Independence Day 2024 Speech: 78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇలా ప్రసంగిస్తే ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే
Independence Day 2024 Speech In Telugu: స్వాతంత్య్ర దినోత్సవం వస్తే స్కూల్లో, కాలేజీలో వేడుకగా ఉంటుంది. చాలా చోట్ల జెండా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. ఆ రోజున మీరు ఇండిపెండెన్స్ డే గొప్పతనాన్ని ఇలా ప్రసంగించి చూడండి. మీకు ప్రశంసలు రావడం ఖాయం.
Independence Day 2024 Speech In Telugu: స్వాతంత్య్ర దినోత్సవం అనేది మనల్ని, మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనక ఎంతోమంది ప్రాణదానం ఉంది. మన స్వాతంత్య్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు. ఏ దేశమూ స్వాతంత్య్రాన్ని పొందేందుకు మన భరతమాత పడినంత వేదనను పడలేదు. ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు. ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారీ ఆ త్యాగధనులను అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. కాలేజీ స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రసంగించాల్సి రావచ్చు. చాలామంది ఏం ప్రసంగించాలో తెలియక భయపడుతూ ఉంటారు. ఇక్కడ మేము కొన్ని ఇండిపెండెన్స్ డే స్పీచ్‌ను అందించాము. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని జెండా పండుగలో మాట్లాడేందుకు సిద్ధం అవ్వండి.
1. స్కూల్లో ప్రసంగించేందుకు ఇండిపెండెన్స్ డే స్పీచ్
గౌరవనీయులైన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, నా ప్రియమైన మిత్రులకు వందనం. ఈరోజు మన దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్లు నేటితో పూర్తవుతోంది. ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనం ఓసారి స్మరించుకోవాలి. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలి. మన దేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించారు. వారి వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు. కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు. సంపదను, ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశంలో స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారీ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి. మనందరం కులం, మతం, భాష, ప్రాంతాలవారీగా కాకుండా భారత పౌరులుగా గుర్తింపును పొందాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలషిద్దాం.
2. ఇండిపెండెన్స్ డే స్పీచ్
గౌరవనీయులైన అతిథులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు నా నమస్కారాలు. మన దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఆగస్టు 15, 1947లో మన భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ క్షణం ఇప్పటికీ మనకెంతో గర్వకారణం. ఈ మహత్తర సందర్భమే భారత దేశంలో బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిందని చెప్పే ఒక సంకేతంగా మారింది. బ్రిటిష్ వారు వాణిజ్య ప్రయోజనాల కోసం మన దేశానికి అడుగు పెట్టారు. మన దేశాన్ని వారు అప్పట్లో ‘సోనీ కి చిడియా’ అని పిలిచేవారు. అంటే బంగారు బాతు అని అర్థం. కానీ వారు ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, తాము పాలన ప్రారంభించారు. మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ దేశస్థులను దేశం నుంచి వెళ్లగొట్టి బ్రిటిష్ వారు ఇక్కడ తమ పాలనను సాగించారు. కానీ వారి వివక్షపూరిత విధానాల వల్ల 1857లోనే తిరుగుబాటు మొదలయ్యింది. అప్పటినుంచి స్వాతంత్ర్య ఉద్యమం కోసం భారతీయులు పోరాడుతూనే ఉన్నారు. వందేళ్లపాటు పోరాడిన తర్వాతే మనకు స్వాతంత్ర్యం లభించింది. ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గంగాధర్ తిలక్, లాలాజపతిరాయ్, గోపాలకృష్ణ గోఖలే, రాణీ లక్ష్మీబాయి, మంగళ్ పాండే ఇలా ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు సమిధులుగా మారారు. అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి కొత్త జీవితం వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు. వారిని మనదేశం నుండి తరిమికొట్టడంలో కష్టపడిన వీరులందరినీ మనం స్మరించుకోవాలి. మన స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన వారందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనమందరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. మన దేశం పట్ల గొప్ప బాధ్యతలను నెరవేర్చాలి. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్.
3. ఇండిపెండెన్స్ డే స్పీచ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ జెండా వేడుకకు హాజరైన వారందరికీ నా నమస్సులు. మన దేశం గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను. భారత స్వాతంత్ర్య ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగింది. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా సరే వారు వెనక్కి తగ్గలేదు. పరాయి పాలన నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారు. త్యాగాలు చేశారు. మన స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతోమంది ధైర్యవంతుల కారణంగానే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉన్నాము. భగత్ సింగ్, రాణీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వీరులు తమ జీవితాలను మన దేశ స్వాతంత్ర్య కోసం అంకితం చేశారు. వారి సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుంది. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నాము. మన ఐక్యతే మన బలం. సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందాం. మహాత్మా గాంధీ మనకు అహింసా, సత్యానికి ఉన్న శక్తిని బోధించారు. కాబట్టి అహింసా, సత్యాన్ని వీడకుండా ఉంటామని, న్యాయంగా పనిచేస్తామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. అలాగే శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది. స్వాతంత్ర్య పొందినప్పటి నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతిని సాధిస్తుంది. ఉపగ్రహాలను ప్రయోగించడం దగ్గర నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు మన దేశం ప్రపంచ వేదికపై గుర్తింపును సాధిస్తూనే ఉంది. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. యువ పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం మన బాధ్యత. భారతదేశాన్ని బలంగా, స్వతంత్రంగా ఉంచడానికి మన వంతు సాయాన్ని చేద్దాం. మన దేశ సంస్కృతి విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం.