Holi Special Snack Recipes: ఈ ఒక్క పిండితో ఐదు రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు, వెరైటీలతో అతిథుల ప్లేటు నింపేయచ్చు!-holi special five easy and crispy snack recipes with one dough for your guests ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Special Snack Recipes: ఈ ఒక్క పిండితో ఐదు రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు, వెరైటీలతో అతిథుల ప్లేటు నింపేయచ్చు!

Holi Special Snack Recipes: ఈ ఒక్క పిండితో ఐదు రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు, వెరైటీలతో అతిథుల ప్లేటు నింపేయచ్చు!

Ramya Sri Marka HT Telugu

Holi Special Snack Recipes: హోలీ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు అదిరిపోయే స్నాక్స్ పెట్టాలనుకుంటున్నారా? వెరైటీలతో వారి ప్లేటు నింపేస్తే బాగుంటుందని ఫీలవుతున్నారా? అయితే ఈ సింపుల్, ఈజీ స్నాక్ ఐడియాలు మీ కోసమే. ఈ చిట్కాలతో పిండిని కలిపారంటే ఒకేసారి ఐదు రకాల స్నాక్స్ తయారు చేయచ్చు. ఎలాగో తెలుసుకోండి.

వైరైటీ స్నాక్స్‌తో నోరూరిస్తున్నప్లేట్ (Shutterstock)

సంవత్సరం పొడవునా ఎదురుచూసిన హెలీ పండుగకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగకు స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరతారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి రంగులతో ఆడుకుంటారు. ఇలాంటి సమయంలో ఆనందంతో పాటు, ఆహారం కూడా చాలా ముఖ్యం. హోలీ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు అనేక రకాల వంటకాలను వడ్డించడం కూడా సంప్రదాయంలో భాగమే.

హోలీ స్పెషల్ పిండి వంటల్లో స్నాక్స్ చాలా ప్రధానమైనవి. సాయంత్రం సరదాగా అందరూ కలిసి కూర్చుని చాయ్ లేదా చట్నీలతో వేడి వేడిగా, క్రిస్పీగా, కారంగా ఏదైనా తినాలకుంటారు. ఇలాంటి స్నాక్స్ తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ఈ హోళీకి ఇలాంటి రుచికరమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటే ఈ చిట్కాలతో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రకాల స్నాక్స్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా శ్రమ లేకుండా ఒకే పిండితో వైరైటీ స్నాక్స్ తయారు చేసి ఇంటికి వచ్చిన అతిథులకు ప్లేటు నిండా వడ్డించేయచ్చు. ఎలాగో చూసేయండి.

పిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  • శనగపిండి (ఒక కప్పు, సుమారు 250 గ్రాములు),
  • ఉప్పు (రుచికి తగినట్లు),
  • కొత్తిమీర,
  • ఎర్ర మిర్చి పొడి (అర టీస్పూన్),
  • జీలకర్ర పోడి(అర టీస్పూన్),
  • పసుపు (1/4 టీస్పూన్),
  • ఇంగువ (చిటికెడు),
  • చిల్లీ ఫ్లేక్స్ (అర టీస్పూన్),
  • వాము (అర టీస్పూన్),
  • ఆమ్‌చూర్ పొడి(అర టీస్పూన్)
  • నీరు,
  • నూనె (ఒక టీస్పూన్).
  • అదనంగా ఉల్లిపాయలు,
  • బంగాళాదుంపలు,
  • పాలకూర,
  • పెద్ద మిర్చీ,
  • అరటికాయ వంటి మీకు నచ్చిన కూరగయాలు

పిండిని కలిగే విధానం..

  1. వెరైటీ స్నాక్స్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోండి.
  2. దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, ఎర్ర మిర్చి పొడి, పసుపు, ఇంగువ, చిల్లీ ఫ్లేక్స్‌తో పాటు వామును చేతులతో బాగా నలిపి వేయండి.
  3. ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకూ బాగా కలిపిన తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని గడ్డలు లేకుండా కలపండి. ఇలా కలిపిన పిండిని కాసేపటి వరకూ అలాగే పక్కకు పెట్టండి.
  4. ఈలోగా స్నాక్స్ తయారు చేసుకోవడానికి బంగాళాదుంపలు, టమాటోలు, ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి, అరటికాయ వంటి మీకు నచ్చిన ఆరోగ్యకరమైన కూరగాయలను శుభ్రం చేసుకుని, కట్ చేసుకుని సిద్థం చేసుకోండి. మీరు నాన్‌వెజ్ తినేవారైతే గుడ్డను కూడా ఉడికించుకుని సిద్ధం చేసుకోండి.
  5. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దాంట్లో కారం పొడి, అమచూర్ పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి ఒక మసాలా మిశ్రమాన్ని తయారు చేయండి.
  6. ఈ మసాలాను మీరు కట్ చేసుకుని సిద్ధం చేసుకున్న కూరగాయలకు బయట లోపల బాగా అప్లై చేయండి. వీటి కారణంగా మీరు తయారు చేసుకునే పకోడీలు, బజ్జీలు మరింత రుచికరంగా ఉంటాయి.
  7. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఒక చెంచా వరకూ వేడి నూనె వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పకోడీలు లేదా బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతే ఐదు రకాల వెరైటీలను తయారు చేసేందుకు ఉపయోగపడే పిండి రెడీ అయినట్టే.

ఇప్పుడు ఈ మిశ్రమంతో మీరు బంగాళాదుంప బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, పాలకూర పకోడీలు, మిర్జీ బజ్జీలు, టమాటో బజ్జీ, కొత్తిమీర పకోడీ, అరటికాయ బజ్జీ వంటి రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలను తీసుకుని పిండిలో ముంచి తర్వాత వేడి వేడి నూనెలో వేసి, నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించారంటే వెరైటీలన్నీ మీ ముందుంటాయి.

మీరు ఈ పిండితో పాలకూర పకోడాలు చేస్తున్నట్లయితే పిండిని ఇంకాస్త పలుచగా చేసుకుని పాలకూర ఆకులను దీనిలో ముంచి నూనెలో వేయండి.

ఈ చిట్కాలతో పకోడీలు, బజ్జీలు తయారు చేశారంటే బయట కొన్న వాటిలాగే క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. ఇలా పండుగ రోజున ఈ ఒక్క పిండి సహాయంతో మీకు నచ్చిన కూరగాయలతో మీ పిల్లలు లేదా ఇంటికి వచ్చిన అతిథుల ప్లేట్లను వైరైటీలతో నింపేయచ్చు. వావ్ అనిపించుకోవచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం