High Fiber Diet । పీచు పదార్థాలు ఎక్కువ తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!-high fiber diet health benefits and side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  High Fiber Diet Health Benefits And Side Effects

High Fiber Diet । పీచు పదార్థాలు ఎక్కువ తినండి.. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

HT Telugu Desk HT Telugu
Apr 26, 2023 10:03 AM IST

High Fiber Diet Health Benefits: అధిక పీచు కలిగిన ఆహారం ద్వారా ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ తెలుసుకోండి.

Fiber Diet benefits - side effects
Fiber Diet benefits - side effects (Unsplash)

High Fiber Diet Health Benefits: ఎల్లప్పుడూ మనం తినే ఆహారంలో తగినంత మొత్తంలో పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారం నమిలి, మింగిన తర్వాత కడుపులో జీర్ణప్రక్రియ ప్రారంభం అవుతుంది. మీరు తిన్న ఆహారంలో పీచు లేకపోతే కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఈ కారణంగా మళ్లీ ఆకలి పెరుగుతుంది. చక్కెర కలిగిన ఆహారం తినడం ద్వారా ఆకలి మరింత ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ఆహారంలో పీచు ఉంటే అది చాలా సేపటి వరకు కడుపును నిండుగా ఉంచుతుంది. పీచు జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది, ఇది చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. కాబట్టి ఇది ఆరోగ్యకరమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువును నియంత్రించుకునేవారు, మధుమేహం కలిగిన వారు తమ ఆహారంలో ఎక్కువ మొత్తంలో పీచును కలిగి ఉండటం చాలా ఆరోగ్యకరం.

అధిక పీచు కలిగిన ఆహారం ( Fiber Foods) ద్వారా ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన బరువు

డైటరీ ఫైబర్ (Dietary Fiber) తీసుకోవడం వల్ల అది మీ అధిక బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించడంలో సహాయపడడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు వేగంగా మీ కడుపు నింపుతాయి, మిమ్మల్ని ఎక్కువ సేపు ఆకలి లేకుండా సంతృప్తిగా ఉంచుతాయి. ఊబకాయం, అధిక కొవ్వుతో ఇబ్బందిపడేవారు, తీవ్రమైన ఆకలిని ఎదుర్కొనే వారు పీచు కలిగిన పదార్థాలు తినండి, తేడా మీకే తెలుస్తుంది.

ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది

ఫైబర్ పేగు కదలికలను ప్రోత్సహించడానికి, మలబద్ధకం (Constipation) నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇలాంటి ఆహారం జీర్ణ సమస్యలను, పేగు వ్యాధులను దూరం చేస్తుంది. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మెరుగైన నిద్ర

నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు, తీవ్రమైన జబ్బులకు దారితీస్తుంది. ఏదైనా రోగం త్వరగా నయం కావాలన్నా సరిపడా నిద్ర అవసరం. ఒక అధ్యయనం ప్రకారం సంతృప్త కొవ్వులు, చక్కెర తక్కువగా కలిగి, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినడం ద్వారా నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవచ్చు. పీచు కలిగిన ఆహారాన్ని తినేవారు ప్రశాంతంగా, ఎక్కువసేపు నిద్రించడానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది.

గుండె ఆరోగ్యానికి మేలు

ఫైబర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. గుండెను దృఢంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి పీచు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. ఇది గుండె జబ్బులను నివారించడమే కాకుండా, ఇప్పటికే గుండెపోటు సమస్యను ఎదుర్కొన్నవారిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

హార్వర్డ్ అధ్యయనం ప్రకారం, యుక్తవయస్సు నుంచే జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ, పీచు ఎక్కువ కలిగిన ఆహారాలు తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది.

Fiber Diet Side-Effects

అధిక ఫైబర్ ఆహారాలు మీ ఆరోగ్యానికి మంచివే. ఏదైనా అతిగా తీసుకోకూడదు. సరైన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యకరం. శరీరానికి అన్ని పోషకాలు అవసరం. అలా కాకుండా ఎక్కువగా పీచు పదార్థాలనే తీసుకుంటే, అది ప్రేగులలో గ్యాస్, పొత్తికడుపు ఉబ్బరం కడుపు నొప్పిని కలిస్తుంది. పీచు పదార్థాలు ఒకేసారి ఎక్కువ తినకుండా ప్రతీవారం కొద్ది మొత్తంలో పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది మీ జీర్ణవ్యవస్థలోని సహజ బాక్టీరియా మార్పుకు సర్దుబాటు చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం