ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు మొదలైపోయాయి. యేసును శిలువ వేసినందుకు బాధతో క్రైస్తవ సోదరులంతా నలుపు దుస్తులు ధరించి గుడ్ ఫ్రైడేను సంతాపదినంగా నిర్వహించుకుంటారు.
గుడ్ ఫ్రైడే ఎప్పుడు నిర్వహించుకోవాలి అన్నది చంద్రమాన క్యాలెండర్ పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 23 మధ్య ఎక్కువగా గుడ్ ఫ్రైడే పండుగ వస్తూ ఉంటుంది. గుడ్ ఫ్రైడే రోజే యేసును శిలువ వేశారు రోమన్ పాలకులు.
ప్రజలు చేసిన పాపాలకు తనను తానే యేసు బలి ఇచ్చుకున్నాడని చెప్పుకుంటారు క్రైస్తవ సోదరులు. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ ఇచ్చాము.
1. గుడ్ ఫ్రైడే కి దాదాపు 40 రోజులు ముందు నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ఆచారాలను మొదలుపెడతారు. ఉపవాసాలు చేయడం ప్రారంభిస్తారు.
2. గుడ్ ఫ్రైడే నాడు యేసుక్రీస్తు పలికిన ఏడు చివరి వాక్యాలను ప్రార్థన సమయంలో గుర్తు చేసుకుంటారు.
3. గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు యేసును ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ సమయంలోనే యేసును శిలువ వేశారని అంటారు. అందుకే ఈ సమయం గుడ్ ఫ్రైడే రోజు ఎంతో ముఖ్యమైనది.
4. గుడ్ ఫ్రైడే రోజు చర్చి గంటను మోగించరు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోరు. ఎవరి పెదాలపై కూడా నవ్వు కనిపించదు. ఆరోజు ప్రసాదంగా తీపి రోటీలను పంచుతారు.
5. దక్షిణ అమెరికాలో కనిపించే అందమైన జలచరాలు కాపీబరాస్. ఇవి అతి పెద్ద ఎలుక జాతి జీవులు. వీటిని దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చేపలుగా భావించి గుడ్ ఫ్రైడే రోజు తింటారు.
6. గుడ్ ఫ్రైడే రోజు హాట్ క్రాస్ బన్స్ తయారు చేస్తారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ హార్ట్ క్రాస్ బన్స్ అదృష్టంగా భావిస్తారు. ఈ బన్స్ ఎప్పటికీ చెడిపోవని నమ్ముతారు. అలాగే ఇంటిని అగ్ని ప్రమాదాల నుండి కాపాడుతుందని కూడా చెప్పుకుంటారు.
7. కొన్ని దేశాల్లో గుడ్ ఫ్రైడే రోజు హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల సంవత్సరం పొడవునా తలనొప్పి రాకుండా ఉంటుందని నమ్ముతారు.
8. జమైకాలో సూర్యోదయానికి ముందు ఒక గుడ్డును పగలగొట్టి ఒక గ్లాసు నీటిలో గుడ్డులోని తెల్ల సొనను మాత్రమే కలుపుతారు. ఇది అక్కడ ఒక ఆచారంగా వస్తుంది. అమెరికాలో గుడ్లకు రంగు వేసే ఆచారం ఉన్నట్టే జమైకాలో ఇలా గ్లాసు నీటిలో గుడ్డు తెల్ల సొనను కలిపే సంప్రదాయం వచ్చింది.
9. జర్మనీలో గుడ్ ఫ్రైడే రోజు ఎవరూ నృత్యం చేయడానికి వీలు లేదు. ఆ రోజు అన్ని క్లబ్బులను మూసివేస్తారు. ఇది ఒక సంతాప శుక్రవారంగా ప్రకటిస్తారు. ఆరోజు ఎవరు డాన్స్ చేసిన దాన్ని నేరంగా పరిగణిస్తారు.
10. న్యూజిలాండ్ లో గుడ్ ఫ్రైడే రోజు బ్రాడ్ కాస్టింగ్ చట్టం కూడా చేశారు. ఆ చట్టం ప్రకారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు టీవీలో, రేడియోలో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. వేడుకలకు దూరంగా ఉండాలి.
11. గుడ్ ఫ్రైడేకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేర్లు ఉన్నాయి. దీన్ని ఈస్టర్ ఫ్రైడే అని కొంతమంది పిలుస్తారు. అలాగే హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, సైలెంట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు.
12. కొన్నిచోట్ల గుడ్ ఫ్రైడే రోజు చర్చి గంటలను 33 సార్లు మోగిస్తారు. క్రీస్తు ఈ భూమిపై గడిపిన సంవత్సరాలను గుర్తు చేసుకోవడానికి ఇలా 33 సార్లు గంటలు మోగిస్తారని చెప్పుకుంటారు.
సంబంధిత కథనం