విజయవంతమైన వ్యక్తులను చూసి ఎంతోమంది తాము వారిలా కాలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళని చూసి అదృష్టవంతులు అని చెబుతూ ఉంటారు. తమకు అదృష్టం లేకపోవడం వల్లే ధనవంతులు కాలేకపోయామని బాధపడుతూ ఉంటారు. అదృష్టం అనేది హఠాత్తుగా ఎవరో వచ్చి ఇచ్చేది కాదు. మన ప్రవర్తన, మన పనుల ద్వారా మనమే సొంత అదృష్టాన్ని సృష్టించుకోవాలి. విజయవంతమైన వ్యక్తులు ఎలాంటి పనులు చేయడం ద్వారా తమను తాము అదృష్టవంతులుగా మార్చుకుంటారో తెలుసుకోండి.
విజయవంతమైన వ్యక్తులను ఓ గంట పాటు గమనించండి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు... ఎక్కువగా వింటారు. వీరిని అద్భుతమైన శ్రోతలుగా చెప్పుకోవచ్చు. సమావేశంలో వారు ప్రసంగించే సమయం తక్కువే ఉంటుంది. కానీ ఆ తక్కువ సమయంలోనే ఎంతో లోతైన విషయాలను వివరిస్తారు. ఒక సహోద్యోగితో కాఫీ తాగుతున్న కూడా వారు శ్రద్ధగా వినేందుకే ఇష్టపడతారు. ఏదో ఒకటి మాట్లాడేందుకు ఇష్టపడరు. ఆ లక్షణం మీకు కూడా ఉండాలి.
ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనక ఎన్నో పుస్తకాలు, ప్రసంగాలు, సంభాషణలు ఉండే ఉంటాయి. వారు ఆ స్థితికి చేరుకోవడానికి ముందు అవన్నీ ఉపయోగపడి ఉంటాయి. గొప్ప విషయాలను సాధించాలనుకునే వ్యక్తులు ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటారు. అవసరమైన పుస్తకాలను చదువుతారు. పెద్దవారి మాటలను వింటారు. ఉపయోగకరమైన సంభాషణలను చేస్తారు. అనవసరమైన విషయాలు గురించి మాట్లాడరు.
మీ చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మీ జీవితాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి మీ చుట్టూ పనిమంతులు, ఆలోచనా శక్తి కలవారు, చెడు అలవాట్లు లేని వారు ఉండేలా చూసుకోండి. అలాంటి వారే మిమ్మల్ని విజయవంతంగా మార్చేందుకు ఎంతో కొంత సహాయపడతారు. చెడు అలవాట్లు ఉన్నవారు, లక్ష్యం లేని వారితో మీరు జీవించడం వల్ల మీ జీవితం కూడా ఎలాంటి సక్సెస్ లేకుండా ముగిసిపోతుంది.
ఒంటరి జీవితం అన్నివేళలా విజయాన్ని ఇవ్వదు. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు ఎప్పుడూ తమ చుట్టూ నలుగురు వ్యక్తులు ఉండేలా చూసుకుంటారు. వారితో కమ్యూనికేట్ చేస్తారు. మీకంటూ ఒక నెట్వర్క్ ఎంతో అవసరం. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొత్త వ్యక్తులను కలవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. వారితో మంచి సంభాషణలు చేయాలి.
అవకాశాలు ఎప్పుడూ మన ముందుకు రావు మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. రిస్క్ చేయడం వల్లే ఎంతో మంది ఇప్పుడు విజయవంతమైన వ్యక్తులుగా మారారు. మాకెందుకు ఈ కష్టం అనుకొని ఉంటే ఎవరూ సంస్థలను స్థాపించేవారు కాదు.. కేవలం ఉద్యోగులుగానే మిగిలిపోయేవారు. కాబట్టి అవసరమైనప్పుడు రిస్క్ చేయాల్సి వస్తే ధైర్యంగా ముందుకు వెళ్ళండి.