Womens Day 2025: మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో, వీటి నుంచి ఎలా రక్షణ పొందాలంటే-here are the dangerous diseases that only affect women and how to protect yourself from them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Womens Day 2025: మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో, వీటి నుంచి ఎలా రక్షణ పొందాలంటే

Womens Day 2025: మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో, వీటి నుంచి ఎలా రక్షణ పొందాలంటే

Haritha Chappa HT Telugu

Womens Day 2025: వ్యాధులకు స్త్రీ, పురుషుల మధ్య తేడా లేకపోవచ్చు. కానీ కొన్ని వ్యాధులు మాత్రం మహిళలకు మాత్రమే వస్తాయి. అవి స్త్రీలలోనే ప్రమాదకరంగా మారుతాయి. అవేంటో తెలుసుకోండి.

మహిళల్లో వచ్చే వ్యాధులు (Pixabay)

మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి బహిరంగంగా చర్చించాలి. వారి శారీరక, మానసిక సమస్యలను అందరిలో మాట్లాడితేనే వాటికి తగిన పరిష్కారాలు అందుతాయి. శారీరకంగా చూసుకుంటే స్త్రీలు పురుషుల కంటే బలహీనంగా ఉంటారు. అందుకే ఆమెకు తరచూ వ్యాధులు చుట్టూ ముడుతూ ఉంటాయి.

మహిళల రోగనిరోధక శక్తి కూడా మగవారితో పోలిస్తే బలహీనంగా ఉంటుంది. అందుకే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ బిజీ జీవితం, మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలు త్వరగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు.

ఉద్యోగంలో ఇంట్లో బాధ్యతల కారణంగా స్త్రీలు తమపై తాము ఎక్కువ శ్రద్ధ పెట్టుకోలేరు. దీనివల్లే ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇక్కడ ఉన్నాయి. ఇవి తరచూ స్త్రీలనే ఇబ్బంది పెడతాయి. వీటినుంచి బయట పడడం ఎలాగో తెలుసుకోండి.

రొమ్ము క్యాన్సర్

స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణంగా వస్తున్న వ్యాధిగా మారిపోతోంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి నాలుగో నిమిషానికి ఒక మహిళ ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అంచనా. అలాగే ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నట్టు అంచనా. రొమ్ము క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలంటే క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. మామోగ్రఫీ చేయించుకుంటే అది ప్రాథమిక స్థాయిలోనే తెలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం సిగరెట్లకు దూరంగా ఉండటం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.

గర్భాశయ క్యాన్సర్

ప్రపంచంలోని ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళా గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ గా ఇది పేరుపొందింది. గర్భశయ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ కారణంగా వస్తుంది. దీనిని రాకుండా ముందు జాగ్రత్తగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలి. సురక్షితమైన శృంగారంలోని పాల్గొనాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. తరచూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి

పిసిఒడి

దీన్నే పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పోలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఇది కూడా మరొక ప్రమాదకరమైన వ్యాధి హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల్లో తిత్తులు ఏర్పడడం వల్ల ఇది కలుగుతుంది. రుతుస్రావం సమస్యలతో పాటూ అనేక సమస్యలు వస్తాయి. పిసిఒడి వచ్చిన మహిళలు ప్రశాంతంగా జీవించలేరు. అనేక మానసిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. కాబట్టి ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి. బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోండి. ఒత్తిడిని నివారించండి.

గుండె జబ్బులు మహిళలకే ఎక్కువ

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. గత ఐదేళ్లలో స్త్రీలలోనే గుండె జబ్బులు 10 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత తరగతి మహిళల్లోనే అది కూడా వ్యాపార రంగంలో ఉన్న మహిళల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ప్రతి రోజు యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. ఆ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవాలి. అలాగే అధిక రక్తపోటును కూడా అదుపులో పెట్టవలసిన అవసరం ఉంది.

ఆస్టియోపొరోసిస్

ఆస్టియోపోరోసిస్ బారిన పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా పడుతున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం 50 ఏళ్లు దాటిన మహిళల్లో 42.5% మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటే 24.6% మంది పురుషులు మాత్రమే ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ఆస్టియో పోరోసిస్ కారణంగా ఎముకలు బలహీనంగా అయిపోతాయి. ఎముకలను రక్షించే హార్మోన్ అయినా ఈస్ట్రోజన్... మెనోపాజ్ తర్వాత తగ్గిపోతుంది. దీనివల్లే మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. కాబట్టి మీరు కాల్షియం అధికంగా ఉండే పండ్లను తినాలి. పాల ఉత్పత్తులను తీసుకోవాలి. విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవాలి. కొంత సమయం ఎండలో నిల్చునేందుకు ప్రయత్నించాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం