10 food habits for winter: వింటర్‌లో ఉండాల్సిన 10 ఆహారపు అలవాట్లు ఇవే
10 food habits for winter: వింటర్ సీజన్ పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా, వెచ్చగా ఉండేందుకు అనుసరించాల్సిన 10 ఆహారపు అలవాట్లపై డైటీషియన్ల సలహాలు చదవండి.
చలికాలంలో మన శరీరం పోషణతో పాటు వెచ్చదనం ఇచ్చే ఆహారాన్ని కోరుకుంటుంది. ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్, నట్స్, నువ్వులు వంటి నూనె గింజలు వంటివి వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే భూఉపరితలం కింద పండే దుంపలు కూడా శీతాకాలంలో మన శరీరానికి వెచ్చదనం ఇస్తాయి.
చలికాలంలో చాలా మందిని పలు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శరీరంలో వాపు, కడుపు ఉబ్బరం, జలుబు, దగ్గు, జ్వరం, గుండె జబ్బులు రావడం వింటర్‌లో సర్వ సాధారణం.
డైటీషియన్ నీలమ్ అలీ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. శరీరంలో సుదూరంగా ఉన్న అవయవాళకు రక్తం సరఫరా చేసే నాళాలు చాలా సన్నగా ఉంటాయి. చలికాలంలో ఇవి మరింత కుంచించుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరికాళ్లు, చేతులు, వేళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో అవి వాపునకు గురవుతాయి. ఎరుపు రంగులోకి మారుతాయి. లేదా దురద పుడుతుంది.
‘ముందుగా శారీరకంగా చురుగ్గా ఉంటే రక్త సరఫరా మెరుగుపడుతుంది. బాగా చన్నీటిలో నానడం మంచిది కాదు. ఎప్పుడైనా బాగా చల్లని నీటిలో చేయిపెట్టి తదుపరి వేడి నీటిలో చేయి పెడితే మీ రక్త ప్రసరణలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. చల్లని ప్రదేశానికి వెళ్లినప్పుడు కాటన్ సాక్స్, చేతులకు గ్లవ్స్ ధరించాలి. చలికాలంలో నీరు తాగడం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది..’ అని చెప్పారు. వింటర్‌లో ఉండాల్సిన 5 అలవాట్లను సూచించారు.
వింటర్‌లో ఉండాల్సిన 5 ఆహారపు అలవాట్లు
- టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు: చలికాలంలో టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. వీటివల్ల అధిక మూత్ర ఉత్పత్తి అవుతుంది. ఇలా కావడం వల్ల రక్త పరిమాణం తగ్గుతుంది.
- పండ్లు, సలాడ్లు తీసుకోండి: శీతాకాలంలో తరచుగా పండ్లు, సలాడ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మిమ్మల్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
- నట్స్, సీడ్స్: వాల్ నట్స్, బాదాం, గుమ్మడి గింజలు, నువ్వులు వంటివి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. మీరు వెచ్చగా ఉంటే మీ బ్లడ్ ప్రెజర్ సాధారణ స్థితికి చేరుకుంటుంది.
- నెయ్యి వాడండి: నెయ్యి వాడడం వల్ల మీ జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా, మలబద్దకాన్ని నివారిస్తుంది. నెయ్యి విటమిన్ డీ కూడా ఇస్తుంది. ఇది కాల్షియం శోషణకు ఉపయోగపడుతున్నందున మీ ఎముకలకు బలం. చలి వాతావారణంతో పోరాడేందుకు మీ శరీరానికి కాస్త అదనంగా మంచి కొవ్వు కూడా అవసరమే.
- గుడ్లు, చేపలు: వింటర్‌లో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం కూడా అవసరం. అప్పుడే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే చేపలు, గుడ్లు కూడా తినాలి. వింటర్ సీజన్‌లో లభించే కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తినాలి.
ఈ 5 వింటర్‌లో తీసుకోండి
జిందాల్ నేచర్ క్యూర్ చీఫ్ డైటీషియన్ సుష్మా పీఎస్ వింటర్‌లో తీసుకోవాల్సిన 5 ఆహార పదార్థాల గురించి వివరించారు.
- అల్లం, అతిమధురం (ములేథి టీ): జీర్ణ క్రియకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. అలాగే అతి మధురం కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
- పండ్లు: బొప్పాయి, పైనాపిల్ వెచ్చదనాన్ని ఇస్తాయి. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఆమ్లా మురబ్బా, ఆమ్లా జ్యూస్ శీతాకాలంలో మార్కెట్లో పుష్కలంగా లభిస్తాయి.
- చిలగడ దుంప: శీతాకాలంలో స్వీట్ పొటాటో (శక్కర్‌కంది) కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం ఉంటాయి. తరచుగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరం విటమిన్ సీని శోషించుకునేందుకు ఉపయోగపడుతుంది.
- చిరుధాన్యాలు: చిరుధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో రాగులు మంచి ఆహారం. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అమైనో యాసిడ్ ఆకలిని తగ్గిస్తుంది. బరువును తగ్గిస్తుంది. రాగులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. సజ్జల్లో ఉండే ఫైబర్, విటమిన్ బీ మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి.
- నట్స్: వింటర్ సీజన్‌లో నట్స్ తరచుగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరతత్వం వేడిగా ఉండేవారు వీటిని తీసుకోవాలి. బాదాంలు, వాల్‌నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి. బాదాం గింజల్లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడంట్లు, మెగ్నీషియం ఉంటాయి. వాల్‌నట్స్‌లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఖర్జూరాల్లో విటమిన్లు, ఖనిజలవణాలు, ఐరన్, ఫైబర్ దండిగా ఉంటాయి. స్నాక్స టైమ్‌లో వీటిని తీసుకోవడం వల్ల వింటర్‌లో వెచ్చగా ఉండొచ్చు.