Pappula Punugulu: పిండితోనే కాదు పప్పులతో కూడా పునుగులు తయారు చేసుకోవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!-here is a very easy recipe to make pappula punugulu with three types of lentils ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pappula Punugulu: పిండితోనే కాదు పప్పులతో కూడా పునుగులు తయారు చేసుకోవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Pappula Punugulu: పిండితోనే కాదు పప్పులతో కూడా పునుగులు తయారు చేసుకోవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Pappula Punugulu: మీకు ఇష్టమైన పునుగులను గోధుమపిండి, మైదా పిండితో మాత్రమే కాదు ప్రొటీన్లతో కూడిన పప్పులతో కూడా తయారు చేసుకోవచ్చు.ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మూడు పప్పులతో సింపుల్ గా పునుగులను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకో

మూడు రకాల పప్పులతో తయారు చేసిన పునుగులు

పునుగులు అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ క్రిస్పీగా నోరూరించే పునుగలను మీరు ఇప్పటిదాకా గోధుమపిండి, మైదా పిండి, ఇడ్లీ పిండితో వేసుకొని ఉంటారు. ఈసారి కొత్తగా పప్పులతో పునుగులను ట్రై చేసి చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పప్పులలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తినడం ఆరోగ్యకరం కూడా. ఇంతకీ వీటిని ఏయే పప్పులతో తయారు చేయాలి, ఎలా చేయాలి? సింపుల్ రెసిపీ ఇక్కడుంది తెలుసుకుందాం రండి.

పప్పులతో పునుగులు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:

  • మినపపప్పు- ఒక కప్పు
  • శనగపప్పు - అర కప్పు
  • పెసరు పప్పు- పావు కప్పు
  • ఉప్పు - రుచికి తగినంత
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • అల్లం - ఒక ఇంచు
  • పచ్చిమిర్చీ - రెండు లేదా మూడు
  • ఉల్లిపాయ- ఒకటి
  • డీప్ ఫ్రైకి సరిపడా నూనె

పప్పుల పునుగులు తయారు చేయడం ఎలా?

  1. పప్పుల పునుగులు తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మినప పప్పు, శనగపప్పు, పెసరు పప్పు వేయండి.
  2. ఇప్పుడు దీంట్లో నీరు పోసి దాదాపు రెండు గంటల వరకూ పప్పులను నాననివ్వండి. (పప్పులన్నీ ఎక్కువ సేపు నానాడం వల్ల వీటిలోని పోషకాలు పెరగడంతో పాటు గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి).
  3. రెండు గంటల పాటు నానబెట్టిన పప్పులను తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్‌లా అయ్యేంత వరకూ గ్రైండ్ చేయండి.
  4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో పప్పుల మిశ్రమాన్ని వేయండి.
  5. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చీ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి.
  6. అన్నీ చక్కగా కలసిపోయాక కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవడానికి తగినట్లుగా తయారు చేయండి.
  7. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
  8. నూనె బాగా వేడెక్కిన తర్వాత పిండిని తీసుకుని నూనెలో చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి.
  9. మీడియం ఫ్లేములోనే ఈ పునుగులను రెండు వైపులా తిప్పకుంటూ రంగు మారేంత వరకూ వేయించండి.
  10. పునుగులు రంగు మారి క్రిస్పీగా తయారు కాగానే కడాయిలో నుంచి తీసి టిష్యూ పేపర్ మీద వేయండి.
  11. అంతే ప్రొటీన్లతో నిండిని కరకరలాడే పప్పుల పునుగులు తయారైనట్టే. వీటిని పల్లీ చట్నీ, లేదా టమాటా చట్నీతో తినచ్చు. అల్లం చట్నీ కూడా వీటికి అదిరిపోయే రుచిని అందిస్తుంది.

వీటిని మీరు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా తినచ్చు, సాయంత్రం స్నాక్స్ గా కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు తిన్నా మితంగా తింటే ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాక చిరుతిళ్లు తినాలనే మీకు కోరికను తీరుస్తాయి. ముఖ్యంగా పిల్లలైతే వీటిని రుచి చూశాక వారానికి మూడు సార్లు ఇవే కావాలని అడుగుతారు. ఇంకెందుకు లేటు పప్పుల పునుగుల రెసిపీ నచ్చింది కదా.. ఈ రోజే ఇంట్లో వాళ్లకి చేసి పెట్టేయండి మరీ.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం