Sleeping bag: పిల్లల కోసం స్లీపింగ్ బ్యాగ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెల్సుకోండి
Sleeping bag: చిన్న పిల్లల కోసం స్లీపింగ్ బ్యాగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఎలాంటి స్లీపింగ్ బ్యాగ్ కొనాలి? దాని లాభాలేంటో తెల్సుకుందాం.
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి నాలుగైదు నెలల వరకు పిల్లలకు స్లీపింగ్ బ్యాగ్ వాడటం మామూలు అయ్యింది. ప్రతి పేరెంట్ పిల్లల కోసం దీన్ని వాడుతున్నారు. అయితే ఈ బ్యాగ్ వాడటం మంచిదేనా కాదా అనే సందేహం ఉంటుంది. అలాగే ఎలాంటి స్లీపింగ్ బ్యాగ్ వాడితే మంచిదో కూడా తెల్సుకోండి.
స్లీపింగ్ బ్యాగ్ ఎందుకు?
చిన్న పిల్లలను ఈ స్లీపింగ్ బ్యాగ్ లో పడుకోబెట్టడం వల్ల వెచ్చగా, సౌకర్యంగా ఉంటుంది. అలాగే ప్రయాణ సమయంలో పిల్లలను ఇందులో ఉంచి సులభంగా పట్టుకోవచ్చు. పిల్లలను ఎత్తుకోవడానికి మొదట్లో కాస్త భయం ఉంటే ఈ బ్యాగ్ చాలా ఉపయోగపడుతుంది.
ఎలాంటి స్లీపింగ్ బ్యాగ్ ఎంచుకోవాలి?
మంచి నాణ్యత ఉన్న స్లీపింగ్ బ్యాగ్ ఎంచుకోవడం ముఖ్యం. ఒక్కసారి ఖర్చు పెడితే చాలా రోజులు ఉపయోగపడుతుంది కాబట్టి నాణ్యత మాత్రమే దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయండి.
కాటన్, మజ్లిన్ వస్త్రాలతో చేసిన స్లీపింగ్ బ్యాగ్ మాత్రమే వాడండి. కొన్ని ఇకో ఫ్రెండ్‌లీ రకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అవి మరింత సౌకర్యంగా, పిల్లల చర్మానికి మృదువుగా ఉండి, మరింత సౌకర్యాన్నిస్తాయి. అయితే లేత రంగులు తొందరగా మాసిపోయినట్లు కనిపిస్తాయి కాబట్టి.. నీలం, ముదురు ఆకుపచ్చ లాంటి రంగులవి మేలు. తెలుపు, పసుపు లాంటి రంగులు తొందరగా పాతబడిపోయినట్లు కనిపిస్తాయి.
స్లీపింగ్ బ్యాగులో ముఖ్యంగా రెండు రకాలుంటాయి. ఒకటి బెడ్ లాగా, క్యారియర్ లాగా వాడేది. మరో రకం వియరేబుల్ స్లీపింగ్ బ్యాగ్ (wearable sleeping bag). మొదటిది బెడ్ లాగా, ప్రయాణ సమయాల్లో క్యారియర్ లాగా వాడొచ్చు. ఈ బ్యాగ్ లోపల పిల్లలను పడుకోబెట్టాలి.
మరో రకం స్లీపింగ్ పేరుకు తగ్గట్లుగా పిల్లలకు డ్రెస్ లాగా వేసేయడమే. వయసు బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బ్యాగ్ వేసేశాక డైపర్ మార్చుకోడానికి వీలుగా కింది వైపు జిప్ ఉంటుంది. కాబట్టి మొత్తం తీసేయాల్సిన పనిలేదు. పిల్లల నిద్రకు అంతరాయం ఉండదు. ఈ రకం చాలా మట్టుకు వేసవిలో కూడా వేసేట్లు అవసరమైన వెచ్చదనాన్నిస్తాయి. పిల్లలకు వేడి వల్ల కూడా ఏ ఇబ్బందీ ఉండదు.
స్లీపింగ్ బ్యాగ్ లాభాలు:
పిల్లలను వెచ్చగా ఉంచడానికి దుప్పట్లు కప్పాల్సిందే. కానీ పిల్లలు వాటిని ఉంచుకోరు. బదులుగా ఈ స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోబెట్టి జిప్ పెట్టేయడం వల్ల వెచ్చగా ఉంటుంది. పిల్లలు ఊరికే కాళ్లతో దుప్పటి తన్నేసి కిందా మీద చేసుకుంటారనే బాధ ఉండదు.
ఉయ్యాలలో లేదా క్రిబ్‌లో పడుకోబెట్టేటప్పుడు ఈ స్లీపింగ్ బ్యాగ్ వాడితే పిల్లలను బెడ్ మీదకు తీసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. నిద్రలో నుంచి వెంటనే మేల్కోరు.
పిల్లలను పడుకోపెట్టడానికి రోజూవారీ దుప్పట్లు, కింద పరుపు లాంటివి వాడితే వాటిని శుభ్రంగా ఉంచడం, శుభ్రం చేయడం కష్టమే. ఈ స్లీపింగ్ బ్యాగ్ సులభంగా ఉతికేయొచ్చు. తొందరగా ఆరిపోతాయి. శుభ్రంగా ఉంటాయి కూడా.
ఏసీ వేసినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ బ్యాగ్‌కు ఉన్న జిప్ వేసేయొచ్చు. ఇది పిల్లలకు హత్తుకుని ఉన్నట్లు ఉండటం వల్ల వెచ్చగా ఉంటుంది. కాస్త వేడి వాతావరణం ఉన్నప్పుడు జిప్ తీసేసి బెడ్ లాగా వాడుకోవచ్చు.