Kolkata Rape case: కోల్‌కతా వైద్యురాలిని నిందితుడు అంత క్రూరంగా ఎలా చంపగలిగాడు? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో చదవండి
Kolkata Rape case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు దేశాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా మహిళలు ఆ సంఘటన తలుచుకుంటేనే భయంతో వణికి పోతున్నారు. ఒక వ్యక్తి ఎదుటి మనిషిని అంత క్రూరంగా ఎలా చంపగలడో వివరిస్తున్నారు మానసిక శాస్త్రవేత్తలు.
Kolkata Rape case: పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ను అతి కిరాతకంగా ఆసుపత్రిలోనే హత్యకు గురైంది. ఒక నరరూప రాక్షసుడు సెమినార్ హాల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఆ ట్రైనీ డాక్టర్‌ను చిత్రహింసలు పెట్టి చంపినట్టు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా చెబుతోంది. ఈ హత్య తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కిరాతకంగా చంపేశాడు
పోస్టుమార్టం రిపోర్డులో వైద్యురాలిని ఎంత కిరాతకంగా చంపాడో బయటపడింది. అది చదివిన ప్రతి ఒక్కరి రక్తం ఉడికిపోతోంది. ఇద్దరికీ ఎలాంటి శత్రుత్వం లేకపోయినా కేవలం తన శారీరక వాంఛ కోసం భయానకంగా చంపడం అనేది ఒక మానసిక రుగ్మతగానే భావించాలి. సాటి మనిషిని అతి కిరాతకంగా చంపి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లి నిద్రపోయాడంటే అతనిలో ఏమూల తప్పు చేసిన ఫీలింగ్ లేదంటే అతను మనసు ఎంత కరుడుకట్టుకు పోయిందో. ఇలాంటి మానవ మృగాలు గతంలో కూడా చరిత్రలో తారసపడ్డారు. వారిని ఇలాంటి హేయమైన చర్యలకు ప్రేరేపించేది ఏమిటి? వారి పెంపకమా? వారిలో ఉన్న మానసిక రుగ్మతా? లేక బాల్యంలో అనుభవించిన గాయాలా? మానసిక శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని వివరిస్తున్నారు.
ఈ మానసిక డిజార్డర్ల వల్లే
ఎవరైనా తీవ్ర నేరం చేసినప్పుడు వారి ప్రతికూల ప్రవర్తనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువే మానసిక కారకాలు ఉండే అవకాశం ఉంది. 2017లో నేరం చేసిన 228 మంది ఖైదీలపై అధ్యయనాన్ని నిర్వహించారు పరిశోధకులు. వారిలో 80 శాతానికి పైగా నేరస్తులకు వ్యక్తిత్వ లోపాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు. అలాగే వారిలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటి డిజార్డర్ల బారిన పడిన వారే ఎదుట వ్యక్తిని కనీస మానవత్వం లేకుండా అతి కిరాతకంగా తమ అవసరం కోసం చంపేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బాల్యంలో తగిలిన గాయాలు
ప్రతి బిడ్డ పుట్టినప్పుడు అప్పుడే విరిసిన పువ్వులా స్వచ్ఛంగా ఉంటారు. కానీ వారు ఎదిగిన వాతావరణమే వారిలో నేర ప్రవర్తనను పెంపొందిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక పిల్లవాడు తన బాల్యంలో శారీరక వేధింపులకు, నిర్లక్ష్యానికీ గురైనప్పుడు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల వల్ల మానసికంగా దెబ్బతిన్నప్పుడు, అలాగే వారి కుటుంబ సభ్యులు మరణాన్ని నేరుగా చూసినప్పుడు...వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఆ పరిణామాలు వారిలో దీర్ఘకాలంగా కొనసాగుతాయని వివరిస్తున్నారు. అవి మానసిక రుగ్మతలుగా కూడా మారతాయని చెబుతున్నారు.
ముఖ్యంగా బాల్యంలో ఉన్నవారు కౌమార దశకు వచ్చేసరికి హింసా ప్రవృత్తిని చూపించే అవకాశం ఉంది. వారు పదే పదే తప్పులు చేస్తూ నేరస్తులుగా మారే అవకాశం కూడా ఉంది. వారిలోని నెగిటివ్ భావోద్వేగాలు వారిని తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. ఎప్పుడైతే ఆ భావోద్వేగాల నుండి వీరిని డిస్‌కనెక్ట్ చేయడం జరుగుతుందో అప్పుడే వారు సన్మార్గంలో నడుస్తారు. అలా డిస్ నెక్ట్ చేసే సామర్థ్యం మానసిక వైద్యులకు ఉంది. అలాంటి పిల్లలకు ఖచ్చితంగా చిన్న వయసులోనే మానసిక చికిత్సను అందించాలి. అప్పుడే అతడు పెద్దయ్యాక భయానకమైన నేరాలను చేయకుండా ఉంటాడు.
మాదకద్రవ్యాలు కూడా
ప్రస్తుతం మాదకద్రవ్యాలు కూడా వ్యక్తులను నేరస్తులుగా మారుస్తున్నాయి. వారిలో సున్నితమైన ఆలోచనలను చంపేస్తున్నాయి. ఆ మాదకద్రవ్యాలు మెదడును తీవ్రంగా ప్రభావితం చేసి వారిలో నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని చెప్పాయి.
కోల్‌కతా డాక్టర్‌ని చంపిన సంజయ్ రాయ్ అనే నిందితుడు కూడా పదేపదే నేరాలు చేసిన వ్యక్తే. ఆయనకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఒక్క భార్యతో కూడా సవ్యంగా ఉండలేకపోయాడు. అంతే కాదు అతని భార్య మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడే తీవ్రంగా దాడి చేశాడు. ఆమెకు అబార్షన్ కూడా అయింది. ఆమె అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.పుట్టబోయే బిడ్డను కోల్పోయినా కూడా అతనిలో పశ్చాత్తాపం లేదని అతని మూడో భార్య తల్లి చెబుతోంది. నలుగురు భార్యలు ఆయనతో జీవించలేక వెళ్ళిపోయారంటే అతనిలో వ్యక్తిత్వలోపం, మానసిక సమస్యలు ఉన్నాయని అర్థమవుతుంది. ఒక భార్య క్యాన్సర్ తో బాధపడుతూ మరణించింది. అయినా కూడా ఆయనలో మానవత్వం అనేది మేల్కొనలేదు. ఆమెను చూసేందుకు ఇష్టపడలేదు.
అతనిలో సామాజిక, మానసిక రుగ్మతలు తీవ్రంగా ఉండడం వల్లే ఇలాంటి భయానకమైన చర్యకు పాల్పడి ఉంటాడని మానసిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాంటి వ్యక్తి సమాజంలో తిరిగితే మరిన్ని నేరాలు చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
టాపిక్