస్తోంది నందిని. ప్రశాంతమైన సంగీతాన్ని ప్రతిరోజూ వింటుంది. అలాగే కాసేపు నాట్యం చేస్తుంది. ఇవన్నీ కూడా తనను మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉంచేందుకు సహాయపడుతున్నాయని వివరించింది. అలాగే సమయం దొరికినప్పుడల్లా యోగా కచ్చితంగా చేస్తుంది. నందిని తన తల్లి కారణంగానే ధ్యానం, యోగా చేయడం ప్రారంభించినట్టు చెప్పింది.
18 ఏళ్ల వయసులోనే కుటుంబానికి దూరంగా ముంబై వంటి నగరాల్లో నివసించేందుకు వచ్చినట్టు వివరించింది. ఆ సమయంలో ఒంటరిగా ఉండటం వల్ల కష్టంగా అనిపించేదని... ఆ కఠినమైన సమయాలను దాటేందుకు ధ్యానం తనకు ఎంతో సహాయపడిందని చెప్పింది. అలాగే లోతైన శ్వాస వ్యాయామాలు కూడా సానుకూల మనస్తత్వాన్ని పొందడానికి సహాయపడ్డాయని వివరించింది.
అందాల పోటీల్లో అంతర్జాతీయ వేదికలపై మెరవాలంటే పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండాలని అందరూ అనుకుంటారు. నిజానికి నందిని వెనుక ఎవరూ లేరు. ఆమెను ప్రేమించే తల్లి, బాధ్యతగా భావించే తండ్రి మాత్రమే. ఆ తండ్రి కూడా కోటీశ్వరుడు కాదు.. కేవలం ఒక రైతు. కొన్ని ఎకరాల భూమిలో రకరకాల పంటలను పండించి కుటుంబాన్ని సాకే వ్యక్తి.
నందిని అంతర్జాతీయ వేదికపై అందాల రాణిగా చూడాలనేది తల్లి కాంక్ష. ఆ తల్లి చిన్న వయసు నుంచే అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఇంట్లోనే శిక్షణను ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే నందిని తల్లి కూడా ఒక అందాల దేవతే. ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్ర అందాల పోటీల్లో ఒకప్పుడు పాల్గొంది. తన సాధించలేనిది తన కూతురు సాధించాలన్న కోరికతోనే నందినినీ ప్రోత్సహించింది. ఆమె తల్లి నిర్ణయానికి తండ్రి కూడా బాసటగా నిలిచాడు.