Cold : ముక్కు కారడం, తుమ్ములతో నిద్ర పట్టట్లేదా? ఈ టిప్స్ అద్బుతంగా పనిచేస్తాయి
Sleeping with cold: జలుబు చేసినప్పుడు నిద్ర పోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముక్కు కారడం, తుమ్ములతో నిద్ర పట్టదు. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం.
జలుబుతో రోజంతా ఎలాగోలా నెట్టుకొచ్చినా రాత్రి నిద్ర పట్టడం కష్టం అవుతుంది. ముక్కు కారితే నిద్ర పోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం వెంటనే ఉపశమనం దొరుకుతుంది. హాయిగా నిద్రపోవచ్చు.
జలుబు తగ్గించే చిట్కాలు:
1. తల పైకి ఉండేలా:
తలకింద దిండు పెట్టుకోవడం మర్చిపోకండి. మీకు ఇబ్బంది లేకపోతే రెండు దిండ్లు పెట్టుకోండి. దీంతో మీ తల కాస్త ఎత్తులో ఉండి శ్లేష్మం సాఫీగా కిందికి వెళ్లిపోతుంది. ముక్కులో శ్వాస తీసుకోకుండా అడ్డుగా ఉండదు. శ్వాస తీసుకోవడం సులువవుతుంది.
2. పక్కకు తిరిగి పడుకోవడం:
వెళ్లకిలా పడుకుంటే ముక్కు బ్లాక్ అవుతుంది. కాబట్టి ఒక పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస చాలా సులువుగా తీసుకోవచ్చు. అలాగే ఉదాహరణకు ఎడమ వైపు నాసిక బ్లాక్ అయినట్లు అనిపిస్తే కుడివైపు తిరిగి పడుకోండి. కుడివైపు బ్లాక్ అయితే ఎడమవైపు పడుకోండి. ఒక నిమిషంలో సులువుగా శ్వాస తీసుకుంటారు. దగ్గు కూడా రాదు.
3. వేడిగా తాగండి:
పడుకునే ముందు ఏదైనా కాస్త వెచ్చని పానీయం తాగండి. వేడి సూప్ తాగడం, వేడిగా హెర్బల్ టీ తాగడం, లెమన్ టీ లో తేనె వేసుకుని తాగడం బాగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందే కాకుండా కనీసం గంట ఎడం ఉండేలా చూడండి. అలాగే ఆవిరి పట్టినా కూడా ఉపశమనం ఉంటుంది.
4. సలైన్ వాటర్:
సలైన్ నాజల్ రిన్స్ కూడా జలుబు తగ్గించడంలో పనిచేస్తుంది. ప్రతిసారీ మాత్ర వద్దనుకుంటే ఇది ఉత్తమ మార్గం. వెంటనే శ్వాస సులువుగా తీసుకోగలరు. దీనికోసం ఉప్పు నీళ్లు లేదా సలైన్ వాటర్ వాడాలి. దీన్నే జలనేతి ప్రక్రియ అనుకోవచ్చు. ఒక నాసికలో నీళ్లు పోసి మరో నాసిక నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఒక రకంగా ముక్కు శుభ్రపడుతుంది. దీంతో జలుబూ తగ్గుతుంది. దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడేవాళ్లు జలనేతి ప్రక్రియ ప్రయత్నించవచ్చు.
5. ఉప్పునీరు పుక్కిలింత:
గొంతులో ఉండే ఇన్ఫెక్షన్, జలుబు ఉప్పునీటి పుక్కిలింత వల్ల చాలా మట్టుకు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు ఓసారి గోరువెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి గరగరమని పుక్కిలించండి. అలాగే కొన్ని ఉప్పు నీళ్లు తాగినా కూడా అలాంటి మంచి ఫలితమే ఉంటుంది.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
జలుబు చేయగానే చాలా మంది ఉపశమనం కోసం కారంగా, మసాలాలు దట్టించిన ఆహారం తింటారు. కానీ ఎంత తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తింటే అంత మేలు. ముఖ్యంగా సూప్స్ మంచి ఎంపిక. టమాటా, కార్న్, మిరియాలతో చేసిన సూపులు తాగొచ్చు. అలాగే హెర్బల్ టీలు, అల్లంటీ కూడా పనిచేస్తుంది. ఇవి జలుబుతో పాటూ దగ్గూ తగ్గిస్తాయి. గోరువెచ్చని పాలలో తేనె కలుపుకుని తాగారంటే గొంతుకు ఒక కోటింగ్ లాగా పనిచేస్తుంది. వెంటనే చికాకు తగ్గిస్తుంది.
టాపిక్