గర్భం ధరించాక హైబీపీ రావడం చాలా ప్రమాదం, రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని తినండి-high blood pressure is very dangerous after pregnancy eat these foods to prevent high blood pressure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  గర్భం ధరించాక హైబీపీ రావడం చాలా ప్రమాదం, రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని తినండి

గర్భం ధరించాక హైబీపీ రావడం చాలా ప్రమాదం, రక్తపోటు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్ని తినండి

HT Telugu Desk HT Telugu

గర్భం ధరించాక అధిక రక్తపోటు వస్తే తల్లికీ బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే. హైబీపీని రాకుండా ఎలా నియంత్రించాలో వైద్యులు లతా శశి వివరించారు. ఈమె ఫెర్నాన్డేజ్ హాస్పిటల్లో చీఫ్ న్యూట్రిషినిస్ట్ గా పని చేస్తున్నారు.

ప్రెగ్నెన్సీ డైట్ (Pixabay)

గర్భం ధరించడమే ఒక వరం. కానీ గర్భధారణ సమయంలో వచ్చే కొన్ని అనారోగ్యాలు తల్లీబిడ్డకు ఇద్దరికీ హాని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది అధిక రక్తపోటు. గర్భధారణ సమయంలో హైబీపీ వస్తే అది ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. అందుకే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

గర్భధారణ సమయంలో వచ్చే రక్తపోటును జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. లేదా క్రానిక్ హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. గర్భిణీకి రక్తపోటు వస్తే వారిలో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, అనుకున్న సమయానికంటే ముందే ప్రసవం కావడం, ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

డాష్ డైట్‌తో ఆరోగ్యం

గర్భం ధరించక ముందే హైబీపీ రాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలి. గర్భం ధరించాక కూడా సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమన జీవన శైలిని పాటిస్తూ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. డాష్ డైట్ అనేది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని ఇప్పటికి ఎన్నో పరిశోధనలు తేలింది. డాష్ డైట్ అంటే ‘డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్’ అని అర్థం. ఈ డాష్ డైట్లో భాగంగా ఎలాంటి ఆహారాలను తినడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకోండి.

తినాల్సిన కూరగాయలు

బీట్రూట్, పాలకూర, లెట్యూస్, టర్నిప్స్, క్యాబేజీ, బీన్స్, ముల్లంగి వంటి వాటిలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఏదో ఒక కూరగాయను మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.

ఇక జింక్ కోసం చికెన్, నట్స్, బీన్స్, సీఫుడ్, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తినండి. కాల్షియం కోసం పాలు, పెరుగు, చీజ్, వెన్న, రాగులు, చేపలు, ఆకుకూరలు, పనీర్ వంటివి భాగం చేసుకోండి. మెగ్నీషియం కూడా మనకు ఎంతో అవసరం. కాబట్టి ఆకుపచ్చని కూరగాయలు, చిక్కుళ్ళు, నట్స్, తృణధాన్యాలు వంటివి మెగ్నీషియం కోసం తినడం ప్రారంభించండి. ఇక విటమిన్ డి అనేది మన మానసిక శారీరక ఆరోగ్యానికి అత్యవసరమైనది. దీనికోసం కొవ్వు పట్టిన చేపలు, గుడ్డులోని పచ్చసొన, ఫోర్టిఫైడ్ ఆహారాలు తినాలి.

పండ్లు కూరగాయలు తింటే

మనకు ప్రకృతి ప్రసాదించిన వరం పండ్లు, కూరగాయలు. కాబట్టి వీటిలో ఆరోగ్యకరమైనవి ఎంపిక చేసుకొని గర్భం ధరించినప్పుడు తినడం అవసరం. ముఖ్యంగా బీట్రూట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనికి కారణం ఇందులో అధిక నైట్రేట్లు ఉండటమే. నైట్రేట్లు రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే పాలకూర, అరటి పండ్లు, స్ట్రాబెర్రీ, కాలే వంటి ఆహారాలు కూడా నైట్రేట్లతో నిండి ఉంటాయి.

వీటిలో కొన్నింటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొంతమంది సప్లిమెంట్ల ద్వారా పొటాషియాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు సప్లిమెంట్ల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

రోజూ కనీసం మీ భోజనంలో ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినేందుకు ప్రయత్నించండి. ఈ ఐదు రకాల పండ్లు, కూరగాయల నుండి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. పండ్లు రసం తీసుకుని తాగే బదులు పండ్లను తినేందుకు ప్రయత్నిస్తే మంచిది.

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, గోధుమలు, చిరుధాన్యాలు, క్వినోవా, ఓట్స్ వంటివన్నీ తృణధాన్యాల జాబితాలోకి వస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తపోటును చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి గర్భం ధరించిన స్త్రీలు తృణధాన్యాలను భోజనంలో భాగం చేసుకోవాలి. ఇంకా ఫైబర్ కావాల్సి వస్తే బీన్స్, నట్స్, విత్తనాలు వంటి తినడం మంచిది.

లీన్ ప్రోటీన్స్

లీన్ ప్రోటీన్స్ కూడా గర్భిణీలకు అత్యవసరమైనవి. దీనికోసం చికెన్, చేపలు, గుడ్లు వంటి వాటిపై ఆధారపడాలి. వీటిలో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. తక్కువ తిన్నా చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం మానేయడమే మంచిది.

కొవ్వు తీసిన పాల ఉత్పత్తులు

తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. శరీరానికి కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి సెమీ స్కిమ్డ్ పాలు లేదా తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన కొవ్వులు

వేరుశనగ, మొక్కజొన్న, ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కుసుమ నూనెలు వంటి వాటిలో అసంతృప్త కొవ్వులను కలిపి తయారుచేస్తారు. కాబట్టి వీటిని వాడడమే మంచిది. బటర్, కొబ్బరినూనె వంటి వాటిని వాడడం చాలా వరకు తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.

అన్నిటికంటే ముఖ్యమైనది సరిపడినంత నీరు తాగడం. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తప్పకుండా తాగండి. చక్కెర నిండిన పదార్థాలను తాగవద్దు. పంచదార వాడకాన్ని పూర్తిగా మానేస్తేనే మంచిది. అలాగే కెఫిన్ ఉండే వాటిని కూడా తగ్గించాలి. మీకు కాఫీ తాగాల్సి వస్తే రోజుకు ఒక కప్పు కాఫీ కంటే అధికంగా తాగకపోవడం ఉత్తమం.

రక్తపోటు పెరగకుండా ఇలా

రక్తపోటును అదుపులో ఉంచాలంటే ఆహారం విషయంలో జాగ్రత్త పడితే సరిపోదు... మీ జీవనశైలిని కూడా మార్చుకోవాలి. గర్భం ధరించాక ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ లను చేయించుకోండి. అలాగే శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి. నడవడం, చిన్నచిన్న యోగాసనాలు వేయడం వంటివి చేయవచ్చు.

గర్భం రాకముందే మీ బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, శ్వాస వ్యాయామాలు, సరిపడా నిద్ర వంటి వాటిపై దృష్టి పెట్టండి. ధూమపానం, మద్యపానం వంటివి పూర్తిగా మానేస్తేనే మంచిది. మీరు నేరుగా ధూమపానం చేయకపోవచ్చు. కానీ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఎవరైనా ధూమపానం చేస్తున్నప్పుడు ఆ పొగను మీరు పీల్చినా కూడా ప్రమాదమే. కాబట్టి అలాంటి వాటిని దూరంగా ఉండండి.

- డాక్టర్ లతా శశి

చీఫ్ న్యూట్రిషనిస్ట్ & హెడ్

క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం,

ఫెర్నాండెజ్ హాస్పిటల్

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.