Veggies Peels: ఈ తొక్కల్లోనే పోషకాలెక్కువ.. ముఖానికి వాడితే సూపర్ బెనిఫిట్స్..-home beauty natural cures use these 7 vegetable peels for skin instead of throwing them in the bin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Veggies Peels: ఈ తొక్కల్లోనే పోషకాలెక్కువ.. ముఖానికి వాడితే సూపర్ బెనిఫిట్స్..

Veggies Peels: ఈ తొక్కల్లోనే పోషకాలెక్కువ.. ముఖానికి వాడితే సూపర్ బెనిఫిట్స్..

Koutik Pranaya Sree HT Telugu
Jul 06, 2024 12:30 PM IST

Veggies Peels: వంటింట్లో మిగిలిపోయే కూరగాయల పొట్టును వృథాగా పడేయకండి. వాటితో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో చూడండి.

కూరగాయల తొక్కలతో లాభాలు
కూరగాయల తొక్కలతో లాభాలు (freepik)

బంగాళదుంప, బీట్‌రూట్, క్యారట్.. ఇలా చాలా రకాల కూరగాయలు తొక్కలు తీసేసి వాడతాం. తీసేసిన తొక్కంతా చెత్తబుట్టలో పడేస్తాం. అలా కాకుండా మీకు వీలుంటే వెంటనే ఆ తొక్కతీసి ముఖానికి రాసుకుని, అది ఆరేలోపు వంట చేసేసుకోండి. చర్మ సంరక్షణ, వంట చేయడం ఒకేసారి పూర్తవుతుంది. ఈ తొక్కలని చర్మ సౌందర్యం కోసం ఇంకా ఎలా వాడొచ్చో తెల్సుకోండి. ఎలాంటి తొక్కలను వాడొచ్చో కూడా చూడండి.

1. బంగాళదుంప తొక్కలు:

వీటిలో విటమిన్ సి, బి6, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి కంటికింద నల్లటి వలయాలు తగ్గించడంలో సాయపడతాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా తయారు చేస్తాయి. ఈ తొక్కల్లో స్టార్చ్ ఉండటం వల్ల ఎండవల్ల కమిలిన చర్మానికి కూడా ఉపశమనం ఉంటుంది.

2. కీరదోస తొక్కలు:

కీరదోస పొట్టులో సిలికా, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. చర్మానికి చల్లదనం ఇచ్చి తేమ అందించే లక్షణాలు వీటికుంటాయి. కళ్ల కింద ఉండే ఉబ్బు కూడా ఈ తొక్కలు తగ్గిస్తాయి. చర్మం మీద దురద, ర్యాషెస్ ఉంటే తగ్గేలా చేస్తాయి.

3. క్యారట్ పొట్టు:

వీటిలో బీటా కెరొటిన్ ఉంటుంది. విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మం మీద సన్నటి గీతలు, ముడతలను తగ్గిస్తాయి.

4. గుమ్మడి పొట్టు:

గుమ్మడి పొట్టులో ఎంజైమ్స్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు, విటమిన్ ఎ,సి ఉంటాయి. చర్మం మీదున్న మృతకణాలు తొలగించి, చర్మ రంధ్రాల్ని ఇవి శుభ్రం చేస్తాయి. దాంతో చర్మం మృదువుగా తయారవుతుంది.

5. టమాటా:

టమాటా ముక్కలు మిగిలిపోతే వాటిని పడేయకండి. వీటిలో లైకోపీన్, విటమిన్ ఏ,సి ఉంటాయి. ఇవి యాక్నె తగ్గిస్తాయి. చర్మం మీదున్న జిడ్డు తగ్గిస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి.

6. బీట్ రూట్ తొక్కలు:

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి ఉంటాయి. రక్త ప్రసరణను ఇవి పెంచుతాయి. చర్మానికి సహజ మెరుపునిస్తాయి. దీనికున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి సాంత్వననిస్తాయి.

7. ముల్లంగి తొక్క:

ఈ తొక్కల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి యాక్నె తగ్గిస్తాయి. చర్మం జిడ్డుగా అవ్వకుండా చూస్తాయి. వీటికున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఈ తొక్కల్ని ఎలా వాడాలి?

మీకున్న అవసరం ప్రకారం ఎలాంటి తొక్కలను వాడాలో పైన చెప్పిన పోషకాలు, ఉపయోగాల ఆధారంగా ఎంచుకోండి. వాటిని వాడటానికి మంచి పద్ధతులు ఇవిగో..

1. ఇన్ఫ్యూజన్:

వేడి నీటిలో మీరు వాడాలనుకున్న తొక్కల్ని వేసి మరిగించాలి. ఈ నీళ్లతో ముఖానికి ఆవిరి పట్టాలి. ఈ నీళ్లు చల్లారాక ముఖం కడుక్కున్నా మంచి ఫలితాలు పొందొచ్చు.

2. ఫేస్ మాస్క్:

కూరగాయల తొక్కల్ని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. దీంట్లో పెరుగు, తేనె, కలబంద జెల్ వేసి ముఖానికి మాస్క్ లాగా పెట్టుకోవచ్చు.

3. నేరుగా రాయడం:

యాక్నె, నల్ల మచ్చలు లాంటి సమస్యలుంటే నేరుగా ఈ తొక్కల్ని లోపలి వైపు నుంచి సమస్య ఉన్నచోట మర్దనా చేయొచ్చు. తర్వాత కడిగేసుకుంటే చాలు.

Whats_app_banner