Sankranti Sweet: సంక్రాంతికి స్పెషల్ కొబ్బరి పాకుండలు, ఈ స్వీట్ రెసిపీ ఇదిగో-heres a sweet recipe for sankranti special coconut pakundalu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranti Sweet: సంక్రాంతికి స్పెషల్ కొబ్బరి పాకుండలు, ఈ స్వీట్ రెసిపీ ఇదిగో

Sankranti Sweet: సంక్రాంతికి స్పెషల్ కొబ్బరి పాకుండలు, ఈ స్వీట్ రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Jan 13, 2025 05:30 PM IST

బెల్లంతో పాకుండలే కాదు ఒకసారి స్పెషల్‌గా కొబ్బరి పాకుండలు చేసి చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు.

కొబ్బరి పాకుండలు రెసిపీ
కొబ్బరి పాకుండలు రెసిపీ

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పాకుండలు అధికంగా చేస్తారు .సాధారణ పాకుండలు కన్నా కొబ్బరి పాకుండలు చేస్తే అద్భుతంగా ఉంటాయి. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ కొబ్బరి పాకుండలను వండుతారు. ఇవి ఎవరికైనా నచ్చుతాయి. ఈ కొబ్బరి పాకుండలు సులువుగా ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

yearly horoscope entry point

కొబ్బరి పాకుండలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యం - 350 గ్రాములు

బెల్లం - 150 గ్రాములు

నెయ్యి - మూడు స్పూన్లు

కొబ్బరి ముక్కలు - పావు కప్పు

నువ్వులు - రెండు స్పూన్లు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కొబ్బరి పాకుండలు రెసిపీ

1. కొబ్బరి పాకుండలు చేయడానికి బియ్యాన్ని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి.

2. ఉదయం లేచాక ఆ బియ్యాన్ని వడకట్టి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.

3. ఆ పొడిని జల్లించి ఒక ప్లేట్లో వేసి పైన మూత పెట్టాలి. పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం, నీళ్లు వేసి పాకం తీయాలి.

5. ఆ పాకం తీశాక అందులోనే ఒక స్పూను నెయ్యిని కూడా వేసి బాగా కలపాలి.

6. ఇప్పుడు ఆ బెల్లం పాకంలో ముందుగా పొడిచేసి పెట్టుకున్న బియ్యప్పిండిని వేసి చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి.

7. మరోపక్క చిన్న కళాయి పెట్టి అందులో ఒక స్పూను నెయ్యిని వేసి కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి.

8. వాటిని తీసి మిక్సీలో వేసి మెత్తగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.

9. ఈ కొబ్బరి తురుమును కూడా బెల్లం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇది గట్టిగా దగ్గరగా అయ్యేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

11. ఇప్పుడు ఇది కాస్త చల్లారాక దీన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి.

12. ఇప్పుడు ఒక ప్లేట్ లో నువ్వులను చల్లి ఈ లడ్డూలను రోల్ చేయాలి.

13. ఇప్పుడు ఈ ఉండలకు నువ్వులు అతుక్కుంటాయి.

14. స్టవ్ మీద నూనె కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి ఆ నూనె వేడెక్కాక లడ్డూలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

15. మీడియం మంట మీద వేయిస్తే లోపల ఉన్న పదార్థాలు కూడా బాగా ఉడుకుతాయి.

16. హై ఫ్లేమ్ మీద వేయిస్తే బయట ఉన్న తొక్క త్వరగా వేగిపోతుంది.

17. కాబట్టి ఇలా మీడియం మంట మీద అన్ని కొబ్బరి పాకుండలను వేయించుకోవాలి.

18. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని గాలి చొరబడని కంటైనర్ లో వేసుకుంటే రెండు మూడు వారాలు పాటు తాజాగా ఉంటాయి.

19. అంతే టేస్టీ కొబ్బరి పాకుండలు సిద్ధమైనట్టే. ఒకసారి తిన్నారంటే ఇవి నోరూరించేలా ఉంటాయి. ఈ సంక్రాంతికి ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఎప్పుడూ ఒకేలాంటి స్వీట్లను చేసే బదులు అప్పుడప్పుడు ఇలా స్పెషల్ వంటకాలు చేస్తే కొత్తగా ఉంటుంది. కొబ్బరి పాకుండల్లో బెల్లం, బియ్యం, కొబ్బరి ముఖ్యంగా వేసాము. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిదే. సాధారణ పాకుండలతో పోలిస్తే కొబ్బరి పాకుండలు కొత్త రుచిని అందిస్తాయి. ఒకసారి మీరు వీటిని తిని చూడండి. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వీటినే వండుతారు.

Whats_app_banner