Hot Water Or Cold Water: వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? ఎప్పుడు ఏ నీళ్లు తాగాలంటే..-hot water or cold water which is better for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hot Water Or Cold Water: వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? ఎప్పుడు ఏ నీళ్లు తాగాలంటే..

Hot Water Or Cold Water: వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగుతున్నారా? ఎప్పుడు ఏ నీళ్లు తాగాలంటే..

HT Telugu Desk HT Telugu
Sep 19, 2023 10:00 AM IST

Hot Water Or Cold Water: మీరు తాగుతున్నవి వేణ్ణీళ్లా లేక చన్నీళ్లా? ఏవి మంచివి? ఎప్పుడు ఏ నీళ్లు తాగితే ప్రయోజనాలుంటాయో వివరంగా తెలుసుకుందాం.

వేడినీళ్లు Vs చన్నీళ్లు
వేడినీళ్లు Vs చన్నీళ్లు (pexels)

వర్షాకాలంలో నీరు తేలికగా కలుషితం అయిపోతుంది. అందుకనే ఈ కాలంలో చాలా మంది నీళ్లను మరగ కాచుకుని తాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు మామూలు నీటిని తాగితే కొందరు గోరు వెచ్చని నీటిని తాగుతుంటారు. వీటిలో అసలు ఏ నీరు మంచిది? చన్నీళ్లా? వేణ్ణీళ్లా? అంటే రెండింటి వల్లా కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సమయాన్ని బట్టి ఏ నీటిని తాగడం మంచిదో నిర్ణయం అవుతుందంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

ఇక్కడ చల్లటి నీళ్లు అంటే ఫ్రిజ్ లో ఉంచిన నీళ్లని అర్థం కాదు. మామూలు గది ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లు. అలాగే వేడి నీళ్లంటే కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్లు.

చన్నీళ్లు ఎప్పుడు తాగాలి? తాగకూడదు?

  • భోజనం చేసిన తర్వాత వెంటనే ఎక్కువగా చన్నీళ్లను తాగకూడదు. కాసేపు సమయం తీసుకుని ఆ తరువాత నీళ్లు తాగాలి. లేదంటే జీర్ణ క్రియ మందగిస్తుంది. తిన్న ఆహారం అరిగేందుకు చాలా సమయం పడుతుంది.
  • ఆటలు ఆడటం, వ్యాయామాలు చేయడం లాంటివి చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు కచ్చితంగా చల్ల నీళ్లనే తాగాలి. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత సరిసమానంగా అవుతుంది.
  • చల్లటి నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది. అలసట, బద్ధకం లాంటివి తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. సన్‌ స్ట్రోక్‌ నుంచి రక్షిస్తాయి.
  • చన్నీళ్లు తల, మెడ ప్రాంతంలో ఉన్న రక్త నాళాలను సంకోచించేలా చేస్తాయి. అందువల్ల మెడ, తల నొప్పులు తగ్గుతాయి.

వేడి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు :

మామూలు నీటితో పోలిస్తే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పోషకాలను శరీరం శోషించుకునే శక్తీ పెరుగుతుంది.

  • బరువు తగ్గాలని అనుకునే వారు వేడి నీటిని తాగడం వల్ల అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు. చల్ల నీరు తాగే వారితో పోలిస్తే వేడి నీరు తాగే వారు అదనంగా 70 క్యాలరీలను ప్రతి రోజూ కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే అది శరీర జీవ క్రియ సక్రమంగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. దీంతో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
  • గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
  • గొంతులో వాపు, గొంతు నొప్పి, శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడే వారు ప్రతిసారీ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఉపశమనం పొందుతారు.
  • కొందరు మహిళల్లో పీరియడ్స్‌ సమయంలో పొట్ట నొప్పులు వస్తుంటాయి. అలాగే తలనొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడే వారు సైతం వేడి నీళ్లను తాగడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు. ఆయా అవయవాలకు రక్త ప్రవాహం మెరుగై నొప్పులు తగ్గుతాయి.