కేవలం ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని సంవత్సరాల ముందే తెలుసుకోవచ్చని మీకు తెలుసా? ఈ విషయంపై మణిపాల్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగాధిపతి, కన్సల్టెంట్ డాక్టర్ ఆర్ కేశవ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. శరీరంలో దాగి ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ను (వాపును) సీఆర్పీ (C-reactive protein) స్థాయిలను పర్యవేక్షించడం ద్వారా ఎలా గుర్తించవచ్చో, తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎలా అంచనా వేయవచ్చో ఆయన తెలిపారు.
డాక్టర్ కేశవ మాట్లాడుతూ, "శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు సీ-రియాక్టివ్ ప్రొటీన్ (CRP) ఒక ముఖ్యమైన సూచిక. ఇది ఇన్‌ఫెక్షన్లు (ఉదాహరణకు, దగ్గు, జలుబు, జ్వరం, న్యుమోనియా, వైరల్ ఇన్‌ఫెక్షన్లు) వంటి పరిస్థితుల్లో లేదా రోగి వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు పెరుగుతుంది. సాధారణ సీఆర్పీ స్థాయిలు సాధారణంగా 1 mg/L చుట్టూ ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ సమయంలో ఇది 100 mg/L లేదా అంతకంటే ఎక్కువగా కూడా పెరగొచ్చు" అని చెప్పారు.
ఆయన ఇంకా వివరిస్తూ, "ఈ పరీక్షలో hs-CRP (హై-సెన్సిటివ్ CRP) అనే మరింత నిర్దిష్టమైన వేరియంట్ ఉంది. ఇది రక్తనాళాలలో తక్కువ స్థాయిలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ను కొలవడానికి ఉపయోగిస్తారు. గుండె ఆరోగ్యం, రక్తనాళాల ఆరోగ్యం, భవిష్యత్తులో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి దీనిని తరచుగా ఉపయోగిస్తారు" అని పేర్కొన్నారు.
"సాధారణ hs-CRP స్థాయిలు 1 నుండి 3 mg/L కంటే తక్కువగా ఉండవచ్చు. ఇది ఏదైనా వ్యాధుల ప్రమాదాన్ని తక్కువగా సూచిస్తుంది. Hs-CRP స్థాయిలు 1 నుండి 3 mg/L మధ్య ఉంటే మధ్యస్థాయి ఇన్‌ఫ్లమేషన్ ప్రమాదాన్ని సూచిస్తాయి. అయితే, 3 mg/L కంటే ఎక్కువ స్థాయిలు రక్తనాళాలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. Hs-CRP స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్లు సూచిస్తుంది. ఇది గుండెకే పరిమితం కాదు.. శరీరంలోని రక్తనాళాల్లో ఎక్కడైనా ఉండవచ్చు. ఇది అనేక చిన్న అల్సర్‌లు లేదా క్రియాశీల ఇన్‌ఫ్లమేటరీ పాయింట్‌లను సూచిస్తుంది" అని డాక్టర్ కేశవ వివరించారు.
అయితే, "శరీరంలో మరెక్కడైనా క్రియాశీల ఇన్‌ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నట్లయితే, hs-CRP స్థాయిలు గుండె సంబంధిత సమస్య కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఎక్కువగా చూపించవచ్చు. ఉదాహరణకు, మీ hs-CRP 10 లేదా 15 mg/L ఉన్నట్లయితే, అది గుండె సంబంధిత సమస్య కాకుండా సాధారణ ఇన్‌ఫెక్షన్ వల్ల అయి ఉండవచ్చు. కాబట్టి, రక్తనాళాల ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి hs-CRPని పరిగణనలోకి తీసుకునే ముందు ఇన్‌ఫెక్షన్లను నిర్ధారించుకోవడం ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు.
"hs-CRP పరీక్ష కోసం ఎటువంటి నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు" అని డాక్టర్ కేశవ తెలిపారు. "తమ గుండె లేదా రక్తనాళాల ఆరోగ్యం గురించి అసాధారణంగా ఏదైనా అనుమానిస్తున్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో, hs-CRP పరీక్ష విలువైన సమాచారాన్ని అందించగలదు" అని ఆయన అన్నారు.
"చికిత్స విషయానికొస్తే, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఉపయోగించే స్టాటిన్స్ అనే మందులు hs-CRP స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి" అని డాక్టర్ కేశవ చెప్పారు. "కాబట్టి, మీ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ పరిధిలో ఉన్నప్పటికీ, పెరిగిన hs-CRP స్థాయిలను తగ్గించడానికి మీ డాక్టర్ స్టాటిన్స్ సిఫార్సు చేయవచ్చు." అని తెలిపారు.
"ప్రస్తుతం, కేవలం hs-CRP తగ్గించడం కోసం స్టాటిన్స్‌ను ఎంతకాలం వాడాలి లేదా ఈ సందర్భంలో ఖచ్చితమైన క్లినికల్ టార్గెట్‌లు ఏమిటో వైద్య మార్గదర్శకాలు స్పష్టంగా నిర్వచించలేదు. పరిశోధనలు కొనసాగుతున్నాయి. భవిష్యత్ అధ్యయనాలు hs-CRP-నిర్దిష్ట చికిత్సల పాత్రపై మరింత స్పష్టతను అందిస్తాయి" అని వివరించారు.
"డయాబెటిస్, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి సాంప్రదాయ ప్రమాద కారకాలు ప్రాథమిక ఆందోళనలుగా మిగిలిపోతాయి. అయితే, hs-CRP శరీరంలో నిశ్శబ్ద ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించడం ద్వారా మరో ముఖ్యమైన సంకేతాన్ని తెలుసుకున్నట్టవుతుంది. ఇది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యకు ముందస్తు హెచ్చరిక కావచ్చు" అని ఆయన స్పష్టం చేశారు.
(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)