Mixer Grinder: మిక్సీలో గ్రైండ్ చేయకూడని పదార్థాలు ఇవిగో, వీటిని వేస్తే కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం
Mixer Grinder: ఇంట్లో పొడులు, పచ్చళ్లు చేసేందుకు మిక్సీని అధికంగా వాడుతూ ఉంటారు. ప్రతి వంటగదిలో మిక్సీ కచ్చితంగా ఉంటోంది. అయితే మిక్సీలో కొన్ని వస్తువులను గ్రైండ్ చేయకుండా ఉండాలి. అవి మీ ఖరీదైన మిక్సీని పాడుచేసే అవకాశం ఉంది.
ప్రతి ఇంట్లో మిక్సీలో వాడకం ఎక్కువైపోయింది. నచ్చినప్పుడు పచ్చళ్లు చేసుకోవడం, పొడులు చేసుకునేందుకు దీన్ని అధికంగా వాడుతూ ఉంటారు. మసాలా దినుసులను గ్రైండ్ చేసేందుకు మిక్సీని నిత్యం ఉపయోగిస్తారు. మిక్సర్ చాలా ఖరీదైనది. కాబట్టి దీన్ని ఎంతో జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి మిక్సర్లో వేసి గ్రైండ్ చేయకూడదు. కాబట్టి మిక్సర్ లో గ్రైండ్ చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం.
మసాలా దినుసులు మొదలైన వాటిని గ్రైండ్ చేయడానికి మిక్సర్ గ్రైండర్ ను దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. కొంతమంది ఇంట్లో మసాలా దినుసులను గ్రైండ్ చేసి నెలంతా వాడుతుంటారు. అయితే ఈ మసాలా దినుసుల పొడి చేస్తున్నప్పుడు మిక్సీలో జాజికాయ, దాల్చిన చెక్క వంటి వేయకపోవడమే మంచిది. ఇవి జార్ బ్లేడ్ విరిగిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి దాల్చిన చెక్క, జాజికాయను బయటే కొంతవరకు దంచి అప్పుడు మిక్సీలో వేయాలి.
కోల్డ్ కాఫీ
కోల్డ్ కాఫీ, లస్సీ లేదా మిల్క్ షేక్ చేసేందుకు కూడా మిక్సీని వాడుతూ ఉంటారు. వీటన్నింటి తయారీకి ఐస్ క్యూబ్స్ ను కూడా మిక్సీలో వేస్తారు. పెద్ద ఐస్ క్యూబ్స్ మిక్సర్ జార్లలో గ్రైండ్ చేయడం మంచిది కాదు. ఇది జార్ బ్లేడ్లను కూడా విచ్ఛిన్నం చేయగలవు. కాబట్టి చిన్న చిన్న ఐస్ ముక్కలు చేసిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయడానికి జార్ లో వేయాలి.
వేడి వస్తువులను
వేడి వస్తువులను మిక్సీలో వేయడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వేడివేడి ద్రావణాన్ని కలిపి మిక్సర్ ను పొరపాటున కూడా వేయకూడదు. వాస్తవానికి, మీరు వేడి వస్తువులను జోడించి మిక్సీని వాడితే ఆవిరి కారణంగా జార్ లో ఒత్తిడి పెరుగుతుంది. ఇది జార్ లేదా దాని మూత పగిలిపోవడానికి కూడా కారణం కావచ్చు.
అల్లం, వెల్లుల్లిని మిక్సీలో చేసి గ్రైండ్ చేసుకుంటే మిక్సర్ కు ఎలాంటి హాని జరగదు. అయితే వీటిని తక్కువ మొత్తం మిక్సీలో వేసి రుబ్బేందుకు ప్రయత్నించవద్దు. అల్లం, వెల్లుల్లి ముక్కలు జార్ బ్లేడ్ల మధ్య ఇరుక్కుపోతాయి. వాటిని శుభ్రం చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. సరిగ్గా శుభ్రం చేయకపోతే, జార్ వింత వాసన రావడం ప్రారంభిస్తుంది.
ఇంట్లోనే కాపీ పొడిని తయారు చేసుకుంటూ ఉంటారు. ఇందుకోసం కాఫీ గింజలను గ్రైండ్ చేసి పొడి తయారు చేస్తారు. దీని కోసం మిక్సీని ఉపయోగిస్తారు. కాఫీ గింజలను మిక్సీ గ్రైండర్ లో వేసి పొడి చేయడం మంచి పద్ధతి కాదు. దాని ముక్కలు జార్ బ్లేడ్ లో ఇరుక్కుపోతాయి, దీని వల్ల బ్లేడ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.