నగరాల్లో అపార్ట్‌మెంట్లలో ఉంటున్న చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య పావురాలు. ఇవి బాల్కనీల్లో, డాబాల మీద వాలి ఆ చోటును బాగా మురికి చేస్తాయి. వాటి రెక్కల నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల దుర్వాసన వస్తుంది, కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. అంతేకాదు కొన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ పావురాలను మన ఇంటి బాల్కనీల దగ్గరకు రాకుండా చేయడం చాలా ముఖ్యం.
చాలామంది వీటిని తరిమికొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ ముళ్లను పెడతారు, పాత సీడీలను వేలాడదీస్తారు. ఇంకొందరైతే మిరపపొడి కూడా చల్లుతారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా పావురాల బెడద నుంచి మీరు తప్పించుకోకపెతే ఈసారి ఈ కొత్త ట్రిక్ ప్రయత్నించండి. అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించండి. ఇది పావురాలను భయపెట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది, పైగా వాటికి ఎలాంటి హాని కలగదు.
అల్యూమినియం ఫాయిల్ అంటే మనం ఆహారం చుట్టడానికి వాడే మెరిసే కాగితం. సాధారణంగా మెరుస్తూ కనిపించే ఈ ఫాయిల్ బాల్కనీలో పెట్టడం వల్ల సూర్యరశ్మి ఈ ఫాయిల్‌పై పడి మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. పావురాలకు ఆ మెరుపు నచ్చదు, అది వాటిని భయపెడుతుంది. అలాగే అల్యూమినియం ఫాయిల్ కదిలినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. ఈ శబ్దం కూడా పావురాలకు ఇష్టం ఉండదు, భయపెడుతుంది.
పావురాలు ఎక్కువగా బాల్కనీ రెయిలింగ్‌పై వచ్చి వాలుతుంటాయి. కాబట్టి మీరు కొంచెం అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఆ రెయిలింగ్ చుట్టూ చుట్టేయండి. ఫాయిల్ మొత్తం రెయిలింగ్‌ను కవర్ చేసేలా చూడండి. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ మెరుపు పావురాలను అక్కడికి రాకుండా చేస్తుంది.
కొన్నిసార్లు పావురాలు కుండీలలోని మొక్కలను పాడు చేస్తాయి లేదా వాటి మట్టిలో మురికి చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్‌ను చిన్న చిన్న జెండాలలా తయారు చేసి కుండీలలో ఉంచండి. ఇందుకోసం ఒక సన్నని కర్ర తీసుకుని దానికి ఫాయిల్ ను చుట్టేసి కొంత భాగాన్ని జెండాలాగా వేలాడదీయండి. ఇప్పుడు ఆ కర్ర కుండీల్లోని మట్టిలో గుచ్చిండి. ఇలా చేశారంటే పావురాలు మీ పూల కుండీల జోలికి రానే రావు.
మీ బాల్కనీలో ఉన్న లైట్ల పైన లేదా ఏసీ అవుట్‌డోర్ యూనిట్ పైన కూడా పావురాలు కూర్చుని మురికి చేస్తుంటాయి. అక్కడికి అవి రాకుండా ఉండాలంటే ఒక హ్యాంగర్‌కు అల్యూమినియం ఫాయిల్ చుట్టండి. అలాగే కొన్ని ఫాయిల్ ముక్కలను దానికి వేలాడదీయండి. ఆ మెరుపు, కదలిక వల్ల పావురాలు ఆ ప్రదేశాలకు దూరంగా ఉంటాయి.
మూడు లేదా నాలుగు రంగుల బెలూన్‌లను తీసుకోండి. వాటిపై చిన్న చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కలను అతికించండి. ఈ బెలూన్‌లను బాల్కనీ రెయిలింగ్ నుండి పై గోడకు వేలాడదీయండి. గాలికి బెలూన్లు కదులుతూ ఉంటాయి, వాటిపై అతికించిన ఫాయిల్ మెరుస్తూ ఉంటుంది. ఇది పావురాలను భయపెట్టి మీ బాల్కనీకి రాకుండా చేస్తుంది.