Cholesterol: సైలెంట్‌గా మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే ఆరు ఆహారాలు ఇవిగో, ఈ రోజు నుంచే తినడం మానేయండి
Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యానికి దెబ్బపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీకుంది. ఎలాంటి ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసుకోండి.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ఆయుష్షు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మీకు నడుస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తున్నా, హఠాత్తుగా శ్వాస ఆడకపోయినా, ఛాతీలో నొప్పి వస్తూ పోతూ ఉన్నా, అలసటతో ఇబ్బంది పడుతున్నా మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలు ఏవో తీసుకొని తెలుసుకొని వాటిని తినడం మానేయాలి.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
కొలెస్ట్రాల్ అంటే శరీరంలోని కణాలకు అవసరమైన కొవ్వు పదార్థం. ఇది అవసరానికి మించి శరీరంలో చేరితే చెడు కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. మన శరీరం కూడా కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొవ్వును జీర్ణం చేయడంలో సహాయపడే హార్మోన్లు, విటమిన్ డి, బైల్ యాసిడ్స్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలను ఉత్పత్తి చేయడానికి ఈ కొలెస్ట్రాల్ అత్యవసరం. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో లిపో ప్రోటీన్ల ద్వారా ప్రయాణం చేస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అతిగా పేరుకు పోతే అది చెడు కొలెస్ట్రాల్ గా మారిపోతుంది.
కొలెస్ట్రాల్ గుండె ధమనుల ఆరోగ్యం పై నేరుగా ప్రభావాన్ని చూపిస్తోంది. ధమనుల గోడలపై పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల ధమనులు కూడా సంకోచిస్తాయి. దీనివల్ల గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే అధిక రక్తపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కొన్ని రకాల ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోయేలా చేస్తుంది.
ప్రాసెస్ చేసిన మాంసాలతో చేసిన సాసేజ్‌లు, హాట్ డాగ్స్, బేకన్స్ వంటివి తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన మాంసాలలో నిల్వ చేసేందుకు వీలుగా సోడియంతో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా అధికంగా కలుపుతారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
నూనెలో వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, చికెన్ ముక్కలు వంటివి కూడా ట్రాన్స్ ఫ్యాట్స్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చేరాక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి... మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి అలాంటివి తినడం మానేయాలి.
పాలు ఆరోగ్యానికి మంచిదే అయితే కొవ్వులేని పాలను వాడడమే మంచిది. కొవ్వు ఉన్న పాలను తాగడం లేదా ఆ పాలతో చేసిన పెరుగు, పాలు, వెన్న, చీజ్ వంటివి తినడం వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతాయి. కొవ్వు తీయని పాలను అధికంగా వాడడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మనకు తెలియకుండానే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొవ్వు రహిత పాలన వాడడమే మంచిది.
మటన్ తగ్గించాలి
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటివి అధికంగా నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడతారు. అయితే వీటిలో మటన్ తినడం చాలా వరకు తగ్గించడం మంచిది. ఇది సంతృప్తి కొవ్వులను పెరిగేలా చేస్తుంది. దీనిలో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నప్పటికీ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మటన్ తినకపోవడమే మంచిది.
పేస్ట్రీలు, కుకీలు, కేకులు వంటి బేకింగ్ వస్తువులు ఉత్పత్తులను కూడా తినకపోవడమే ఉత్తమం. వీటిలో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ శుద్ధి చేసిన చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. వీలైనంత వరకు బేకరీ ఉత్పత్తులను ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
జంక్ ఫుడ్స్
బయట దొరికే చైనీస్ ఫుడ్స్, చిప్స్, క్రాకర్స్, మైక్రోవేవ్లో చేసే పాపకార్న్ వంటివి కూడా తినడం చాలా వరకు తగ్గించాలి. ఇవి కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ సంతృప్తి కొవ్వులను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అయిపోతుంది. వీటన్నిటికీ బదులు తాజా పండ్లు, కూరగాయలు వంటివి తినేందుకు ప్రయత్నించండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్