Warm water Vs Cool Water: వేడి నీరు VS చల్లని నీరు... ఈ రెండింటిలో ఏది తాగితే త్వరగా బరువు తగ్గుతారు?
Warm water Vs Cool Water: బరువు తగ్గాలన్న కాంక్షతో ఎంతో ప్రయాస పడుతున్న వారు ఉన్నారు. ఎలాంటి ఆహారాన్ని తింటే బరువు తగ్గుతామో నిత్యం శోధిస్తూనే ఉంటారు. అలాంటివారు ఎలాంటి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారో తెలుసుకోవాలి.
Warm water Vs Cool Water: మన ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. నీరు బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎంతో మందిలో ఉండే సందేహం... బరువు తగ్గడానికి వెచ్చని నీరు తాగాలా? లేదా చల్లటి నీరు తాగాలా? అని. కొంతమంది వేడి నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతామని అనుకుంటారు. మరికొందరు చల్లటి నీరే మంచిదని అనుకుంటారు. దీనికి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
వేడి నీళ్లు తాగితే...
ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. జీర్ణ ఎంజైమ్లు ఉత్పత్తి చక్కగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. ఇది ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల శరీరానికి పోషకాల శోషణ ప్రభావంతంగా ఉంటుంది. బరువు తగ్గాలంటే జీర్ణ క్రియ సవ్యంగా జరగాలి. వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. కాబట్టి బరువు త్వరగా తగ్గవచ్చు. అలాగే వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విషాలను, వ్యర్ధాలను బయటికి పంపవచ్చు. శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో గోరువెచ్చని నీళ్లు ముందుంటాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఇంకా మంచిది. గోరువెచ్చని నీళ్లు శరీర ఉష్ణోగ్రతను తాత్కాలికంగా కొంతవరకు పెంచుతుంది. దీనివల్లే జీవక్రియ కూడా వేగాన్ని పెంచి ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు భోజనానికి ముందు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల అధికంగా తినడం కూడా తగ్గుతుంది తద్వారా కూడా బరువు తగ్గొచ్చు.
చల్లని నీరు తాగితే...
చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంది. మళ్లీ తిరిగి ఉష్ణోగ్రత పెరగడానికి శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఇది జరగడానికి ఎన్నో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇలా బర్న్ అయిన క్యాలరీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. ఆ సమయంలో చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే మరింత ఎక్కువ కాలం వ్యాయామం చేయడానికి ఇది సహాయపడుతుంది. గోరువెచ్చని నీళ్ళలాగే చల్లటి నీరు కూడా జీవక్రియను పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల ఆకలి కాస్త తగ్గుతుంది. భోజనానికి ముందు చల్లటి నీరు తాగడం వల్ల మంచే జరుగుతుంది.
రెండింటిలో ఏది తాగాలి?
గోరువెచ్చటి నీరైనా, చల్లని నీరైనా రెండూ బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి ఏది ఎంపిక చేసుకోవాలన్నది మీ ఇష్టమే. ఏదేమైనా నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రెండూ జీర్ణ క్రియను ప్రేరేపించడంలో ముందుంటాయి. అయితే ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తే మంచిది. దానిలో నిమ్మరసం జోడించుకుంటే ఇంకా మంచిది. ఇది ఆకలిని నియంత్రించడానికి, అతిగా తినడాన్ని నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆహారాన్ని ఎక్కువగా తినకుండా అడ్డుకుంటుంది. ఇక చల్లటి నీరు విషయానికొస్తే వ్యాయామం చేసేటప్పుడు చల్లటి నీరు తాగడమే మంచిది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా అడ్డుకొని శరీరానికి ఓదార్పుని ఇస్తుంది. కాబట్టి కొన్నిసార్లు గోరువెచ్చని నీరు, కొన్నిసార్లు చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మొత్తం మీద ఏ నీరు తాగినా బరువు తగ్గడం సులభమే.
టాపిక్