Periods Bleeding: నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవుతోందా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చు
పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు అధిక రక్తస్రావం అనుభవిస్తారు.అధిక రక్తస్రావం కారణంగా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు.అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి కొన్ని దశలను పాటించాలి.
రుతుచక్రం అనేది ప్రతి నెలా మహిళలకు సంభవించే ఒక సాధారణ ప్రక్రియ. ఒక్కో స్త్రీకి ఒక్కోలా రుతుచక్రం సంభవిస్తుంది. ప్రతి నెలా 28 రోజుల తరువాత నెలసరి వస్తూ ఉంటుంది. కొందరికి మాత్రం 35 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంది. మహిళల్లో కొంతమందికి రెండు రోజులు బ్లీడింగ్ అయితే, మరికొందరికి ఏడురోజుల పాటూ బ్లీడింగ్ అవుతుంది.
అమ్మాయిలకు రుతుచక్రం ప్రారంభమైన రోజుల్లో అధిక రక్తస్రావం అవుతూ ఉంటుంది. రక్తస్రావం కారణంగా, రోజుకు 2-3 ప్యాడ్ లను మార్చాల్సి ఉంటుంది, కొంతమంది రోజుకు 5-7 ప్యాడ్ లను మార్చాల్సి ఉంటుంది. మహిళల్లో ఈ అధిక రక్తస్రావం శరీరాన్ని బలహీనపరుస్తుంది. అంతే కాదు, ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది.
అధిక రక్తస్రావం ఎందుకు?
అధిక రక్తస్రావం కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు, నియోప్లాజమ్స్, కణితులు వంటి సమస్యలు ఉన్నవారిలో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కలిగిస్తాయి. వీటితో పాటు, అధిక రక్తస్రావానికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు అండోత్సర్గము లేకపోవడం వల్ల కూడా రక్తస్రావం ఎక్కువవుతుంది. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ను పాటించడం వల్ల అధికరక్తస్రావాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
అధికరక్తస్రావం తగ్గించే చిట్కాలు
ఆవాల పొడి చికిత్స: ఇంట్లోనే ఆవాల పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. అధిక రక్తస్రావం సమస్యతో బాధపడుతుంటే ఆవాలు పొడి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పొడి తినడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. ఆవాలను ఎండబెట్టి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తాగుతూ ఉంటే ఎంతో మంచిది.
సోంపు నీరు: సోంపు తీసుకోవడం ద్వారా అధిక రక్తస్రావం అదుపులో ఉంటుంది. సోంపును ముతక పేస్ట్ లా గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి. నీళ్లలో మరిగించాలి. కాసేపు మరిగిన తర్వాత ఈ నీటిని వడగట్టి తాగితే రక్తస్రావం అదుపులో ఉంటుంది.
ఐస్ ప్యాక్స్: అధిక రక్తస్రావం ఉంటే పొట్ట కింది భాగంలో ఐస్ ప్యాక్ లు పెట్టుకోవాలి. టవల్ పై కొన్ని ఐస్ ప్యాక్ లు వేసి పొట్ట కింది భాగాన్ని 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే రక్తస్రావం తగ్గుతుంది.
మెంతి నీరు: అధిక రక్తస్రావం అవుతున్నట్లయితే మెంతి నీరు త్రాగాలి. ఒక గ్లాసు నీటిలో మెంతులను వేసి నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక చెంచా తేనె మిక్స్ చేసి వేడి వేడిగా త్రాగాలి. రోజుకు రెండు మూడు గ్లాసుల మెంతి నీరు తాగితే రక్తస్రావం తగ్గుతుంది.
ప్రపంచంలో ఎంతో మంది మహిళలు నెలసరిలో అధిక రక్తస్రావం సమస్యతో బాధపడుతున్నవారే. ఇలా ప్రతినెలా ఎక్కువస్థాయిలో రక్తం బయటికి పోతుంటే ఆ స్త్రీలు త్వరగా రక్తహీనత సమస్య బారిన పడతారు. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. తగిన ఆహారం తినడం ద్వారా అధిక రక్త స్రావాన్ని అదుపులో చేసుకోవాలి.
టాపిక్