Cold in Pregnancy: శీతాకాలపు జలుబు నుంచి గర్భవతులు ఉపశమనం పొందాలంటే..
Cold in Pregnancy: చలికాలంలో గర్భవతులు జలుబుతో బాధపడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడొచ్చు. వీటిని జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.
గర్భం ధరించి, పండంటి బిడ్డకు జన్మని ఇవ్వడం అనేది ప్రతీ మహిళ జీవితంలోనూ కీలకమైన ఘట్టం. అలాంటి సమయంలో వారు శారీరకంగా, హార్మోన్ల పరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. శీతాకాలంలో తరచుగా జలుబుల్లాంటి వాటి బారినా పడుతుంటారు. అయితే ఇలాంటప్పుడు అన్ని మందుల్ని ఎలా బడితే అలా వాడటానికి అవకాశం ఉండదు. అందుకనే కొన్ని గృహ వైద్య విధానాల ద్వారా ఇలాంటి ఫ్లూల నుంచి గర్భవతులు బయటపడొచ్చు. అవేంటనేది వైద్య నిపుణులు చెబుతున్నారిలా!
ట్రెండింగ్ వార్తలు
వాము నీరు:
నీటిలో ఒక స్పూను వాము వేసి మరిగించాలి. సగానికి అయ్యాక స్టౌ కట్టేసి వడగట్టాలి. వీటిని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉప్పు నీటి పుక్కిలింత:
జలుబు, గొంతు నొప్పి ఎక్కువగా ఉన్న గర్భవతులు గోరు వెచ్చటి ఉప్పు నీటిని తరచుగా పుక్కిలిస్తే ఉండటం వల్ల లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఇది మంచి యాంటీ బయోటిక్‌లా పని చేస్తుంది. గొంతు వాపును తగ్గిస్తుంది. ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే గనుక సెలైన్ నీటిలో పసుపు వేసి పుక్కిలించడం వల్లా ప్రయోజనం ఉంటుంది.
తేనె, అల్లం రసం:
ముక్కు నుంచి ధారాళంగా జలుబు కారిపోయే స్థితిలో ఉన్న గర్భవతులు ఈ చిట్కాను చక్కగా పాటించవచ్చు. ఇంచు అల్లం ముక్కను తీసుకుని దాని నుంచి రసాన్ని తీసుకోవాలి. దానిలో టీ స్పూను తేనెను కలిపి తాగాలి. ఇది శ్వాస కోశంలో ఉన్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇంకా దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలూ ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లాంటి వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
అవిశ గింజల టీ:
అవిశ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నీటిలో వేసి పావు గంట సేపు మరిగించాలి. తర్వాత వడగట్టాలి. ఆ నీటిలో స్పూను తేనె వేసి కలపాలి. ఈ పానీయాన్ని రోజుకు రెండు సార్లు వరకు గోరువెచ్చగా తాగవచ్చు. అందువల్ల గర్భవతుల్లో జలుబు, దగ్గు లాంటివి కొద్ది రోజుల్లోనే తగ్గుతాయి.
తులసి రసం:
కడుపుతో ఉన్న వారికి తులసి ఆకుల రసం అనేది మంచి ఔషధం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకుని రసం తీయాలి. ఓ కప్పుడు గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో తులసి రసాన్ని వేయాలి. దాన్ని అలా కాస్త వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. ఇలా క్రమం తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి శ్వాస తేలికగా ఆడుతుంది. బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది.