Friday Motivation: ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో జీవించడానికి సద్గురు చెబుతున్న స్ఫూర్తి వచనాలు ఇవిగో
Friday Motivation: ప్రతి ఒక్కరూ దీర్ఘాయుష్షుతో జీవించాలి అనుకుంటారు. ఆరోగ్యంగా జీవించాలనుకుంటారు. దీనికి ఆధ్యాత్మిక వేత్త సద్గురు కొన్ని చిట్కాలను చెబుతున్నారు.
Friday Motivation: ఎక్కువకాలం జీవించాలని... అదికూడా ఆరోగ్యంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యం అంటే భౌతికంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఔషధాలు వాడాల్సిన అవసరం రాకుండా జీవించడం. అలా జీవించాలంటే ఏం చేయాలో ఆధ్యాత్మికవేత్త సద్గురు వివరిస్తున్నారు. అతను చేసిన బోధనలు దీర్ఘాయుష్షును అందించేవిగా ఉంటాయి.

ఎక్కువ కాలం పాటు జీవించాలంటే ముందుగా మన ఆహార పద్ధతులను మార్చుకోమంటున్నారు సద్గురు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టమంటున్నారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, నట్స్ వంటివి అధికంగా తినమని చెబుతున్నారు. సద్గురు చెబుతున్న ప్రకారం ఈ ఆహారాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఆహారంలో తాజా పండ్లను చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి.
కదలకుండా గంటలు గంటలు ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు సద్గురు. ప్రతి రోజూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలని అదే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుందని వివరిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం కీలకమైన అంశం అని వివరిస్తున్నారు. సద్గురు చెప్పిన ప్రకారం యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను కాపాడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతి రోజూ సూర్య నమస్కారాలను చేయడం నేర్చుకోమని వివరిస్తున్నారు.
దీర్ఘాయువు మంచి ఆహారంతోనే కాదు, చక్కని నిద్రతో కూడా ముడిపడి ఉంది. సద్గురు చెప్పిన ప్రకారం నిద్రలో నాణ్యత తగ్గితే ఆరోగ్యానికి కీడు వాటిల్లుతుంది. ప్రశాంత వాతావరణంలో ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మనసు రిలాక్స్ గా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నాణ్యమైన నిద్ర మన శరీరానికి మనసుకు పునరుజ్జీవాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మానసిక ఆరోగ్యానికి ధ్యానం ఎంతో ముఖ్యమైనది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అంతర్గత శాంతిని సమతుల్యతను ఇస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా రోజూ అరగంట పాటు ధ్యానం చేస్తే ఎంతో మంచిది. ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రత, స్పష్టత, భావోద్వేగ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
ప్రకృతితో మీ జీవితాన్ని ఎంతగా కనెక్ట్ చేసుకుంటే అంత ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు సద్గురు. తత్వశాస్త్రంలో ప్రకృతితో అనుసంధానం అనేది మరొక ముఖ్యమైన అంశం అని వివరిస్తున్నారు. ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీకు అంతర్గత శాంతి దొరుకుతుంది.దీనివల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ప్రకృతిలో ప్రతిరోజూ గంట పాటు ఉండండి చాలు. ప్రకృతి అనగానే రోడ్లమీద తిరగడం మాత్రం కాదు, చెట్ల మధ్య ప్రకృతిలో ఆ పచ్చదనాన్ని చూస్తూ కాసేపు గడపాలి. ఇది మానసిక శ్రేయస్సుకు చాలా అవసరం. మంచి ఆహారం, వ్యాయామం, సానుకూల ఆలోచనలు... ఇవన్నీ కూడా మనిషి ఆయుష్షును పెంచుతాయని సద్గురు వివరిస్తున్నారు.